హైదరాబాద్ పై రిఫరెండం..ఇదేమీ కిరికిరి కేసిఆర్ ?

 

తెలంగాణా ఉద్యమం జోరుగా సాగుతున్నప్పుడు కేసిఆర్  అకస్మాత్తుగా మాయం అయిపోవడం, లేదా ఎవరూ ఊహించలేని విధంగా ఏదో ప్రకటన చేసి కొంత గందరగోళం సృష్టించడం అందరూ ఎరిగినదే. కేంద్రం నుండి తెలంగాణాకి అనుకూలంగా బలమయిన సంకేతాలు వస్తున్న ఈ తరుణంలో, కేవలం మరొక పదిరోజుల్లో తెలంగాణా అంశంపై తాడోపేడో తేలనున్న ఈ తరుణంలో, మళ్ళీ కేసిఆర్  కొద్ది రోజులుగా కనబడక పోవడమే గాకుండా, తిరిగిరాగానే హైదరాబాద్ పై రెఫరెండం పెట్టి, అది ఎవరికీ చెందాలో నిర్నయిద్దామని ప్రకటించి, కేంద్రానికి, సీమంద్రవాసులకు రాని ఒక సరికొత్త ఐడియాను చెప్పడంతో తెలంగాణావాదులు భగ్గుమన్నారు.

 

హైదరాబాదును కొన్ని సం.ల పాటు ఉమ్మడి రాజధానిగా చేస్తే ఎలా ఉంటుందని కేంద్రం ఆలోచిస్తున్న ఈ తరుణంలో, కేసిఆర్  ఈ విధంగా హైదరాబాద్ పై రెఫరండం అనడం చూస్తే అయన కోరుండి హైదరాబాదును వదులుకోవాలని ఆలోచిస్తున్నారా? అనే సందేహం కలుగక మానదు. ఎందుకంటే, జంట నగరాలలో తెలంగాణావారికన్నా కూడా ఎక్కువగా సీమంధ్ర మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన స్థిరపడిన ప్రజలే ఉన్నారు. ఆ కారణం చేతనే తెరాస ఇంతవరకు జరిగిన ఎన్నికలలో జంట నగరాలలో తన ప్రభావం చూపలేకపోతోంది. మరటువంటప్పుడు అయన తెలంగాణాపై రెఫరెండంకి వెళదామని అనడంలో ఆయన ఉద్దేశం ఏమిటి అని తెలంగాణావాదులే ప్రశ్నిస్తున్నారు.

 

కీలకమయిన ఈ సమయంలో అయన విధమయిన ప్రకటనచేయడం తెలంగాణా విషయంలో కేంద్రాన్నితప్పుదారి పట్టించడంలో అయన ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కేసిఆర్  ఈవిధంగా ప్రకటించడం చూస్తే, సీమంద్రులకి ఆయనే స్వయంగా ఒక ఆయుధం అందించి, దశాబ్దాలుగా రావణకాష్టంలా మండుతున్న తెలంగాణా అంశానికి సరిగ్గా పరిష్కారం అయ్యే దశలో సైంధవునిలా అడ్డుపడుతున్నారని తెలంగాణావాదులు భగ్గుమన్నారు.

 

అసలు ఈ విధంగా ఎవరూ ఊహించని ప్రతిపాదన అయన ఎందుకు చేసారని ఆలోచిస్తే మనకు రెండు మూడు కారణాలు కనిపిస్తాయి. తెలంగాణా నుంచి హైదరాబాద్ ఎట్టి పరిస్థితుల్లో విడిపోకూడనే అయన తాపత్రయం కారణం కావచ్చును. జంట నగరాలలో తమ పార్టీకున్న బలంతో ప్రజలను నయాన్నో భయాన్నో తెలంగాణకు అనుకూలంగా ఓటువేయించుకోవచ్చుననే ధీమాతోనే ఆయన ఆ ప్రతిపాదన చేసి ఉండవచ్చును.

 

కాంగ్రెస్ తెలంగాణా రాష్ట్రం ప్రకటించేమాటయితే తెరాసను ఆ పార్టీలో కలిపేస్తామని కేసీర్ స్వయంగా ప్రతిపాదించేరు గనుక, జనవరి 28వ తేదిన కేంద్రం తెలంగాణా ప్రకటన చేసే సూచనలు ఉన్నందున మాట ప్రకారం తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేయవలసివస్తే, ఇక తనకీ, తన నేతలకి కూడా ఇంతవరకు ప్రజలలో ఉన్న ప్రత్యేక గుర్తింపు ఉండబోదనే నిజం గ్రహించడంవలన ఆ ఆందోళనతో తెలంగాణా ప్రకటనను జాప్యం చేయించే ఆలోచనతో ఈ ప్రకటనచేసి ఉండవచ్చును.

 

ఇంతకాలం తెరాస అధినేతగా రాష్ట్ర రాజకీయాలు శాసిస్తున్న కేసిఆర్ , కాంగ్రెస్ పార్టీలో జేరవలసి వస్తే, ఇంతవరకు ఏ సోనియమ్మ, రాహుల్ గాంధీలను, అధిష్టానాన్నినోరార తిట్టేడో, ఇప్పుడు వారి కాళ్ళ వద్దే పడిఉండక తప్పదనే ఆలోచనే ఆయనకి చాల భయంకరంగా కనిపించడం కూడా ఒక కారణం కావచ్చును.

 

తెలంగాణా ప్రకటనకి, తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనానికి ముడిపెట్టి అయన స్వయంగా చేసిన ప్రతిపాదన ఇప్పుడు ఈవిధంగా అకస్మాతుగా తన మెడకే చుట్టుకోవడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న కేసిఆర్  అందులోంచి బయటపడే ప్రయత్నంలో భాగంగానే ఈ రెఫరెండం ప్రతిపాదన చేసి తద్వారా ఈ గండం నుండి ఎలా గట్టేకాలో ఆలోచించేందుకు కొంత సమయం పొందే ప్రయత్నం కావచ్చును.

 

ఎన్నికల సమయం వరకు కేంద్రం ఖచ్చితంగా తెలంగాణా ప్రకటించదని ధృడంగా విశ్వసిస్తున్నకేసిఆర్ , రానున్న ఎన్నికలలో తెలంగాణాలో అన్ని నియోజక వర్గాలకు తెరాస పోటీచేయబోతోందని ముందే ప్రకటించడం జరిగింది. తెలంగాణా సెంటిమెంట్ బలంగా ఉంటేనే ఎన్నికలలో పూర్తీ మెజార్టీ సాదించే అవకాశం ఉంది.

 

కాంగ్రెస్ పార్టీ తెలంగాణా అంశంపై ఎంత జాప్యంచేస్తే అంత తెరాసకు లాభం అని కాంగ్రెస్, తెరాస రెండూ గ్రహించాయి. గానీ, ఊహించని విధంగా ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణా ప్రకటన చేసేందుకు సిద్దం కావడంతో తన కలలు కల్లలు కాబోతున్నందున కేసిఆర్  తీవ్ర ఆందోళనకి గురయి కేంద్రం తన నిర్ణయాన్ని మరికొంత కాలం వాయిదా వేసేందుకు ఈ ప్రతిపాదన తెచ్చి ఉండవచ్చును.

 

ఒక వేళ కేంద్రం దీనికి అంగీకరిస్తే, సమస్య ఎటూ మరింత జటిలం చేయగలిగే సత్తా తనకి ఉంది కనుక, ఎన్నికల సమయం దగ్గిర పడేవరకూ తెలంగాణ భావోద్వేగాలను తనకు అనుకూలంగా మలుచుకొనే అవకాశం ఉంటుంది.

 

స్వయంగా రాజ్యాదికారం పొందగలిగే అవకాశాన్ని వదులుకొని, కాంగ్రెస్ పంచన జేరడం అటువంటి వ్యక్తిత్వం ఉన్నవారెవరూ ఊహించలేరు. కనుకనే, ఎన్నికల వరకు తెలంగాణా అంశాన్ని సాగ దీయడం కోసం ఈ ప్రతిపాదన చేసి ఉండవచ్చును.

 

తెలంగాణా అంశం, భావోద్వేగాలు లేనప్పుడు సహజంగానే కేసిఆర్ , అయన నాయకులూ, అయన తెరాస పార్టీ, జేయేసీలు అన్నీ కూడా తమ ప్రాధాన్యతని కోల్పోతాయి. అందువల్లనే, తెలంగాణా అంశం ఎంతకాలం సాగదీస్తే అంట మంచిదని అయన భావిస్తూ ఇటువంటి ప్రతిపాదన చేసి ఉండవచ్చును.

 

ఏది ఏమయినప్పటికీ, కేంద్రం తెలంగాణా ప్రకటన చేసినట్లయితే అయన తన మాటకు కట్టుబడి తెరాసను కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తారా లేదా, ఆ విధంగా చేయకపోతే కాంగ్రెస్ తెలంగాణా ప్రకటన చేస్తుందా లేదా అనే రెండు సందేహాలు మిగిలిపోయాయి. ఇటువంటి అన్ని ధర్మ సందేహాలు ఈ నెల 28వ తేదీ కేంద్ర ప్రకటనతో తీరుతాయని ఆశిద్దాము.