ఒక మహనీయుని దివ్య స్మృతి

 

తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి 17వ వర్ధంతి నేడు. తెలుగు సినిమా చరిత్రలో మరింకెవరూ కూడా చేయని, చేయలేని అన్నిరకాల పాత్రలు పోషించడమే గాకుండా అపూర్వమయిన తన నటన కౌశలంతో ప్రజల మనసుల్లో ఆరాధ్య దైవంగా నిలిచిపోయేరు. ఒక మహానటుడిగా ఆయన ఎంతటి ఉన్నత శిఖరాలు అధిరోహించారో, రాజకీయ నాయకుడిగా కూడా యావత్ దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలుగుజాతి ఆత్మా గౌరవానికి, పౌరుషానికి ప్రతీకగా నిలిచిన అయన, రాష్ట్రాన్ని, తెలుగు ప్రజనీ యావత్ దేశమూ గుర్తించేలా చేసిన ఘనుడు.

 

మిష్టర్ గిరీశంగా ప్రజలకి కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజలకి వినోదంపంచిన ఆయనే, భారతమాతకు జేజేలు అంటూ బడిపంతులుగా పాఠాలు చెప్పి ఏంతో హృద్యమయిన నటన కనబరిచేరు. ‘పాంచాలీ...పంచభతృకీ...’అంటూ అయన పలికిన డైలాగులు నేటికీ తెలుగు ప్రజల చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంటాయి. సామాజిక, జానపద, పౌరాణిక సినిమాలలో అయన కనబరిచిన ప్రతిభ, అయన ధరించిన వైవిధ్యమయిన పాత్రలు నభూతో నభవిష్యతి అని చెప్పవచ్చును. అయన సినిమాలు, అయన పోషించిన పాత్రలు, ఆయన ప్రతిభ గురించి సవివరంగా చెప్పదలచుకొంటే అదొక మహా గ్రంధమే అవుతుంది.

 

శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా ప్రజలచేత దండాలు పెట్టించుకొన్నఅయనే కర్ణ, దుర్యోధన, లంకేశ్వరుని వంటి ప్రతినాయక పాత్రలు కూడా పోషించి ప్రజలని మెప్పించారు. అయన నటన, ఆహార్యం, రాజసం చూసిన తెలుగు ప్రజలు, ఆయా దేవుళ్ళు, రాజులు కూడా నిజంగా ఆయనలాగే ఉంటారని భావించేంత గొప్పగా సాగింది అయన నటన.

 

ఇక, రాజకీయాలలో సాధారణ రాజకీయ నేతలకు బిన్నంగా, మనసుతో ఆలోచించే రాజకీయవేత్తగా యన్టీఆర్ ప్రజలచేత నీరాజనాలు అందుకొన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9నెలల్లోనే రాష్ట్రంలో అధికారం చేప్పట్టిన ఘనుడు ఆయన. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి, తెలుగు పౌరుషానికి ప్రతీకగా నిలచిన ఆయన, రాష్ట్రంలో మొట్ట మొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పరచిన ఘనుడు. తెలుగు బాష, తెలుగు ప్రజ,తెలుగు సినిమా, తెలుగు సంస్కృతీ, తెలుగు నేల.. ఇలాగ తెలుగుతో ముడిపడిన ప్రతీ అంశాన్ని అభిమానించే అచ్చ తెలుగు హృదయం ఆయనది.

 

రాష్ట్రంలో అనేక సంస్కరణలు అమలుచేసి ఒక నూతన శకానికి నాందిపలికి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తన పాలన సాగాలనుకోనేవారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధికారం చెప్పటినా కూడా, సర్వసంగ పరిత్యాగిగానే పాలన చేసారు. రాష్ట్ర వనరులకు, సంపదలకు అయన ఒక ధర్మకర్తగా వ్యవహరించారు తప్ప, వాటిని దోచుకొని దాచుకోవాలని ఏనాడు కలలో కూడా అనుకోలేదు.

 

తెలుగు జాతి కీర్తిని దశదిశలా వ్యాపింపజేసి, తెలుగు జాతిని యావత్ ప్రపంచం కూడా గుర్తించేలా చేయగలిగిన ఆయనని మాత్రం మన సంకుచిత రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు నేటికీ రాజకీయ రంగుటద్దాలలోంచే చూస్తూ ఆయనకు ఈయవలసిన గౌరవం ఈయలేకపోతున్నారు. ఒక మహా నటుడిని, తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన ఒక మహనీయుడికీ ప్రభుత్వాలు గౌరవ పురష్కారాలు అందించకపోయినా, అయన తెలుగు ప్రజల మనస్సులో శాశ్వితంగా కోలువయున్నాడు. అటువంటి వ్యక్తిని గుర్తించలేక పోవడం ప్రభుత్వ దురదృష్టమే తప్ప ఆయనది కాదు. అయన 17వ వర్దంతి సందర్భంగా యావత్ తెలుగు ప్రజానీకం ఆయనకు ఘన నివాళులు అర్పిస్తోంది.