రజనీకాంత్. . నేనొక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్లే!
posted on May 2, 2023 @ 5:10PM
బాషా ఒక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్లే.. తమిళ స్టార్ రజనీకాంత్ కూడా అంతే.. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ చంద్రబాబు విజన్ పై చేసిన వ్యాఖ్యలూ అంతే. ఆయన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు చేస్తున్న రాద్ధాంతం, విమర్శలపై ఒక్క ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
తెలుగుదేశం అధినేత చంద్ర బాబు కూడా రజనీకాంత్ వ్యాఖ్యలపై వైసీపీ నేతల వ్యాఖ్యలు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే రజనీకాంత్ మాత్రం వైసీపీ నేతల విమర్శలపై వ్యాఖ్యలపై ఇసుమంతైనా స్పందించలేదు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు రజనీకాంత్ కు ఫోన్ చేశారు.
ఆ సందర్భంగా తన విజనరీ వ్యాఖ్యలను మనస్ఫూర్తిగా చెప్పానని అన్నారు. మనసులో ఏముందో అదే చెప్పాననీ చెప్పారు. దీనిపై వచ్చిన విమర్శలను పట్టించుకోననీ తేల్చేశారు. ఉన్న విషయాలే చెప్పాను.. మీ విజన్ విషయంలో ఎవరేమన్నా, ఎన్ని విమర్శలు చేసినా నా అభిప్రాయం మారదంటూ స్పష్టం చేశారు. నా అభిమానులకు కూడా అదే చెప్పాను. వైసీపీ విమర్శలపై స్పందించొద్దు, సంయమనం పాటించాలని చెప్పానని రజనీకాంత్ చంద్రబాబుకు వివరించారు.