రాజీనామా చేస్తానన్న కడియం! జంపింగ్ ఖాయమేనా..
posted on Mar 21, 2021 @ 1:12PM
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత , మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కొత్త పార్టీ సిగ్నల్ ఇచ్చారు. ఇక నేతల వలసలు కూడా జోరందుకున్నాయి. బీజేపీలోకి వలసలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ ఉప ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించి కలకలం రేపారు కడియం శ్రీహరి.
వరంగల్ జిల్లా అధికారపార్టీలో చాలా కాలంగా వర్గ విభేదాలు ఉన్నాయి. గతంలోనూ చాలా సార్లు నేతలు బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో అయితే విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. నియోజకవర్గంలో పట్టుకోసం ఎమ్మెల్యే రాజయ్య. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య ఆదిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. ఎవరికి వారు నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యను ఉద్దేశించి కడియం సంచలన వ్యాఖ్యలు చేశారు. చేతకానివాడు, ఒక్క రూపాయి కూడా సహాయం చేయనివాడు.. చాలా మాట్లాడతాడని, చెల్లని రూపాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరిదగ్గర చాయ్ తాగినా, పదవి, పనులు ఇప్పిస్తానని ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపించినా ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు కడియం శ్రీహరి. నిరూపిస్తే తన పదవికి కూడా రాజీనామా చేస్తానని తెలిపారు. పదవులు అమ్ముకుంటున్నారు.. పనులు అమ్ముకుంటున్నారని కడియం శ్రీహరి మండిపడ్డారు. నెత్తిమీద రూ. 10 పెడితే అమ్ముడుపోనివారు కూడా మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్యే రాజయ్యను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి వ్యాఖ్యలు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు అధికార టీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. కడియం పార్టీ జంప్ చేస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. అందుకే ఎమ్మెల్యేను టార్గెట్ చేశారని చెబుతున్నారు.