కేఏ పాల్..నవ్యులు పూయించే పొలిటికల్ కమేడియన్!
posted on Jul 30, 2022 8:03AM
సినిమాలో బ్రహ్మానందం కనిపించగానే ఆయన డైలాగులతో, నటనతో సంబంధం లేకుండా ప్రేక్షకుడి మొహం ఆనందంతో విప్పారిపోతుంది. అతడి ప్రమేయం లేకుండానే పెదవులు విచ్చుకుని నవ్వు వచ్చేస్తుంది. కమేడియన్ గా బ్రహ్మానందం ప్రక్షకుల్లో సంపాదించుకున్న క్రేజ్ అది. సరిగ్గా అలాంటి క్రేజే రాజకీయాలలో మరో కమేడియన్ కు వచ్చేసింది. బ్రహ్మానందం అంటే ప్రేక్షకుడికి అభిమానం, ప్రేమ, గౌరవం అన్నీ ఉంటాయి. కానీ ఈ రాజకీయ కమేడియన్ మాత్రం కేవలం ప్రగల్భాల లాంటి మాటలతో కితకితలు పెట్టి బలవంతంగా నవ్విస్తాడు.
ఆ రాజకీయ కమేడియన్ పేరు కేఏ పాల్. ప్రజా శాంతి పార్టీ అధినేత. ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆయనను పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఏపీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, దేశ ప్రధాని ఇలా అన్ని పదవులకూ తనను మించిన అర్హుడు లేడని తొడగొట్టి మరీ చెబుతారు. పనిలో పనిగా మోడీ నుంచి ఆయన నోటికి తెలిసిన నాయకులందరూ తనను త్వమేవ శరణం నాస్తి అన్నట్లుగా ఆశ్రయించారనీ.. కానీ రాజీ పడటం ఇష్టం లేకనే తాను ఎవరితో కలవకుండా ఒంటరిగానే దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసేందుకు రంగంలోకి దిగానని చెప్పుకుంటారు.
రాజ్యం, సైన్యం లేని మహారాజును తానేనని అంటారు. ఆయన తాజాగా ఏపీ ముఖ్యమంత్రి, విపక్ష నేతలపై కొన్ని విమర్శలు చేశారు. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో తెగ ట్రోల్ అవుతున్నాయి. పాల్ గారికి అటువంటి ట్రోలింగ్ పై పెద్ద పట్టింపు లేదను కోండి అది వేరే సంగతి. కానీ ప్రజలకు ఆయన ప్రసంగాలు, సామాజిక మాధ్యమంలో ఆయనపై వచ్చే సెటైర్లు మంచి వినోదాన్ని పంచుతాయనడంలో సందేహం లేదు.
తాజాగా ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనను బుజ్జగించేందుకు చాలా ప్రయత్నం చేశారని అన్నారు. తనను కలవాల్సిందిగా చంద్రబాబు కబురు పెట్టారని చెప్పుకున్నారు. అయితే సీక్రెట్ మీటింగ్ లు ఎందుకు ఏం మాట్లాడుకున్నా జనం ముందే మాట్లాడుకుందామని ఆయనకు తాను చెప్పాననీ, ఆయన కబురు పెట్టినా తాను వెళ్ల లేదనీ పాల్ చెప్పుకున్నారు. ఇక అదే నోటితో జగన్ గురించి కూడా వాకృచ్చారు. చంద్రబాబుతో రహస్య మీటింగ్ వద్దనుకున్నానన్న పాల్ గారు. జగన్ తో మాత్రం అటువంటి సమావేశానికి తహతహలాడిపోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. తాను కలవాలని ఎన్ని సార్లు ప్రయత్నించినా జగన్ అందుకు అవకాశం ఇవ్వలేదన్నారు.
జగన్ కు తనను ఫేస్ చేసే ధైర్యం లేదనీ, ఆయనో పిరికిపంద అనీ అందుకే తనను కలవడం లేదనీ, తనతో భేటీకి రావడం లేదని చెప్పుకుంటున్నారు. సరే ఆయనేం చెప్పుకున్నా అందరికీ వినోదమే కానీ.. ఒకరితో రహస్య మీటింగ్ వద్దన్నాననీ, అదే సమయంలో మరొకరితో రహస్య మీటింగ్ కు అవకాశం రావడం లేదనీ ఆయన తెగ ఫీలైపోతున్నారు ఎందుకనో. అసలు విషయమేమిటంటే ఆయన పాస్ పోర్టు సీజ్ అయ్యింది. ఇప్పుడు ఆయనకు తక్షణ అవసరం ఆయన పాస్ పోర్టు ఆయనకు రావడం ఈ విషయాన్ని కూడా పాల్ స్వయంగా చెప్పారు. అందుకోసమే జగన్ తో రహస్య మీటింగ్ కు తహతహ. ఆయనకు నచ్చుతుందనే చంద్రబాబు పిలుపును తాను లెక్క చేయలేదని చెప్పుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు.