జగన్ పారదర్శకత నేతి బీరకాయలో నేతి చందమేనా?
posted on Jul 30, 2022 7:19AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన పాలన అంతా పారదర్శకమని అవకాశం వచ్చినా రాకపోయినా, సందర్భమైనా, అసందర్భమైనా సరే పదే పదే చెబుతూ ఉంటారు. ఎక్కడ ఏ సభలోనైనా, ఆ సభ ఏదైనా, ఆఖరికి అధికారుల సమీక్షల్లోనైనా సరే ఆయన నోటి వెంట తన ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తోందన్న మాట రాకుండా ఉండదు. అదే సమయంలో విపక్షంపై విమర్శలూ తప్పవు.
ఇంత గొప్పగా పారదర్శకత గురించి చెబుతున్న జగన్ తమ ప్రభుత్వం జారీ చేసే జీవోలను ఎవరికీ అందుబాటులో లేకుండా ఎందుకు రహస్యంగా, గుట్టుగా దాచేస్తున్నారన్న ప్రశ్న వైసీపీ శ్రేణుల నుంచి వస్తోంది. అయితే విపక్షాలలా వారు ప్రెస్ మీట్లు పెట్టి అడగలేరు కనుక తమ అధినేత మాటల్లోని డొల్ల తనాన్ని అంతర్గత సంభాషణల్లో చర్చలకే పరిమితం చేస్తున్నారు. నిజంగానే జగన్ సర్కార్ అంత పారదర్శకంగా ఉంటే ధానపరమైన నిర్ణయాలపై జారీచేసే జీవోల్ని కోర్టు మందలించినా, తప్పుపట్టినా లెక్క చేయకుండా ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని వైసీపీ వర్గాలే తమలో తాము చర్చించుకుంటున్నాయి.
జీవోఐఆర్ వెబ్సైట్లో జీవోలుఎందుకు పెట్టడం లేదో అర్ధం కావడం లేదనీ, ఇదేనా పారదర్శకత అంటే అని చర్చించుకుంటున్నారు. వైసీపీ పారదర్శకత అంటే ఇదేనా అని విపక్షాలు కూడా నిలదీస్తున్నాయి. అయితే జగన్ కు విమర్శలు వినిపించవు కనుక.. ఈ ప్రశ్నలకు సందేహాలకూ సమాధానం చెప్పే అవకాశం ఆయనకు ఉండదు. ఎంత సేపూ విపక్షం మేనిఫెస్టోను పట్టించుకోలేదు.. తాను మాత్రం మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ లా భావించి అందులో పెట్టిన ప్రతి అంశాన్నీ అమలు చేస్తున్నాననీ, ప్రతి హామీనీ నెరవేరుస్తున్నాననీ చెప్పేస్తూ ఉంటారు. సరే హామీల అమలులో డొల్లతనాన్ని అలా ఉంచితే పారదర్శకత అంటూ ఘనంగా చాటుకుంటున్న జగన్ తన ప్రభుత్వం జారీ చేసే జీవోలను ఎందుకు అందరికీ అందుబాటులో ఉంచడం లేదని విపక్షాలు నిలదీస్తున్నాయి.
ఆ జీవోలను అందరికీ అందుబాటులో ఉంచితే మరిన్ని కోర్టు కేసులు ఎదుర్కొన వలసి వస్తుందన్న భయమే కారణమా అని ప్రశ్నిస్తున్నాయి. జీవోలను ఆన్ లైన్లో ఉంచకపోవడానికి కారణమిదేనా అని నిలదీస్తున్నాయి. జగన్ చెబుతున్న పారదర్శకత నేతి బీరకాయలో నేతి చందమేనని విమర్శిస్తున్నాయి.