Read more!

జగన్ పార్టీకి ఎన్టీఆర్ ప్రచారం?

 

 

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. గుడివాడ నుంచి అసెంబ్లీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలో వున్న కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని)కి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయడానికి సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. కొడాలి నాని హరికృష్ణకి, జూనియర్‌కి సన్నిహితుడు. గతంలో నాని తెలుగుదేశంలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశాడు. నాని వైకాపాలోకి వెళ్ళినప్పటి నుంచి వీరిమధ్య వ్యక్తిగతంగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నప్పటికీ రాజకీయంగా ఎలాంటి బంధం లేకుండా పోయింది.

 

చంద్రబాబు తనను, జూనియర్ ఎన్టీఆర్ని పట్టించుకోవడం లేదన్న కోపంలో వున్న హరికృష్ణ రాష్ట్ర విభజన సాకుచూపించి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. అలాగే తాజాగా హరికృష్ణ తనకు హిందూపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయాలని వుందని నోరు తెరిచి అడిగినా, తెలుగుదేశం పార్టీలో దాన్ని పట్టించుకున్న వారే లేకుండా పోయారు.



ఈసారి ఎన్నికలలో హరికృష్ణ వర్గానికి చెందిన వారికి టిక్కెట్లు వచ్చే అవకాశం లేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్ని అవమానాలు భరిస్తున్న హరికృష్ణ వైసీపీ అభ్యర్థిగా పోటీలో వున్న కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయడమే ఆ అవమానానికి సరైన ప్రతీకారం అని భావిస్తున్నట్టు తెలుస్తోంది.