ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ.. ఆహ్వానితుల హాజరు అనుమానమే!
posted on Jan 9, 2023 @ 1:50PM
తెలంగాణ ముఖ్యమంత్రి,భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అధినేత కల్వకుట్ల చంద్రశేఖర రావు, జాతీయ రాజకీయ ప్రస్థానంలో వడివడిగా అడుగులు వేద్దామనుకుంటున్నారు. అయితే కారణాలేవైనా ఆ అడుగులు తడబడుతున్నాయి. నిజం చెప్పాలంటే కేసీఅర్, గత కొన్నేళ్లుగా జాతీయ రాజకీయాల ప్రస్థానం గురించి ఇదిగో అదిగో అంటూ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. తెరాస నాయకులు కుడా ఆయనకు వంత పాడుతున్నారు.
ఒకటి కాదని మరోటి వ్యూహాలు మారుస్తూ వచ్చారు. ప్రాంతీయ పార్టీల జాతీయ కూటమి, ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ ఇంకో ఫ్రంట్, మరో ఫ్రంట్ అంటూ రకరకాల ప్రయత్నాలు చేసి అవన్నీ విఫలం కావడంతో ఫ్రంట్ , టెంట్ ఆలోచనలను వదిలేసి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ( తెరాస) పేరును, భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ రాజకీయాలలోకి దూకేశారు. మంచి ముహూర్తం చూసుకుని దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం కూడా ప్రారంభించేశారు. ఇక అక్కడ నుంచీ ఆయన జాతీయ రాజకీయ ప్రస్థానం మూడడుగులు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది. ఢిల్లీలో బ్రహ్మాండమైన బహిరంగ సభ అన్నారు. ఏపీలోనూ సభలు నిర్వహిస్తామన్నారు. ఇంకా చాలా చాలా చెప్పారు. కానీ చివరకు బీఆర్ఎస్ తొలి మహాసభకు ఖమ్మం వేదికగా మారింది. అది కూడా కేవలం బీఆర్ఎస్ మహాసభగా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం లేదు. ఖమ్మంలో సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవం చేసేందుకు అక్కడకు వెళుతున్న కేసీఆర్ పనిలో పనిగా బీఆర్ఎస్ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసేశారు.
ఘనంగా హస్తిన వేదికగా నిర్వహించాల్సిన తొలి సభను స్వరాష్ట్రంలో అందునా ఖమ్మంలో ఏర్పాటు చేయడానికి కారణం ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర పార్టీల నాయకుల నుంచి ఆశించిన విధంగా మద్దతు రాకపోవడమేనని పరిశీలకులే కాదు.. సొంత పార్టీ నేతలు కూడా చెబుతున్నారు. అయితే కింద పడ్డా పైచేయి అనిపించుకోవాలని ఖమ్మం సభకు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లను ఆహ్వానించామనీ, వారు వస్తున్నారనీ బీఆర్ఎస్ ఘనంగా ప్రచారం చేసుకుంటున్నది. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు వీరెవరు కూడా ఇంకా సభకు తమ హాజరుపై స్పష్టత ఇవ్వలేదని సమాచారం. వారి నుంచి సభకు వస్తున్నట్లు ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదని అంటున్నారు.
గతంలో కూడా ఇక్కడ హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రకటన సందర్భంలో కానీ, ఆ తరువాత అధికారికంగా బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమానికి కానీ.. కర్నాటక మాజీ సీఎం వినా ఎవరూ హాజరైన దాఖలాలు లేవు. అలాగే ఢిల్లీలో జరిగిన పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నగరంలో ఉండి కూడా ఢిల్లీ సీఎం హాజరు కాలేదు. ఆ కార్యక్రమానికి కూడా కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ మాత్రమే హాజరయ్యారు. ఇప్పుడు ఖమ్మం సభకు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంల హాజరుపై స్పష్టత లేదు. ఇక ఇప్పటి వరకూ బీఆర్ఎస్ కార్యక్రమాలకు హాజరైన వారిలో కొద్దో గొప్పో చెప్పుకోదగ్గ పేర్లు ఏమైనా ఉన్నాయంటే అవి కర్నాటక మాజీ సీఎం కుమార స్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మాత్రమే.
ఇక డిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి పంజాబ్, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి రైతు నాయకులుగా చెప్పుకుంటున్న కొందరు హాజరైనా వారి వారి రాష్ట్రాలలో వారికి ఉన్న క్రెడిబులిటీ ఏమిటన్నది తెలియదు. దేశంలో రైతు నాయకుడిగా గుర్తింపు ఉన్న తికాయత్ బీఆర్ఎస్ కార్యక్ర మాలకు దూరంగా ఉన్నారు. స్వాగత తోరణాల్లో కనిపించిన బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా భారాస హస్తిన కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకలో కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఖమ్మం సభకు హాజరయ్యేది ఎవరన్న విషయంలో సర్వత్రా సందిగ్దతే వ్యక్తమౌతోంది. ఏది ఏమైనా జాతీయ రాజకీయాలంటూ ఆర్భాటంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణను తీసేసి భారత్ చేర్చి కొత్త పార్టీని ఏర్పాటు చేసినా ఆ కొత్త పార్టీ కూడా రాష్ట్రానికే పరిమితమైందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.