కాపు ఉద్యమాన్ని నీరు గార్చిన వ్యక్తి నీతులు వల్లించేనా?
posted on Jun 21, 2023 @ 2:01PM
టీడీపీ హయాంలో కాపు ఉద్యమం చేస్తూ.. నానా ఇబ్బంది పెట్టిన ముద్రగడ పద్మనాభం.. వైసీపీ నేతలా మాట్లాడటం మొదలెట్టారు. అచ్చం వైసీపీ నేతలా.. పవన్ ను హెచ్చరిస్తూ లేఖ రాశారు. లేఖ ఆసాంతం.. పవన్ వ్యాఖ్యలు, వ్యవహార శైలిని తప్పుపట్టారే తప్ప.. వైసీపీ నుంచి కాపు కులానికి, నాయకులకు ఎదురైన అవమానాలు, అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేయలేదు.
ముద్రగడ.. రాజకీయ నాయకుడి కంటే కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగానే సుపరిచితం. అయితే ఆయన ప్రస్తుతం వైసీపీ కండువా కప్పి మాట్లాడుతున్నారు. కాపు ముసుగు తీసి.. జగన్ ను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. జనసేన అధినేత పవన్ పై విరుచుకుపడ్డారు. కాపుల ఈబీసీ రిజర్వేషన్లను జగన్ తీసేటప్పుడు…పవన్ పై వైసీపీ శ్రేణులు వ్యక్తిగతంగా టార్గెట్ చేసాయి. వంగవీటి మోహన్ రంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను జగన్ విస్మరించినప్పుడు.. అదే వంగవీటి వారసుడు రాధా హత్యకు రెక్కీ నిర్వహించినప్పుడు..వైసీపీ నేత కొడాలి నాని కాపు సామాజిక వర్గంపై తనదైన శైలి బూతుల పర్వం మొదలెట్టినప్పుడు మౌనం ఉండిపోయారు ముద్రగడ. ఇలా ఏ సందర్భంలోనూ మాట్లాడని ముద్రగడ ఇప్పుడు వారాహి యాత్రలో పవన్ వైసీపీ నేతలపై విమర్శలు చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో వారాహి యాత్రలీ ఉన్నారు. ఈ నెల 14న ప్రారంభమైన యాత్రలో రోడ్ షోలతో పాటు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. పవన్ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాలు చేసే నాయకులు కొందరి లాభం కోసమే ప్రయత్నిస్తున్నారంటూ పవన్ ఆరోపించారు. ప్రభుత్వాలు మారిపోయిన తరువాత ఉద్యమాలు మూసివేస్తున్నట్టు ఆరోపణలు చేశారు. దీనిపై ముద్రగడ రియాక్టయ్యారు. పవన్ కు ఏకంగా సుదీర్ఘ లేఖ రాశారు. అయితే ఆయన లేఖలో తానెందుకు ఉద్యమాన్ని నిలిపివేసింది రాయలేదు. కానీ అడుగడుగునా వైసీపీపై, జగన్ పై తనుకున్న అభిమానాన్ని చాటుకుంటూ లేఖ రాశారు.
లేఖ మొత్తం పవన్ పై వ్యాఖ్యలు, వ్యవహార శైలిని తప్పుపట్టారే తప్ప.. వైసీపీ నుంచి కాపు కులానికి, నాయకులకు ఎదురైన అవమానాలు, అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేయలేదు. ప్రధానంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆ కుటుంబం కాపుల అభ్యున్నతికి పాటుపడిన విషయాన్ని ప్రస్తావించారు. కాపు రిజర్వేషన్ ఉద్యమానికి చంద్రశేఖర్ రెడ్డి తాత, తండ్రి ఎంతగానో చేయూతనందించారని చెప్పుకొచ్చారు. ద్వారంపూడి ఒక సచ్ఛిలుడిగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆయనపై విమర్శలు ముద్రగడకు బాధ కలిగించాయట. అతడు తప్పుడు మనిషి అయితే కాకినాడ ప్రజలు ఎందుకు రెండుసార్లు గెలిపించారని ముద్రగడ ప్రశ్నించారు. దమ్ముంటే చంద్రశేఖర్ రెడ్డిపై పోటీ చేసి గెలవాలని పవన్ కు ముద్రగడ సవాల్ చేశారు.
అక్కడితో ఆగని ముద్రగడ పవన్ వాడుతున్న భాష, ఆహార్యంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 2019లో తానిచ్చిన సలహా మేరకు పోరాడి ఉండి ఉంటే బాగుండేదన్నారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వేజోన్, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ వంటి అంశాలపై పోరాడాలని తాను సూచించినట్టు ముద్రగడ గుర్తుచేశారు. మొత్తానికైతే ముద్రగడ అసలు సిసలైన వైసీపీ మాదిరిగా మారిపోయారు.
అయితే.. ఇక్కడో ట్విస్ట్ .. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాటల తీరును తప్పుపడుతూ లేఖ రాసిన ముద్రగడ పై కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య మండి పడ్డారు. ఇన్నాళ్లూ ముద్రగడ చాలా పెద్ద మనిషి అని, వివాద రహితుడని, కాపుల సంక్షేమం కోరే ఒకే ఒక వ్యక్తి అని, కాపులకు రాజ్యాధికారం కోరే ప్రముఖుడు అని భావించానని, కాని ఆయనపట్ల తనకున్న సదభిప్రా యానికి ఆయన పవన్ కళ్యాణ్ పై ఎక్కుపెట్టిన బాణాలతో తూట్లు పొడిచినట్లయిందంటూ బాహటంగానే హరిరామజోగయ్య విమర్శకులకు దిగారు. చిన్న చిన్న మంత్రిపదవులు ఆశించో, ఇతర ప్రలోభాలకు లొంగో అవినీతి చక్రవర్తి జగన్ కు మద్దతుగా కాపు సామాజికవర్గా న్ని తాకట్టు పెట్టారు. ఊడిగం చేస్తున్న కొంతమంది కాపు నాయకులు లైనులో ఈయన కూడా చేరారు. ఈయన విద్య ఉద్యోగాలలో కాపులకు రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు చిత్తశుద్ధితో చేసినవే అని నమ్మానని, అవి కూడ రాజకీయ లబ్ది కోరి చేసినవే అని ఆయన మండిపడుతున్నారు. కాపు రిజర్వే షన్స్ ఉద్యమాన్ని గంగలో కలిపి మధ్యలో రాజీనామా చేసి, కాపులకు అన్యాయం చేసిన వ్యక్తి .. జనసేనా అధినేతకు హితబోధ చేయడాన్ని హరిరామ జోగయ్య సహించలేకపోతున్నారు.
రంగులను మార్చే ఊసరవెల్లి కన్నా..సదరు కాపు ఉద్యమనేత.. వేగంగా తన ఆశయాలను..సిద్ధాంతాలను మార్చేస్తున్నారని.. కాపు సామాజిక నేతలు చర్చించుకుంటున్నారు.