కమలంలోజీవిత ఆర్భాటం షురూ!
posted on Aug 29, 2022 @ 2:21PM
భగవంతుడు ఎక్కడ ఉండునో.. అంబికా దర్భార్ అక్కడ ఉండును ఇది బుల్లి తెరపై వచ్చే ఓ యాడ్. కానీ అంకుశం హీరో రాజశేఖర్ ఎక్కడ ఉండునో.. ఆయన భార్య జీవితా రాజశేఖర్ అక్కడ ఉండును అనే ఓ టాక్ అయితే ఫిలింనగర్‌లో ఎప్పటి నుంచో హల్ చల్ చేస్తోంది. అయితే తాజాగా జీవితా రాజశేఖర్ మళ్లీ కమలదళంలో చేరారు. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే... బీజేపీలో మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు.
తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. యాద్రాద్రి జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారు. ఆ క్రమంలో మోత్కురు మండలం.. పొడిచేడులో యాత్ర చేస్తున్న సంజయ్ సమక్షంలో ఆమె కమలం కండువా కప్పుకున్నారు. ఆ వెంటనే తెలంగాణలో టీఆర్ఎస్ పాలన ఏమీ బాగోలేదన్నారు. ఈ పార్టీ హయాంలో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్ నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ దూసుకుపోతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏదో ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న తన మనస్సులోని మాటను జీవిత ఈ సందర్బంగా బయటపెట్టారు. పార్టీ ఆదేశిస్తే.. ఎక్కడి నుంచి అయినా పోటీ చేసేందుకు సిద్ధమన్నారు. అయితే జీవితా రాజశేఖర్ మరోసారి ఇలా రాజకీయాల్లోకి రావడం పట్ల నెటిజన్లు మాత్రం ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. రాజకీయంగా నిలకడలేనితనమే జీవితా రాజశేఖర్‌కు అసలు సిసలు మైనస్ పాయింట్ అంటూ వారు పోస్టులు పెడుతున్నారు.
తొలుత జీవిత హస్తం పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చి.. టీడీపీ చేరారు.. అనంతరం సైకిల్ దిగి.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ మీదట బీజేపీలోకి జంపింగ్ రాగం ఆలపించారని.. తిరిగి 2019 ఎన్నికల వేళ.. లోటస్‌పాండ్‌లో జగన్‌ని కలిసి ఫ్యాన్ పార్టీ కండువా కప్పుకున్నారని నెటిజన్లు .. జీవితా రాజశేఖర్ పోలిటికల్ హిస్టరీని కంఠస్తం చేసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇంత కాలం సైలెంట్‌గా ఉండి.. తాజాగా మళ్లీ బీజేపీలోకి వచ్చారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు.. జీవితా రాజశేఖర్ ఇప్పటి వరకు అన్ని పార్టీల్లోకి ఇలా వెళ్లి... అలా వచ్చారని.. కానీ ఇక జీవితా రాజశేఖర్ భవిష్యత్తులో చేరే పార్టీ ఏదైనా ఉందంటే.. అది కేవలం కేఏ పాల్ స్థాపించిన ప్రజా శాంతి పార్టీనే అనే ఓ సెటైరికల్ టాక్ అయితే సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన సంగతిని నెటిజన్లు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు.
ఇలా పార్టీలో చేరగానే.. అలా పదవులు రావని.. పార్టీ స్థాపించిన నాటి నుంచి దశబ్దాలుగా పని చేసిన వారికే ఏ పదవి దక్కడం లేదని.. అలాంటి సమయంలో.. పార్టీలో చేరగానే.. పదవి రావాలంటే .. అంత ఆషామాషీ వ్యవహారం కాదని ఓ నెట్‌జన్ జీవిత రాజకీయ వ్యవహర శైలిపై తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. మరి జీవితా రాజశేఖర్.. ఈ సారి అయిన బీజేపీలో నిలకడగా ఉంటారా? అంటే.. వేచి చూడాల్సిందే.
మరోవైపు సహజ నటి జయసుధతో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవల భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆమెను కమలం పార్టీలోకి ఆహ్వానించారని సమాచారం. అందుకు ఆమె సానుకూలంగానే స్పందించి.. తనకు ఎమ్మెల్యే సీటు వద్దని... కానీ పార్టీలో చేరాలంటే.. కొన్ని కండిషన్లు పెట్టినట్లు సమాచారం. సదరు కండిషన్లపై ఢిల్లీ పెద్దలతో మాట్లాడి చెబుతానని జయసుధతో ఈటల పేర్కొన్నట్లు తెలుస్తోంది