రాహుల్ గాంధీ ఓ సీతయ్య.. ఎవరి మాటా వినడు.. గులాం నబీ ఆజాద్
posted on Aug 29, 2022 @ 2:32PM
పార్టీలో ఉన్నంత కాలం వీర విధేయత ప్రదర్శించడం.. బయటకు రాగేనే విమర్శలతో తిట్టిపోయడం రాజకీయ నాయకులకు అలవాటే. ఇటీవలే కాంగ్రెస్ గూటి నుంచి బయటపడిన గులాం నబీ ఆజాద్ కూడా అందుకే ఏ మాత్రం మినహాయింపు కాదు.పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత కాంగ్రెస్ పై సెటైర్లు, విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా రాహుల్ గాంధీని గులాంనబీ ఆజాద్ సీతయ్య అని అభివర్ణించారు. రాహుల్ కు ఒకరి సలహాలు వినే సహనం లేదన్నారు. ఎవరైనా సరే ఆయన చెప్పింది వినాలే తప్ప ఎదుటి వారి మాట వినే లక్షణం రాహుల్ లో లేదన్నారు. రాహుల్ గాంధీ మంచి వ్యక్తే కానీ ఆయనకు రాజకీయాలలో కొనసాగే అర్హత, యోగ్యతా అసలు లేవని గులాం నబీ ఆజాద్ అన్నారు. సోమవారం (ఆగస్టు29) మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన ఆయన ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ ముగ్గురికీ పార్టీలోని సీనియర్ల నుంచి సలహాలు తీసుకుని పార్టీని నడిపించే విధానాన్ని విశ్వసించారని అన్నారు. అయితే ఆ మంచి పద్ధతిని రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు అయిన తరువాత పక్కన పెట్టేశారని అన్నారు. రాహుల్ గాంధీకి సీనియర్లు అందరూ సహకరించాలనీ, మద్దతుగా నిలవాలనీ సోనియాగాంధీ ఇప్పుడు భావిస్తున్నారనీ, అయితే జీ-23 నేతలు సోనియా గాంధీకి లేఖ రాయడానికి ముందే ఆమె అలా భావించి ఉంటే బాగుండేదని అన్నారు. తాము సోనియాకు లేఖ రాసిన నాటి నుంచీ తానంటే పార్టీకి గిట్టడం లేదనీ, అందుకే అయిష్టంగానే పార్టీని వీడాల్సి వచ్చిందని వివరించారు. ఎవరైనా ప్రశ్నిస్తే కాంగ్రెస్ అధిష్ఠానానికి నచ్చదని అన్నారు. పలు సార్లు కాంగ్రెస్ సమావేశాలు జరిగాయని, అయితే ఒక్క సలహాను కూడా అధిష్ఠానం స్వీకరించిన దాఖలాలు లేవనీ అన్నారు. తాను కమలం గూటికి చేరుతానంటూ వస్తున్న వార్తలను గులాం నబీ ఆజాద్ ఖండించారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే అన్నారు.