టీటీడీ చైర్మన్ భూమన.. జంగా అలక!
posted on Aug 7, 2023 @ 10:14AM
కలియుగ దైవంగా.. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ఆ ఏడుకొండలపై కొలువైన శ్రీవారంటే అందరికీ ప్రీతీ పాత్రుడైన దైవంగా పేరుంది. అందుకే నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఆయన దర్శనం కోసం తపిస్తుంటారు. ఈ కలియుగ వైకుంఠంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం ఏపీ ప్రభుత్వ నియంత్రణలోని టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ టీటీడీకి పాలక మండలి, ఆ మండలి చైర్మన్ ని ఎన్నుకోవడం కూడా తెలిసిందే. పేరుకే ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎన్నుకున్నా.. చైర్మన్ ఎవరు అనేది ఏపీ ప్రభుత్వమే నిర్ణయిస్తూ వస్తున్నది. కాగా, ఇప్పుడు ఈ టీటీడీకి ఛైర్మన్ గా తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు.
గత నాలుగేళ్లుగా ఈ పదవిలో సీఎం జగన్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి కొనసాగుతూ వచ్చారు. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కాగా.. ఈ నాలుగేళ్లూ ఆయనే చైర్మన్ గా ఉన్నారు. టీటీడీ చరిత్రలో ఇంత సుదీర్ఘ కాలం చైర్మన్‌గా వ్యవహరించిన మరో నాయకుడు లేరు. మరో 8 నెలల్లో ఎన్నికలు ఉన్నందున ఈసారి టీటీడీ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందోనని కొంత కాలంగా ఉత్కంఠ కొనసాగింది. చివరి ఏడాది వెనుకబడిన వర్గాల వారికి చైర్మన్ పదవి అప్పగిస్తారని ప్రచారం జరిగింది. బీసీలకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించేసుకున్నారనీ, అందుకు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేరును ఖరారు చేసేశారనీ వైసీపీ శ్రేణులే గట్టిగా చెబుతూ వచ్చాయి. కానీ చివరికి మరోసారి కూడా రెడ్డి సామజిక వర్గానికే ఈ పదవిని కట్టబెట్టారు. అనూహ్యంగా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించారు.
భూమన ఇప్పటికే ఒకసారి టీటీడీ చైర్మన్ పదవిని చేపట్టి ఉన్నారు. టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించడం భూమనకు ఇది రెండోసారి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో 2006 నుంచి 2008 మధ్య ఆయన ఛైర్మన్ గా పని చేశారు. ఇలా రెండోసారి ఈ పదవిలో కొనసాగిన వారు ఇప్పుడున్న సుబ్బారెడ్డి, రేపు రాబోయే కరుణాకర్ రెడ్డి తప్ప మరెవరూ లేరు. అది కూడా ఇద్దరూ సీఎం జగన్ కు దగ్గరి బంధువులే కావడం విశేషం. గతంలో సుబ్బారెడ్డి రెండేళ్ల పదవీ కాలం పూర్తయినపుడు కూడా భూమన పేరు వినిపించగా అప్పుడు వైసీపీ అధిష్టానం భూమనకు రెండోసారి ఈ పదవి ఇచ్చేందుకు ఇష్టపడలేదు. కానీ, సుబ్బారెడ్డి రెండుసార్లు అయ్యాక సీఎం జగన్ ఇప్పుడు భూమనకు మరోసారి అవకాశం ఇవ్వాల్సి వచ్చిందని అంటున్నారు.
ఈ చైర్మన్ పదవి రేసులో గత కొంత కాలంగా రకరకాల పేర్లు వినిపించాయి. వీరిలో జగన్‌కు సన్నిహితులైన భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డితో పాటు బీసీ కోటాలో మాజీ మంత్రి కొలుసు పార్థసారధి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్లు వినిపించాయి. వీరిలో కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి తనకు మంత్రి పదవిని ఆశించి భంగపడటంతో టీటీడీ చైర్మన్ పదవిని నిరాకరించి నిరసన తెలిపారని అంటున్నారు. దాంతో జగన్ ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన జంగా పేరు ఖరారు చేసేశారని వైసీపీ శ్రేణులు నిన్నమొన్నటి వరకూ చెబుతూ వచ్చారు. ఇప్పటికే నాలుగేళ్లు రెడ్డి సామజిక వర్గమే ఈ పదవిలో ఉండడంతో ఈసారి బీసీలకు ఛాన్స్ ఇస్తారని, జంగా కృష్ణమూర్తికి ఈ అవకాశం దక్కడం ఖాయమనీ అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి పేరు ఖరారు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అలకపాన్పు ఎక్కారు. నిజానికి జంగా వైసీపీ ఆవిర్భావం నుంచీ నుంచి జగన్ వెన్నంటే ఉన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
బీసీ యాదవ వర్గానికి చెందిన నేత కావడంతో పార్టీలోని బీసీ నేతలతోనూ మంచి సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా పని చేయగా.. అప్పటి నుండే చైర్మన్ గా శ్రీవారి సేవ చేయాలని ఆశపడుతున్నారు. ఈ మధ్య కాలంలో అన్ని కీలక పదవులు సీఎం సొంత సామాజికవర్గానికి ఇస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించడం, ఇప్పటికే రెండు సార్లు రెడ్డి వర్గానికి చెందిన వారే ఉండడంతో ఈసారి జంగానే చైర్మన్ అని అందరూ భావించారు. జంగా కూడా అదే అనుకున్నారు. ఈ మేరకు జంగాకు జగన్ హామీ కూడా ఇచ్చినట్లు చెప్పుకున్నారు. తీరా చివరికొచ్చేసరికి తనకు రిక్తహస్తం చూపడంతో జంగా అలకబూనినట్లు చెబుతున్నారు. పార్టీ నేతలతో ఎవరికీ టచ్ లో లేకుండా పోయినట్లు తెలుస్తుంది. ఆయన తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆయన అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు స్థానిక వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీ అధిష్ఠానం ఆయన్ను బుజ్జగిస్తుందా.. లేక ఆయనే ఏమైనా షాకులు ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది.