సుబ్బారెడ్డి నోట రాజధాని విశాఖ మాట.. మళ్లీ మళ్లీ పాత పాట
posted on Aug 7, 2023 @ 9:52AM
విశాఖ రాజధాని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు.. అందులో ఒకటి పరిపాలన రాజధానిగా విశాఖ. సీఎం జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే విశాఖ నుండే పాలన సాగించనున్నారు. ఇలాంటి మాటలు ఏడాది కిందటి వరకూ ఏపీ ప్రజలను ఉలికిపాటుకు గురి చేసేవి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారికి అవసరం ఉండే పరిపాలన రాజధానిని ఒక మూలన ఉండే విశాఖకు తరలించడం ఏంటన్నది ఎప్పటి నుండో సగటు ప్రజలతో పాటు మేధావుల వాదన. కానీ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మాత్రం ఏది ఏమైనా పరిపాలన విశాఖ నుండే అంటూ మూర్ఖంగా వాదిస్తూ వచ్చింది. అయితే మూడేళ్లుగా ఇదే మాట వినీ వినీ ప్రజలలో ఇప్పుడు దీనిపై చలనం కూడా ఉండడం లేదు. ప్రకటనలు తప్ప ఇది సాంకేతికంగా జరిగే పని కాదులే అని ఏపీ ప్రజలు డిసైడైపోయి ఆ మాటలను లైట్ తీసుకుంటున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇంకా విశాఖకు రాజధాని అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి నుండి మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, సలహాదారులు ఇలా ఎవరికి వారు సమయం సందర్భం ఉన్నా, లేకుండా ఇప్పటికే ఎన్నోసార్లు ఈ మూడు రాజధానుల ముచ్చట, అందులో విశాఖకు రాజధాని తరలింపుపై ఎన్నో ప్రకటనలు చేశారు. అందులో చాలా మంది ఇప్పుడు ప్రజలకు, మీడియాకు కూడా మొహం చాటేస్తున్నారు. ఇంకా విశాఖ రాజధాని అంటే ప్రజలు నమ్మే పరిస్థితి పోయి నవ్వే పరిస్థితి వచ్చిందని ఈ నేతలకు కూడా అర్ధమైపోయింది. కానీ, కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు అన్నట్లు సీఎం జగన్ కు మరో బాబాయి అయిన వైవీ సుబ్బారెడ్డి మాత్రం త్వరలోనే విశాఖకు రాజధాని అంటూ కామెడీ ప్రకటనలు చేస్తున్నారు.
తాజాగా వైజాగ్-వన్ ఇండియా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి త్వరలో విశాఖ పరిపాలనా రాజధాని కానుందన్నారు. లీగల్ ఇష్యూస్ కారణంగా రాజధానిగా విశాఖ ఆలస్యమవుతోందని.. మరో మూడు నెలల్లో రాజధాని విశాఖకు రానున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి ప్రస్తుతం వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్ గా, టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. మంగళవారం (ఆగస్టు 8)తో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గిరీ గవుడు ముగుస్తుంది. దీంతో ఆయన ఆ రోజు నుంచీ పూర్తిగా ఉత్తరాంధ్ర రాజకీయాలకే పరిమితం కావాల్సి వస్తుంది. అందుకే మరోసారి విశాఖే రాజధాని అని.. మరో మూడు నెలల్లో జగన్ విశాఖకు తరలి రానున్నారని.. దసరా తర్వాత విశాఖ నుండే పాలన కొనసాగుతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు.
అయితే వైసీపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అరిచి గీపెట్టినా రాజధాని విశాఖ తరలింపు అంశం అధికారికంగా జరిగే పనికాదు. ఒక పక్క ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని సుబ్బారెడ్డి అంటూనే విశాఖకు రాజధాని అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. అమరావతి రాజధాని చేస్తామని.. అక్కడ భూములను ప్రభుత్వానికి ఇస్తే అభివృద్ధి చేసి ఇస్తామని అక్కడి రైతులతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒకవేళ ఇప్పుడు అదే ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలంటే.. రాజధాని రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. ఈ పరిహారాన్ని కట్టాలంటే ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మినా సరిపోదు. ఒకవేళ శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుంది కదా అని వైసీపీ ప్రభుత్వం వాదించినా.. ఏకైక రాజధాని, అదీ అక్కడే ఉండేలా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం రకరకాలుగా అమరావతి రైతులకు అగ్రిమెంట్ చేసి ఉంది.
ఈ చట్టాల ప్రకారమే ఇప్పుడు వైసీపీ అడుగు ముందుకు వేయలేకపోతుంది. ఈ చట్టాల ఆధారంగానే కోర్టు తీర్పులు వస్తున్నాయి. ఇక రాష్ట్రంలో ఎన్నికలకు నిండా ఎనిమిది తొమ్మిది నెలల సమయం కూడా లేదు. ఈ లోగా అనధికారికంగా విశాఖకు రాజధాని తరలింపు చేయాలని భావించినా.. అక్కడ పరిస్థితులు చక్కదిద్దుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే, ప్రజలు విశాఖకు రాజధాని తరలింపు అంశాన్ని పూర్తిగా మార్చిపోయారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇదిగో ఇలా మళ్ళీ మళ్ళీ ప్రకటనలు చేసి ఇంకా ఇంకా చులకన అవుతున్నారు.