అఖిలేష్‌తో కేసీఆర్ దోస్తానా!
posted on Jul 30, 2022 @ 10:50AM
మహారాజును గద్దె దింపడానికి, రాజ్యం కైవసం చేసుకోవడానికి సైన్యాధిపతే కుట్రచేసి ఒక మహామాంత్రి కుడితోనో, పక్క రాజ్యం పాలేరుతోనో జోడీ కట్టి సాధించాలనుకుంటాడు. కానీ అది జరగదు.. అది సినిమా.. ఇక్కడ రాజకీయాల్లో అందులో సగ భాగమే జరుగుతుంది. శతృవు శతృవుకి మిత్రుడవుతాడు. ఇది ఇప్పటి రాజకీయాలకు బాగా వర్తిస్తుంది. తెలంగాణా ముఖ్యమంత్రి, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్, ఢిల్లీ యాత్రంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్‌తో సమావేశమయ్యారు.
కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ప్రభత్వం మీద చాలారోజులుగా కారాలుమిరియాలూ నూరుతూనే ఉన్నవారు కలిసి పనిచేయడం తాడు బలమై కుర్చీలాగేసి ప్రభుత్వాన్ని దించేయవచ్చన్న ఆలోచనతో ముందడుగు వేయడం మంచిదనుకున్నారు.మోదీ సర్కార్ మీద ఇప్పటికే మండిపడుతున్న వారితో జోడీ కట్టాలని కేసీఆర్ ఆ మధ్య చేసిన విశ్వయత్నాలు దెబ్బతిన్నాయి. కానీ ఆయన లక్ష్యం, పట్టుదలలో ఏమాత్రం వేగం తగ్గలేదు. కేంద్రం బీజేపీయేతర రాష్ట్రాలపట్ల ప్రదర్శిస్తున్న చిన్నచూపుతో రాష్ట్రాలు ఇబ్బందులకు గురవుతున్నాయన్న విశ్లేషకుల అభిప్రాయాలకూ కేసీఆర్ ఆజ్యం పోస్తున్నారు. ముందడుగు వేయడానికి ఎస్పీతో కలవడం ఎంతో అవసరమన్న నమ్మకంతో ముందడుగు వేశారు. ఆమద్య బీజేపీయేతర పార్టీలను కలుపుకోని మోదీపై యుద్ధం ప్రకటించాలన్న ఆతృతతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కూడా కలిసి చర్చించారు. కానీ సమావేశాలు, వారి ఆలోచనల కలయిక బెడిసికొట్టింది. ఆమె విపక్షాలన్నింటికీ నాయకత్వం వహించాలన్న ఆతృత బాగా ప్రదర్శించడం బహుశా విపక్ష నేతల మధ్య దూరం స్పష్టం చేసి ఉండవచ్చు. ఇదిలా ఉండగా,
టీఆర్‌ఎస్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) జాతీయ స్థాయిలో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. సీఎం కేసీఆర్, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఈ మేరకు ఒక అవగాహనకు వచ్చారు. కేసీఆర్ తుగ్లక్ రోడ్‌లోని తన నివాసంలో అఖిలేశ్, ఎస్పీ ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్‌లకు మధ్యాహ్నం విందును ఏర్పాటు చేశారు. అయితే వీరిద్దరూ స్నేహపూర్వకంగా కలిసినప్పటికీ కేంద్రంపట్ల వ్యవహరించాల్సిన వ్యూహ రచన చేశా రనే అనుమానాలూ రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటులో కేంద్రంపై ఏ విధంగా విరు చుకుపడాలన్న అంశాన్ని కీలకంగా చర్చించారు.
వారు జాతీయ రాజకీయాలు, ప్రతిపక్షాల పట్ల కేంద్రం వైఖరి, ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా బీజేపీ సర్కా రు నిర్ణయాలు తదితర అంశాలు చర్చించారని తెలుస్తోంది. ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు గంటకు పైనే జరిగాయి. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఇతర ప్రతిపక్షాలతో కలిసి పనిచేస్తున్న విష యాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతిపక్షాలు కలిసి ఉంటేనే కేంద్రంపై ఒత్తిడి పెంచవచ్చని కేసీఆర్, అఖిలేశ్ భావించారు.
అఖిలేశ్‌తో చర్చల అనంతరం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్, జాతీయ పెన్షన్ పథకం, డిస్కంల నష్టాలపై కేంద్రానికి పంపాల్సిన సమాచారం గురించి ఆయన అధికారులతో చర్చించినట్లు సమాచారం.