ఒక సామాజిక వర్గమే జగన్ టార్గెట్!
posted on Mar 29, 2021 @ 4:25PM
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై మొదటి నుంచి ఒక ఆరోపణ బలంగా వినిపిస్తోంది. ఒక సామాజిక వర్గాన్ని ఆపార్చీ టార్గెట్ గా చేసుకుందనే విమర్శలు ఉన్నాయి. అందుకు బలం చేకూరేలా చాలా సంఘటనలు జరిగాయి. ఒక సామాజిక వర్గానికి చెందిన వారిపైనే ఎక్కువ కేసులు నమోదు కావడం, వాళ్ల వ్యాపారాలను దెబ్బ తీసే ప్రయత్నాలు జరగడం వెలుగు చూశాయి. జగన్ సర్కార్ తీరుపై తెలుగు దేశం పార్టీ నేతలు తీవ్రంగానే స్పందిస్తున్నారు.
తాజాగా జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. ఒక సామాజికవర్గాన్ని టార్గెట్ చేసి వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయని మనోహర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఏపీని వైసీపీ ప్రభుత్వం అప్పుల్లో ముంచేసిందని మనోహర్ విమర్శించారు. అప్పుల్లో ఏపీని దేశంలోనే తొలి స్థానంలో నిలబెట్టారని అన్నారు. మద్యం, ఇసుక, సిమెంట్ ద్వారా వస్తున్న డబ్బంతా ఎక్కడకు వెళ్తోందని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో 96 శాతాన్ని గెలిచామని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని... పోలీస్, వాలంటీర్ వ్యవస్థలను వాడుకోకుండా ఉంటే వైసీపీకి ఈ గెలుపు సాధ్యమయ్యేదా? అని నాదేండ్ల నిలదీశారు.
తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తుండటంపై కొందరు జన సైనికులు ఆవేదన చెందుతున్న మాట నిజమేనన్నారు మనోహర్. ఇతర పార్టీల అభ్యర్థుల కంటే తమ ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ మెరుగైన అభ్యర్థి అన్నారు. ఆమె విజయం కోసం జనసైనికులంతా పని చేయాలని పిలుపునిచ్చారు. కాబోయే సీఎం పవన్ కల్యాణ్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పడం... జనసేనకు ఉన్న బలమని మనోహర్ అన్నారు. సంస్థాగతంగా జనసేన మరింత బలోపేతం కావాలని చెప్పారు.