పవార్‌తో బీజేపీ మైండ్ గేమ్!
posted on Mar 29, 2021 @ 4:17PM
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రహస్య భేటీ అంటూ విస్తృత ప్రచారం. ఎన్సీపీ ఖండిస్తున్నా.. అమిత్ షా నర్మగర్భ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో చీలికంటూ కథనాలు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై శివసేన విసుర్లు. ఇలా మహారాష్ట్ర కేంద్రంగా గుజరాతీ-మరాఠీ రాజకీయ ఎత్తుగడలు రంజుగా సాగుతున్నాయి.
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. శరద్ పవార్ నాయకత్వంలో ప్రతిపక్ష పార్టీలు ఢిల్లీపై దండయాత్రకు సిద్ధమవుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఆయా రాష్ట్రాల్లో కమల వ్యతిరేక పవనాలు జోరుగా వీస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో.. వ్యూహాత్మకంగా శరద్ పవార్ టార్గెట్‌గా బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందనే అనుమానాలు వినిపిస్తున్నాయి.
అనారోగ్యంతో ఆదివారం ఆసుపత్రిలో చేరారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. పొత్తికడుపు నొప్పితో హాస్పిటల్‌లో చేరిన పవార్‌కు గాల్‌బ్లాడర్ సమస్య ఉన్నట్టు గుర్తించారు. బుధవారం ఆయనకు ఆపరేషన్ జరిగే అవకాశం ఉంది. శనివారం గుజరాత్‌లో అమిత్ షా, శరద్ పవార్ సమావేశం జరిగిందంటూ వార్తలు రావడం అనుమానాలకు తావిస్తోంది.
నెలకు వంద కోట్ల వసూళ్లు టార్గెట్ పెట్టారంటూ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ చేసిన ఆరోపణలతో మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో అలజడి రేపాయి. ఈ ఆరోపణలపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రిటైర్డ్ జడ్జితో విచారణకు ఆదేశించారని స్వయంగా హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖే ప్రకటించారు. అటు హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై శివసేన తన అధికార పత్రిక ‘సామ్నా’లో కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఆయన అనుకోకుండా హోంమంత్రి అయ్యారు.. అయినా ముంబయి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వాజే కూర్చుని వసూళ్లకు తెరలేపిన విషయం హోంమంత్రికి తెలీకపోవడం ఏంటి’అని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు.
ఓవైపు మహారాష్ట్రలో శివసేన వర్సెస్ ఎన్సీపీ నడుస్తుండగా.. అదే సమయంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మధ్య శనివారం రహస్య భేటీ జరిగిందంటూ వార్తలు రావడం సంచలనంగా మారింది. భేటీకి సంబంధించి ఎటువంటి వివరాలూ బయటకు రాకున్నా.. మీటింగ్ జరిగిందంటూ అంతా ఫిక్స్ అయిపోయారు. ఈ అంశంపై అమిత్ షాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తమ మధ్య భేటీ జరిగిందని గానీ, జరగలేదని గానీ చెప్పలేదు కానీ.. ‘ప్రతి అంశం బయటకు చెప్పలేం’కదా అంటూ సమాధానం ఇవ్వడంతో రాజకీయం మరింత రక్తి గట్టింది.
ఇదంతా బీజేపీ మైండ్ గేమ్ అనే విమర్శలు వస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ.. బీజేపీకి వ్యతిరేకంగా శరద్ పవార్ కీలక అడుగులు వేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నారు. బెంగాల్‌లో మమత బెనర్జీ కమలనాథులకు చుక్కలు చూపిస్తున్నారు. బెంగాల్ మళ్లీ తృణమూల్ కైవసం చేసుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. కేరళ, తమిళనాడు, పుదిచ్చేరిలోనూ బీజేపీకి ఛాన్సెస్ లేవు. వీటితో పాటు మిగతా భావసారూప్య పార్టీలతో కలిసి.. ఎన్నికల తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే సన్నాహాల్లో ఉన్నారు శరద్ పవార్. శరద్ పవార్ కూటమిలో మమతా బెనర్జీనే కీలకం. పవార్ తప్పుకుంటే మమతా బెనర్జీనే పీఎం క్యాండిడేట్. ఇలాంటి సమయంలో పవార్, అమిత్ షా భేటీ అంటూ వార్తలు క్రియేట్ చేసి.. ప్రతిపక్ష కూటమిని మొదట్లోనే కన్ఫ్యూజ్ చేసేలా కుట్ర చేస్తున్నారనేది ఎన్సీపీ వాదన.
ఇలాంటి చీప్ ట్రిక్స్‌ను ప్రజలు నమ్మరని.. తమ పార్టీ ప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుందని ఎన్సీపీ నేతలు చెబుతున్నారు. దమ్ముంటే భేటీ జరిగిందంటూ అమిత్ షా బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రూమర్స్ క్రియేట్ చేసి.. బీజేపీ చీప్ పాలిటిక్స్ చేస్తోందంటూ మండిపడుతున్నారు. ఇదంతా అమిత్ షా ఆడిస్తున్న రాజకీయ డ్రామా అంటూ కొట్టిపారేస్తున్నారు. అమిత్ షా, బీజేపీ చేస్తున్న పొలిటికల్ ఎత్తులు ఔట్ డేటెడ్ అంటున్నాయి రాజకీయ వర్గాలు. అమిత్ షా వ్యూహాలు ఇటీవలి కాలంలో పని చేయడం లేదని చెబుతున్నారు. పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ పప్పులు ఉడకలేదంటున్నారు. ఎన్నికల లబ్ది కోసమ చీఫ్ పాలిట్రిక్స్ చేయడం మానుకోవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.