విమానంలో నానా రచ్చ చేసిన మందుబాబు... ఏకంగా 20 ఏళ్ల శిక్ష..!
posted on Mar 17, 2021 9:25AM
మద్యం సేవించిన వ్యక్తులు ఒళ్ళు పైన తెలియకుండా వీధుల్లోనూ, పబ్బుల్లోనూ.. ఎక్కడ పడితే అక్కడ చేసే రచ్చ గురించి మనకు తెలిసిందే. మరి ఇటువంటి మందుబాబులు ఒక విమానం ఎక్కితే ఇక ఆ ఫ్లయిట్ ప్రయాణికులకు, సిబ్బందికి పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. తాజాగా యుఎస్ లో ఒక యువకుడు విమానం ఎక్కి అందులో ఒక బుద్ది ఉన్నవాడు చేయకూడని పనులన్నీ చేసాడు దీంతో అక్కడి చట్టాల ప్రకారం అతడిపై కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష, అదే సమయంలో రూ.2 కోట్ల భారీ జరిమానా విధించే అవకాశాలున్నాయి. కొలరాడో ప్రాంతానికి చెందిన లాండన్ గ్రియర్ అనే 24 ఏళ్ల యువకుడు మార్చి 9న సియాటిల్ నుంచి డెన్వర్ వెళ్లేందుకు అలాస్కా ఎయిర్ లైన్స్ విమానంలో ఎక్కాడు. అయితే, విమానం ఎక్కిన దగ్గర నుండి ప్రతి నిమిషం రూల్స్ కు విరుద్ధంగా ప్రవరిస్తూ ఫ్లయిట్ సిబ్బందికి, తోటి ప్రయాణికులకు చుక్కలు చూపించాడు.
ఒకపక్క కరోనాతో ప్రపంచం సతమతమవుతుంటే.. అయ్యగారు మాత్రం మాస్కు ధరించమంటే నిద్ర పోతున్నట్టుగా నటించాడు. విమాన సిబ్బంది ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అసలు వినిపించుకోనట్టే నిర్లక్ష్యం వహించాడు. ఇదేమని అడిగితె ఏకంగా ప్యాంట్ విప్పి మరింత అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా, తాను కూర్చున్న సీట్లోనే మూత్రవిసర్జన చేశాడు. అయితే లాండన్ గ్రియర్ విమానం ఎక్కేముందే నాలుగు బీర్లు లాగించాడట.. దీంతో ఆ మద్యం మత్తులో ఇష్టంవచ్చినట్టు ప్రవర్తించి అటు విమాన సిబ్బందిని ఇటు తోటి ప్రయాణీకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన అతడికి ఎటువంటి శిక్ష విధిస్తారో వేచి చూడాలి