Read more!

కేసీఆర్ పోలవరాన్ని ఆపలేరు: జైరామ్

 

రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ లక్షలాది సీమాంద్ర ప్రజలు రెండున్నర నెలల పాటు రోడ్ల మీదకు వచ్చి ఉవ్వెత్తున ఉద్యమాలు చేస్తుంటే, డిల్లీ ఏసీ గదుల్లో కూర్చొని కులాసాగా నవ్వుకొంటూ, కబుర్లు చెప్పుకొంటూ రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి చేసేసి చేతులు దులుపుకొన్న కేంద్రమంత్రి జైరామ్ రమేష్, ప్రస్తుతం సీమాంధ్ర ప్రజలను ఓదార్చే పనిలో తలమునకలయ్యి ఉన్నారు. తెలంగాణా ఇచ్చిన ఘనత తమదేనని తెలంగాణాలో ఉండగా బల్ల గుద్ది వాదించిన ఆయన, సీమాంద్రాలో అడుగుపెట్టగానే రాష్ట్ర విభజన నిర్ణయం (పాపం) కేవలం తమ ఒక్కరిదే కాదని, అన్ని పార్టీలు ఆమోదం తెలిపిన తరువాతనే విభజించామని చెపుతూ, అదొక పాపమన్నట్లు అందులో అందరికీ సమానంగా ఉదారంగా వాటాలు పంచిపెడుతున్నారు.

 

అయినప్పటికీ సీమాంధ్ర ప్రజల సంక్షేమం కోరే తాము చాలా ఉదారంగా ఐటీఐ మొదలు ఐఐటీల వరకు అన్నీ సమకూర్చబోతున్నామని హామీ ఇస్తున్నారు. వైజాగ్ నుండి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు వగైరా వగైరాలు గత 60 ఏళ్ళల్లో చేయలేని అనేక అద్భుతాలు తమకి మళ్ళీ ఓటేసి గెలిపిస్తే జస్ట్ ఐదేళ్ళలో పూర్తి చేసేస్తామని హామీ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీమాంద్రాకు ఇస్తున్న’వరం’ పోలవరం అని ప్రకటించారు. సీమాంద్రాకి పారే కృష్ణానది నీళ్ళని ఆపడం కేసీఆర్, తెలంగాణా ప్రభుత్వాల తరంకాదని, దాని మీట తమ చేతిలో ఉందని గంభీరంగా గర్జిస్తున్నారు. అయితే ఇంతా చెప్పిన తరువాత పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి మరి కొంచెం సమయం (?) పడుతుందని, ఎందుకంటే 50వేలమంది గిరిజనులకు పునరావాసం కల్పించవలసి ఉందని ముగించారు.