Read more!

జగన్, రాజశేఖర్ వలననే తెలంగాణా డిమాండ్: పవన్ కళ్యాణ్

 

ఈరోజు కృష్ణా జిల్లా కైకలూరులో ఎన్డీయే అభ్యర్ధుల తరపున ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, సభకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ “మాజీ సీయం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయంలో విచ్చలవిడిగా జరిగిన అవినీతి, దోపిడీ, భూకబ్జాల కారణంగానే తెలంగాణా ప్రజలలో సీమాంద్రా పాలకుల పట్ల, ప్రజల పట్ల కూడా తీవ్ర వ్యతిరేఖత ఏర్పడింది. వైయస్స్ హయాంలో జరిగిన దోపిడీ మరువక ముందే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించడంతో తెలంగాణా ప్రజలలో రాష్ట్రం నుండి విడిపోవాలనే కోరిక బలపడిందని ఆరోపించారు. నాయకుడు అనేవాడు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా మెలగాలని, కానీ రాజశేఖర్ రెడ్డి తన కొడుకు జగన్మోహన్ రెడ్డి కోసం అవినీతికి గేట్లు తెరిచి, ప్రజలను దోచుకొన్నందునే తెలంగాణా ప్రజలలో సీమాంద్ర నేతల పాలన పట్ల, ప్రజల పట్ల తీవ్ర వ్యతిరేఖత ఏర్పడి చివరికి రాష్ట్ర విభజనకు దారి తీసిందని, అందుకు జగన్, అతని తండ్రి రాజశేఖర్ రెడ్డే కారకులని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అదే చంద్రబాబు 9 సం.ల పాలనలో తెలంగాణా ప్రజలలో వేరు పడాలనే ఆలోచన కూడా కలగకపోవడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు గుర్తుకు చేసారు. అధికారంలో లేనప్పుడే లక్షల కోట్ల ప్రజాధనం దోచుకొన్న జగన్మోహన్ రెడ్డి భూ, ధన, అధికార దాహానికి అంతే లేదా? అని ఆవేశంగా ప్రశ్నించారు. తెలంగాణా ప్రజల దృష్టిలో సీమాంద్రా ప్రజలను దుష్టులు, దుర్మార్గులు అనే భావం ఏర్పడేలా చేసిన జగన్మోహన్ రెడ్డి, చివరికి కేసీఆర్ సీమాంధ్రులను నోటికి వచ్చినట్లు తిడుతుంటే వారి తరపున నిలబడి వారి ఆత్మగౌరవాన్ని కాపాడలేకపోయారు. అటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.