ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్

 

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా,  మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో ఏపీలో జిల్లాల సంఖ్య 28కి చేరింది. మరోవైపు 5 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులు మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 నుంచి  కొత్త జిల్లాల ఏర్పాటు అమల్లోకి వస్తాయని పేర్కొంది. 

అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మారుస్తూ నోటిఫికేషన్‌ వెలువడింది. మార్పుల్లో నందిగామ మండలాన్ని పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలి రెవెన్యూ డివిజన్‌కు మార్చారు. సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దపురం డివిజన్‌కు మారుస్తూ ఏపీ సర్కార్ కీలక మార్పులు చేసింది. అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్ రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేసి.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండలాల సరిహద్దులను మార్చారు
 

హైదరాబాద్‌లో రోడ్లపై చెత్త, గుంతలు కనిపించొద్దు : సీఎం రేవంత్

  హైదరాబాద్ మహా నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్ వ్యవస్థీకరించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కోర్-అర్బన్ రీజియన్‌ను సమగ్రంగా ప్రక్షాళన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా వచ్చే ఐదేళ్లకు అవసరమైన స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని హైదరాబాద్ నగర జోనల్ కమిషనర్లను సీఎం ఆదేశించారు. నగరాన్ని స్వచ్ఛంగా ఉంచడంలో అతి సంక్లిష్టమైన సమస్య చెత్త నిర్వహణ. ఈ విషయంలో అలసత్వం వద్దని జోనల్ కమిషనర్లు దీనికి బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నగర పునర్వ్యవస్థీకరణ అనంతరం కొత్తగా నియమితులైన జోనల్ కమిషనర్లతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. నగరంలో చెత్త నిర్వహణ అత్యంత క్లిష్టమైన సమస్యగా మారింది. ఈ అంశంపై జోనల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చెత్త నిర్వహణతో పాటు జోన్ల వారీగా ప్రజల సమస్యల పరిష్కారం జోనల్ కమిషనర్ల ప్రధాన బాధ్యత. ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పరిశీలనలు తప్పనిసరిగా చేయాలి.నగరంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించడమే ప్రభుత్వ లక్ష్యం. దశలవారీగా ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాలి. చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ప్రాంతాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేపట్టాలి. చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి కాపాడాల్సిన బాధ్యత అందరిదీ” అని సీఎం స్పష్టం చేశారు. ఎక్కడా చెత్త, గుంతలు కనిపించకూడదునెలకు మూడు రోజులు శానిటేషన్‌పై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని, రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రోడ్లపై గుంతలు లేకుండా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టాలని సూచించారు.ప్రతి పది రోజులకు ఒకసారి గార్బేజ్ క్లియరెన్స్ డ్రైవ్ నిర్వహించాలి. టోల్‌ఫ్రీ నంబర్‌కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలి. దోమల నివారణతో పాటు అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. కోర్-అర్బన్ ఏరియాలో డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. నగరంలో కాలుష్య నియంత్రణకు సమగ్ర చర్యలు చేపడుతున్నామని చెప్పారు.  జనన మరణ ధ్రువీకరణ, ట్రేడ్ లైసెన్సులు, ఇతర పౌరసేవలకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. మీసేవల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలి సీఎం తెలిపారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, అపార్ట్ మెంట్ అసోసియేషన్ లతో కమ్యూనికేషన్ ఉండేలా చూసుకోవాలి. గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్ కు మారాలని తెలిపారు.  హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ విభాగాలు సమన్వయంతో పని చేయాలి. జనవరిలో నాలాల పూడిక తీత పనులు మొదలు పెట్టాలి.  నగరంలో వీధి దీపాల నిర్వహణలో లోపం ఉండొద్దు. CURE ఏరియాలో వివిధ విభాగాల అధికారులను సమన్వయం చేసే బాధ్యత స్పెషల్ సీఎస్ చూసుకోవాలి. దోమల నివారణ, అంటువ్యాధులు ప్రబలకుండా జోనల్ కమిషనర్లు వారి పరిధిలో చర్యలు చేపట్టాలి. ఎక్కడ సమస్య తలెత్తినా పరిష్కరించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వీలయినంత వేగంగా స్పందించాలి. వచ్చే ఐదేళ్లకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు  

న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరుతో సైబర్ మోసగాళ్ల టోకరా

  నూతన సంవత్సర వేడుకలను అవకాశంగా మలుచుకున్న సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు కొత్తరకం ఎత్తుగడలకు తెరలేపారు... “న్యూ ఇయర్ గ్రీటింగ్స్”, “గిఫ్ట్ వచ్చింది” అంటూ లింకులు, ఏపీకే (APK) ఫైల్స్ పంపిస్తూ అమాయకపు జనాలపై వల విసురుతు న్నారు. . గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వస్తున్న ఈ ఫైల్స్‌ను ఓపెన్ చేస్తే మొబైల్ ఫోన్ మొత్తం సైబర్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు పంపిస్తున్న ఏపీకే గిఫ్ట్ ఫైల్స్ ఓపెన్ చేసిన వెంటనే ఫోన్‌లో ఉన్న కీలక సమాచారం మొత్తం హ్యాక్ అవుతోంది. ముఖ్యంగా బ్యాంక్ యాప్స్, వాలెట్ యాప్స్‌ను ఓపెన్ చేసి ఖాతాల్లోని డబ్బును క్షణాల్లో ఖాళీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొంతమంది నేర గాళ్లు బాధితుల పేరుతోనే వారి కాంటాక్ట్స్‌లో ఉన్న వ్యక్తులకు “డబ్బులు కావాలి” అంటూ మెసేజ్‌లు పంపి మోసానికి పాల్పడు తున్నారు. అలాగే వాట్సప్‌ను హ్యాక్ చేసి బాధితుల స్నేహితులు, బంధువులకు డబ్బులు పంపాలని మెసేజ్‌లు పంపుతున్న ఘటనలు కూడా రోజురోజుకి పెరుగుతున్నాయి.  ఈ తరహా మోసాల వల్ల ఇప్పటికే పలువురు లక్షల రూపాయలు కోల్పోయినట్లు సైబర్ క్రైమ్ అధికారులు వెల్లడించారు.ఈ విషయంలో డీసీపీ, సైబర్ క్రైమ్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే ఏపీకే ఫైల్స్, గిఫ్ట్ లింకులు ఓపెన్ చేయవద్దు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరుతో వచ్చే అనుమా నాస్పద మెసేజ్‌లను ఓపెన్ చేయకూడదు...ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ పోలీసు లను సంప్రదించాలి. ఒకవేళ ఫోన్ పూర్తిగా సైబర్ నేరగాళ్ల కంట్రోల్‌లోకి వెళ్లినట్లు గుర్తిస్తే, తక్షణమే ఫ్యాక్టరీ రీసెట్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అంతేకాకుండా తక్షణమే బ్యాంక్‌కు సమాచారం ఇచ్చి ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేయాలని, పాస్‌వర్డ్స్ మార్పు చేయాలని సూచించారు. నూతన సంవత్సరం సంబరాల సమయంలో చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి దారి తీసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

నూతన సంవత్సరం వేళ ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం

  నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరుపుకోవాలంటే మందు, చిందు ఉండాల్సిందే... ఈ కొత్త సంవత్సరం వేడుక ల్లో మద్యం విపరీతంగా అమ్ముడు పోతుంది. అయితే దీన్నే లక్ష్యంగా చేసుకున్న కొందరు కేటుగాళ్లు గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుండి మద్యం బాటిల్స్ తీసుకువచ్చి ఇక్కడ విక్రయించి డబ్బులు సంపాదించాలని ఆశించారు కానీ పాపం పోలీసులు ఇచ్చిన ట్విస్ట్ తో జైలు పాలయ్యారు. నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని అక్రమ మద్యం రవాణాపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపింది. ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ పహాడ్‌ షరీప్‌తో పాటు సంగారెడ్డి ప్రధాన రహదారిలో నిర్వహించిన దాడుల్లో భారీగా అక్రమ మద్యమును పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో మొత్తం 229 మద్యం బాటిళ్లతో పాటు 7.165 లీటర్ల మద్యంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పహాడ్‌షరీప్ ప్రాంతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్స్ నిర్వహించిన తనిఖీల్లో, ఎయిర్‌పోర్టు మార్గంగా గోవా, ఢిల్లీ, హర్యానా వంటి ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం అక్రమంగా తెలంగాణకు తరలిస్తున్నట్లు గా ముందస్తు సమాచారం మేరకు వాహనాలను తనిఖీ చేయగా, నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న 229 మద్యం బాటిళ్లు వెలుగులోకి వచ్చాయి.ఈ దాడుల్లో రంగారెడ్డి జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్టీఎఫ్ బీ టీమ్‌తో పాటు సరూర్‌నగర్‌, మహేశ్వరం ఎక్సైజ్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.  స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను తదుపరి విచారణ నిమిత్తం సరూర్‌నగర్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించి నట్లు అధికారులు తెలిపారు.ఇక సంగారెడ్డి ప్రధాన రహదారిపై చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో గోవా ప్రాంతం నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న 7.165 లీటర్ల మద్యంను కూడా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. మద్యం అక్రమ రవాణాతో ప్రభుత్వానికి భారీగా ఆదాయ నష్టం వాటిల్లు తోందని, దీనిని అరికట్టేం దుకు నిఘా పెంచినట్లు అధికారులు వెల్లడించారు. నూతన సంవత్సరం వేడుకల సమయంలో అక్రమ మద్యం విక్రయాలు, రవాణా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, రహదారులపై గట్టి నిఘా కొనసాగిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.

దుర్గం చెరువు ఆక్ర‌మ‌ణ‌లకు హైడ్రా చెక్‌

  చుట్టూ ఎత్తైన కొండ‌ల మ‌ధ్య సీక్రేట్ లేక్ గా పేరుగాంచిన దుర్గంచెరువును క‌బ్జాల చెర నుంచి హైడ్రా విడిపించింది. మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ వైపు దుర్గం చెరువులో దాదాపు 5 ఎక‌రాల మేర ఉన్న క‌బ్జాల‌ను హైడ్రా మంగ‌ళ‌వారం తొల‌గించింది. మ‌ట్టితో నింపి వాహ‌నాల పార్కింగ్ కోసం వినియోగించి ప్ర‌తి నెలా రూ. 50 ల‌క్ష‌ల వ‌ర‌కూ అద్దెలు వ‌సూలు చేస్తున్న  అక్రమ దందాకు హైడ్రా చెక్ పెట్టింది. అక్క‌డ బాహాటంగా జ‌రిగిన క‌బ్జాల‌పై ప్ర‌జావాణిలో వ‌చ్చిన ఫిర్యాదు మేర‌కు హైడ్రా క‌మిష‌న‌ర్  ఏవీ రంగ‌నాథ్  స్పందించారు.  క్షేత్ర‌స్థాయిలో సంబంధిత శాఖ‌ల అధికారుల‌తో విచార‌ణ చేయ‌మ‌ని ఆదేశించారు. ఈమేర‌కు ప‌రిశీలించిన హైడ్రా అధికారులు.. క‌బ్జాల‌ను నిర్ధారించుకున్నారు. హైడ్రా క‌మిష‌న‌ర్ ఆదేశాల మేర‌కు మంగ‌ళ‌వారం 5 ఎక‌రాల మేర ఉన్న ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా అధికారులు తొల‌గించారు.  అక్క‌డి వాహ‌నాల‌ను ఖాళీ చేయించి ప్ర‌స్తుతానికి ఫెన్సింగ్ వేసింది. త‌ర్వాత మ‌ట్టిని తొల‌గిం చేందుకు హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంటోంది.  దుర్గం చెరువుకు ఆక్ర‌మ‌ణ‌ల దుర్గంధం గోల్కొండ కోట‌లోని రాజ‌వంశానికి తాగు నీరందించిన దుర్గం చెరువుకు ఆక్ర‌మ‌ణ‌ల దుర్గంధం అంటుకుంది. చుట్టూ కొండ‌ల మ‌ధ్య ఎంతో శుద్ధ‌మైన జ‌లాల‌తో దాహార్తిని తీర్చిన ఈ చెరువు క‌బ్జాల‌తో కుంచించుకు పోయింది. న‌గ‌రం న‌డిబొడ్డున‌.. ఐటీ కారిడార్‌లో అంద‌మైన స‌ర‌స్సుగా అల‌రించిన దుర్గం చెరువు మురుగునీటితో దుర్గంధంగా మారింది. ఒక‌ప్పుడు 160 ఎక‌రాల మేర ఉన్న చెరువు నేడు 116 ఎక‌రాలుగా మిగిలిపోయింది. చెరువుకు ఉత్త‌ర దిశ త‌ప్ప.. మిగిలిన మూడువైపులా ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైంది.  1976  నాటికే 29 ఎక‌రాల వ‌ర‌కూ క‌బ్జా అయి.. 131.66 ఎక‌రాల‌కు మిగిలిపోయింది.  1976 వ సంవ‌త్స‌రం నుంచి 1995 వ‌ర‌కూ భ‌ద్రంగానే ఉంది. 1995 నుంచి 2000 సంవ‌త్స‌రం వ‌ర‌కూ  మ‌రో 10 ఎక‌రాల మేర క‌బ్జాకు గురై..121 ఎక‌రాల‌కు కుంచించుకుపోయింది. 2000 నుంచి నేటికి మ‌రో 5 ఎక‌రాలు క‌బ్జాకు గుర‌య్యింది. ఇలా ఎప్పుడు ఏ సంవ‌త్స‌రంలో క‌బ్జాల ప‌ర్వం ఎలా సాగిందో ఎన్ ఆర్ ఎస్ సీ అందించిన శాటిలైట్ చిత్రాలు క‌ళ్ల‌కు క‌డుతున్నాయి.  *మ‌ట్టితో నింపుతూ ఆక్ర‌మ‌ణ‌లు.. మాదాపూర్ ఇన్ ఆర్బిట్ మాల్ వైపు ఏకంగా 5 ఎక‌రాలు క‌బ్జాల‌కు గురైంది. కొండ‌ల‌ను త‌వ్వుతూ భ‌వంతులు నిర్మించిన వారికి ఇప్పుడు దుర్గం చెరువు ఒక డంపింగ్ యార్డుగా మారింది. 10 నుంచి 15 మీట‌ర్ల మేర మ‌ట్టితో నింపి క్ర‌మంగా చెరువులోకి జ‌రిగి ఏకంగా 5 ఎక‌రాల‌ను క‌బ్జా చేశారు. అలా చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఆక్ర‌మించిన స్థ‌లం నాదంటూ ఓ ప్ర‌జాప్ర‌తినిధి ఇప్పుడు క్లైం చేస్తున్నారు.  అంతే కాదండోయ్ ఈ కబ్జాదారులు ఏకంగా.. స్కూల్ బ‌స్సులు, ఐటీ సంస్థ‌ల‌కు చెందిన వాహ‌నాల పార్కింగ్‌తో ప్ర‌తి నెల రూ. 50 ల‌క్ష‌ల వ‌ర‌కూ అద్దెలు వసూలు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. భూమికి సంబంధించిన రికార్డులు లేకుండానే అక్క‌డ పార్కింగ్ దందా చేస్తున్నారు.  నెమ్మ‌దిగా మ‌ట్టిని నింపుకుంటూ ఎక‌రం నుంచి 5 ఎక‌రాల వ‌ర‌కూ మెల్లిమెల్లిగా ఆక్రమించేశారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి కూడా ఈ ఆక్ర‌మ‌ణ అడ్డుగా మారింది.  ప్రజా ప్రతినిధిదని చెబుతున్న భూమే ప్ర‌తి ఏటా పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. హెచ్ ఎం డీ ఏ మాత్రం 2014లో 160.7 ఎక‌రాలుగా నిర్ధారిస్తూ ప్రిలిమ‌న‌రీ నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఎన్ ఆర్ ఎస్ సీ, స‌ర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ రికార్డుల ఆధారంగా చెరువు వైశల్యాన్ని తేల్చే ప‌నిలో హైడ్రా నిమ‌గ్న‌మైంది. ఈ నేపథ్యంలోనే చెరువు ప‌రిధిలో ఉన్న ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గిస్తోంది.

సైబర్ నేరాల వలలో చిక్కుకుంటున్న అమాయకులు

  సులభంగా డబ్బు వస్తుందన్న ఆశతో అమాయకులు చేస్తున్న చిన్న తప్పిదాలు, భవిష్యత్‌ను చీకట్లోకి నెట్టేస్తున్నాయి. చాలా మంది అమాయకులు సైబర్ నేరగాళ్ల మాయలో పడి బ్యాంక్ ఖాతాలను ఇతరులకు అప్పగించడం, తెలియని వ్యక్తుల నుంచి డబ్బు స్వీకరించడం, నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లను నమ్మడం వంటి చర్యల కారణంగా వందలాది బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అవుతున్నా యని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తం గా బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అయ్యే కేసులు గణనీయంగా పెరిగాయని అధికారులు తెలిపారు. సైబర్ నేరాలకు సంబంధించిన డబ్బు లావాదేవీలు జరుగుతు న్నట్లు గుర్తించిన వెంటనే పోలీసులు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారని స్పష్టం చేశారు. అసలు ఎలా ఫ్రీజ్ అవుతున్నాయి? వ్యాపార రుణాలు ఇప్పిస్తామని, క్రిప్టో ట్రేడింగ్‌లో లాభాలు వస్తాయని, ఇన్‌స్టంట్ లోన్లు ఇస్తామని సైబర్ మోసగాళ్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే సైబర్ కేటుగాళ్లు కొందరి బాధితుల  బ్యాంక్ ఖాతాలను తమ నియం త్రణలోకి తీసుకుని అక్రమ లావాదేవీలు జరిపి, ఆ డబ్బును క్రిప్టో కరెన్సీ (USDT) కొనుగోళ్లకు ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. ఇలాంటి అక్రమ లావాదేవీల్లో ఉపయోగించిన ఖాతాలను పోలీసులు గుర్తించి ఫ్రీజ్ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్, నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లు, అక్రమ లోన్ యాప్‌ల ద్వారా వచ్చిన డబ్బు కూడా సైబర్ నేరాలకు సంబంధించినదై ఉండే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ‘మనీ మ్యూల్’గా మారుతున్న యువతవిద్యార్థులు, నిరుద్యోగ యువత, డ్రైవర్లు, రోజువారీ కూలీలే ప్రధానంగా సైబర్ నేరగాళ్ల లక్ష్యమవుతు న్నారని పోలీసులు తెలిపారు.  

వల్లభనేని వంశీని వీడని కేసుల గ్రహణం...మళ్లీ అజ్ఞాతంలోకి

  గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీని కేసుల గ్రహణం వీడటం లేదు. తాజాగా ఆయనపై మరో హత్యాయత్నం కేసు నమోదవ్వడంతో అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లారు.   2024 జూన్ 7వ తేదీన సునీల్ అనే వ్యక్తిపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ నెల 17వ తేదీన మాచవరం పోలీసులు వల్లభనేని వంశీపై హత్యాయత్నం కేసును నమోదు చేశారు. సునీల్‌పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి మొదటి నుంచే వంశీ పాత్రపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో కీలక ఆధారాలు లభించడంతో, హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు విజయవాడ మాచవరం పోలీసులు వెల్లడించారు.  ఈ కేసు నమోదు తర్వాత నుంచి వల్లభనేని వంశీ పోలీసులకు అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. వంశీపై కేసు నమోదు కావడం, వెంటనే ఆయన కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను పెంచుతోంది. గతంలోనూ వివాదాస్పద అంశాల్లో ఆయన పేరు వినిపించిన నేపథ్యంలో ఈ తాజా పరిణామం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది ఇదిలా ఉంటే.. గతంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై వంశీ, వైసీపీ కీలక నేతలు దాడి చేశారు. ఈ కేసులో సత్యవర్థన్ ప్రధాన సాక్షిగా ఉన్నారు. ఈ కేసు బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే సత్యవర్థన్‌ను వంశీ కిడ్నాప్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులోనే ఆయన జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదల అయ్యారు. ప్రస్తుతం సునీల్‌పై హత్యాయత్నం కేసులో మాచవరం పోలీసులు వంశీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆయనకు సంబంధించిన సన్నిహితులు, అనుచరులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.  వంశీ దేశంలోనే ఉన్నారా లేక ఇతర ప్రాంతాలకు వెళ్లారా అనే అంశంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు ఎంతటి రాజకీయ నేపథ్యం కలిగి ఉన్నా చట్టం ముందు అందరూ సమానమేనని పోలీసులు స్పష్టం చేశారు. వంశీని త్వరలోనే అదుపులోకి తీసుకుని విచారణ చేపడతామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారం గన్నవరం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా భద్రతపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు మాచవరం పోలీసులు వెల్లడించారు.    

మెట్రో ప్రయాణీకులకు గుడ్‌న్యూస్

  కొత్త సంవత్సర వేడుకలు దృష్ట్యా హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈనెల 31న మెట్రోరైలు వేళలను పొడిగించారు. బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రారంభ స్టేషన్‌ల నుంచి రాత్రి ఒంటిగంటకు చివరి మెట్రో రైళ్లు బయలుదేరనున్నాయి. మెట్రో రైలు ప్రయాణీకులు దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ జర్నీని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ రోజుల్లో రాత్రి 11 గంటలకు మెట్రో రైలు అందుబాటులో ఉంటాయి.  మరోవైపు న్యూ ఇయర్ వేడుకలు సందర్భంగా నగరంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హైదరాబాద్ పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి జరగనున్న న్యూ ఇయర్ వేడుకలపై పలు ఆంక్షలు విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి వేళ నగరంలో గస్తీ ముమ్మరంగా ఉంటుందని.. మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు   

పాలమూరు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌పై ఏసీబీ కస్టడీ పిటిషన్

  మహబూబ్‌నగర్ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల అరెస్టు అయిన కిషన్‌ను ఏడు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగిం చాలని కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం, కిషన్ తన విధి నిర్వహణలో  ఆదాయానికి మించిన భారీ ఆస్తులను సంపాదించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.  ఈ నేపథ్యంలోనే ఆయన నివాసాలు, కార్యాలయాలు సహా పలు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో కీలక పత్రాలు, ఆస్తులకు సంబం ధించిన వివరాలు, బ్యాంకు లావాదేవీల ఆధారాలు లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా పలు అంశాలపై లోతైన విచారణ అవసరమని ఏసీబీ అధికారులు పేర్కొంది. అక్రమంగా సంపాదించిన ఆస్తుల మూలాలు, వాటిలో భాగస్వాముల పాత్ర, బినామీ లావాదేవీల కోణం, ఇతర అధికారులతో ఉన్న సంబంధాలపై స్పష్టత కోసం కస్టడీ అవసరమని ఎసిబి అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌లో వివరించారు.  ఈ కారణంగానే కిషన్‌ను ఏడు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు. అంతేకాకుండాఈ కేసులో కీలకంగా భావిస్తున్న పలువురు వ్యక్తులను విచారించాల్సి ఉండటంతో పాటు, మరిన్ని డాక్యు మెంట్లు సేకరించాల్సిన అవసరం ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. కస్టడీ లభిస్తే ఈ దర్యాప్తు మరింత వేగంగా, సమగ్రంగా సాగుతుందని వారు భావిస్తు న్నారు ఏసీబీ అధికారులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై రేపు ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. కోర్టు తీసుకునే నిర్ణయంతో కేసు కీలక మలుపులు తిరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

గోవా నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితురాలు అరెస్ట్

  గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న బంజారాహిల్స్‌కు చెందిన హస్సా అనే మహిళను  తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుండి MDMA మరియు LSD బ్లాట్స్ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, రోడ్ నెం.3, గెలాక్సీ మొబైల్ షాప్ సమీపంలో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో. ఆమెను విచారించగా, మాదకద్రవ్యాల వినియో గానికి సంబంధించిన కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. హస్సాను అరెస్టు చేసిన అనంతరం నిర్వహించిన వైద్య పరీక్షల్లో మెత్ మరియు ఆంఫెటమైన్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.  దీంతో ఆమె కేవలం వినియోగదారురాలే కాకుండా, డ్రగ్స్ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో హస్సా చెప్పిన విషయాలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. హస్సా డిసెంబర్ 2024లో బస్సులో గోవాకు వెళ్ళానని, అక్కడ హైదరాబాద్ బోయిన్‌పల్లికి చెందిన మీనా మరియు ఆమె స్నేహితుడు కిరణ్‌ను కలిసినట్లు వెల్లడించింది. గోవాలోని మెర్మైడ్ హోటల్‌లో కలిసి బస చేసి, వాగేటర్ బీచ్, వాగేటర్ క్లబ్‌లకు వెళ్లినట్లు తెలిపింది. అక్కడే, మీనా ద్వారా సియోలిమ్ (గోవా)కు చెందిన రోమి భరత్ కళ్యాణి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు తెలిపింది.  ఆ సమయంలో రోమి ఇచ్చిన పసుపు రంగు పొడిని డ్రగ్‌గా వినియోగించినట్లు అంగీకరించింది. డిసెంబర్ 2025లో జరిగిన పర్యటనల్లో కూడా రోమి లేదా అతని మధ్యవర్తుల ద్వారా డ్రగ్స్ లావాదేవీలు జరిగినట్లుగా హస్సా పోలీసులకు వివరించింది.డిసెంబర్ 26, 2025న, సియోలిమ్ మరియు అనంతరం మాపుసాలో రోమి వ్యక్తిగతంగా కలసి MDMA మరియు LSD బ్లాట్స్‌ను అందించినట్లు హస్సా తెలిపింది. కొన్నిసార్లు హైదరాబాద్‌కు చెందిన సుమిహా ఖాన్, వజీర్ బాక్సర్ వంటి పరిచయస్తులతో కలిసి డ్రగ్స్ వినియోగించినట్లు కూడా హస్సా అంగీకరించింది.

తెలంగాణలో 2.33% క్రైమ్ రేట్ తగ్గింది : డీజీపీ శివధర్ రెడ్డి

  తెలంగాణలో 3 శాతం సైబర్ నేరాలు తగ్గాయని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. గత ఏడాదితో పోలీస్తే 2.33% క్రైమ్ రేట్ తగ్గిందని డీజీపీ తెలిపారు. మంగళవారం నాడు 2025 వార్షిక నివేదికను డీజీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని తెలిపారు.  ఫ్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా భద్రతాపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. మిస్ వరల్డ్ ఈవెంట్ కూడా దిగ్విజయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకున్నామని చెప్పారు.  మూడు విడతలు గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా  నిష్పక్షపాతంగా జరిగేలా కాపాడామని డీజీపీ అన్నారు. ఈ ఏడాది 2.28 లక్షలు కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో 4 కేసులో మరణ శిక్షలు ఖరారు అయ్యాయని.. 216 కేసుల్లో 320 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పండిందని తెలిపారు. ఫోక్సో కేసుల్లో 144 కేసుల్లో 154 మందికి శిక్షలు ఖరారు అయ్యాయని.. అందులో ముగ్గురికి మరణ శిక్ష, 48 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడ్డాయని డీజీపీ తెలిపారు.