పవన్ కల్యాణ్‌కు విశాఖ పోలీసుల నోటీసులు
posted on Aug 11, 2023 @ 5:46PM
దాడులు, కేసులతో తనను వ్యతిరేకించే గళాలను అణచివేయాలని ఏపీ సీఎం జగన్ భావిస్తున్నట్లు ఉన్నారు. నిన్న చంద్రబాబు పర్యటనలో జరిగిన ఘర్షణలను ఆసరా చేసుకుని ఆయనపై కేసు నమోదు చేసి ఎ1గా పేర్కొన్న సంఘటన తాజాగా ఉండగానే.. ఇప్పుడు విశాఖ పర్యటన సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఆయనకు నోటీసులు ఇచ్చారు.
వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రలో భాగంగా గురువారం (ఆగస్టు 10) జరిగిన సభలో పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ అభియోగాలు దాఖలు చేశారు. ఈ మేరకు విశాఖ తూర్పు ఏసీపీ పవన్ కల్యాణ్‌కు బహిరంగ సభలో పవన్ నిబంధనలు ఉల్లంఘించారని.. పవన్ ఇలా వ్యవహరించి ఉండకూడదని పేర్కొంటూ నోటీసులు అందించారు. అసలు పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు అడగడుగునా ఆంక్షలు విధించిన పోలీసులు.. ఇప్పుడు పవన్ కు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులు ఇవ్వడం విశేషం.
గతంలో వాడు వీడు అంటూ వైసీపీ మంత్రులు చేసిన ప్రసంగాలకు సంబంధించి ఎటువంటి చర్యా తీసుకోని పోలీసులు ఇప్పుడు పవన్ కల్యాణ్ కు మాత్రం ఆయన ఎలా మాట్లాడవలసి ఉందంటూ హితోక్తులు చెబుతూ నోటీసులు అందించడాన్ని జనసైనికులు తప్పుపడుతున్నారు.
అదలా ఉంటే వారాహి యాత్రలో భాగంగా రుషికొండ ప్రాంతంలో జనసేనాని పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. విశాఖలోని జోడుగుళ్లపాలెం నుంచి ఎవరినీ అనుమతింబోమని పోలీసులు స్పష్టం చేశారు. ర్యాడిసన్ బ్లూ హోటల్ నుంచి కేవలం పవన్ వాహనాన్ని మాత్రమే అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. రుషికొండ ఎదురుగా ఉన్న రోడ్డులో మాత్రమే పవన్ వెళ్లాలన్నారు. కావాలంటే పవన్ కల్యాణ్ గీతం యూనివర్సిటీ వద్ద మీడియాతో మాట్లాడవచ్చని పోలీసులు అవకాశం ఇచ్చారు.