రాజధానులకు జగన్ శఠగోపం?
posted on Sep 8, 2022 @ 2:29PM
మూడు రాజధానుల సాకుతో ఇప్పటిదాకా అమరావతి నిర్మాణాన్ని ఆపేసిన జగన్ లో జనం నుంచి ఛీత్కారాలు వచ్చినా, కోర్టులు మొట్టిక్కాయలు వేసినా మార్పేమీ రాలేదు. అమరావతిపై కసితో, పగతో రగిలిపోతున్న జగన్ ఇప్పుడు ఏపీ రాజధానిని సర్వనాశనం చేసేందుకే పక్కా స్కెచ్ రెడీ చేస్తున్నారు. రాజధాని ప్రణాళికల్లో మార్పులకు వీలుగా సీఆర్డీయే చట్టానికి సవరణలు చేస్తూ కేబినెట్ సమావేశం ఆమోదించడమే ఇందుకు ఉదాహరణ. రాజధాని కోసం రైతులిచ్చిన భూముల్లో ఇళ్ల స్థలాల కేటాయింపు సీఆర్డీయే చట్టానికి విరుద్ధమని గతంలోనే హైకోర్టు తీర్పు చెప్పింది. ఇప్పుడు దొడ్డిదారిన ఆ చట్టాన్ని సవరించి అమరావతిని మురికివాడగా మార్చేందుకు జగన్ రంగం సిద్ధం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి సమీకరించిన భూమిలో పేదలందరికీ ఇళ్లు పథకం కింద బయటి ప్రాంతాల వారికి ఇళ్లస్థలాలు కేటాయించాలన్న ఏపీ సర్కార్ నిర్ణయాన్ని గతంలో హైకోర్టు నిలిపి వేసింది. దీంతో తన పంతం నెగ్గించుకునేందుకు ఏకంగా సీఆర్డీయే చట్టాన్నే సవరించాలనే తెంపరితనానికి జగన్ సర్కార్ రెడీ అయిపోయింది. రాజధాని పర్స్ పెక్టివ్ ప్లాన్, బృహత్తర ప్రణాళిక, మౌలిక వసతుల ప్లాన్ లో ఇష్టానుసారం మార్పులు చేసేందుకు వీలు కల్పిస్తూ సీఆర్డీయే చట్టంలో ప్రతిపాదించిన సవరణలకు రాష్ట్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. 2014 నాటి సీఆర్డీయే చట్టంలోని 41(1), 41(3) సెక్షన్లను సవరించడంతో పాటు, కొత్తగా 41(6) సెక్షన్ చేర్చింది. 2 (22)సెక్షన్ ను సవరించడంతో పాటు కొత్తగా 53(1) సెక్షన్ జత చేసింది. రాజధానిలో గృహనిర్మాణ పథకానికి రాష్ట్రంలోని ఏ ప్రాంతం వారైనా అర్హులే అంటూ.. అమరావతిని నాశనం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుందనే ఆరోపణలు విపక్షాల నుంచి వస్తున్నాయి.
సీఆర్డీయే చట్టం ప్రకారం రాజధాని పర్స్ పెక్టివ్ ప్లాన్ ను పదేళ్ల దాకా మార్చడానికి వీల్లేదు. తర్వాత కూడా గ్రామసభల ఆమోదంతోనే మార్పుచేర్పులు చేయాలి. అలాంటి అమరావతిలో అశాంతి రేకెత్తించేందుకు, ఘర్షణలు తలెత్తేలా చేసేందుకు ఏపీ ప్రభుత్వ పెద్దలు మాస్టర్ ప్లాన్ వేశారంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాల అమలు ముసుగులో సీఆర్డీయే చట్టంతో పాటు, ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్స్, అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల చట్టంలోనూ ప్రభుత్వం సవరణలు ప్రతిపాదించింది. అయితే వీటిలో సీఆర్డీయే చట్టంలో ప్రతిపాదించిన సవరణలే అత్యంత కీలకమైనవి.
రాజధానికి భూముల్లో బయటివారికి ఇళ్ల స్థలాల కేటాయింపు జోనల్ రెగ్యులేషన్ విధానానికి వ్యతిరేకమని హైకోర్టు ధర్మాసనం 2020 మార్చి 23న స్పష్టం చేసింది. రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పులు చేయడానికి వీల్లేదని, ఉన్నది ఉన్నట్టు రాజధాని నగరాన్ని అభివృద్ధి చేయాలని 2022 మార్చి 3న ఇచ్చిన మరో తీర్పులో హైకోర్టు ధర్మాసనం విస్పష్టంగా చెప్పింది. దానికి భిన్నంగా ఇప్పుడు రాజధాని మాస్టర్ ప్లాన్లో ఇష్టానుసారం మార్పులు చేసేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం సీఆర్డీయే చట్టానికి సవరణలు తేవడం హైకోర్టు తీర్పుల్ని ఉల్లంఘించడమే అవుతుందంటున్నారు. పర్సన్ ఇన్ చార్జులుగా ఉన్న ప్రభుత్వ అధికారుల నుంచి ప్రతిపాదన తీసుకుని, రాజధాని ప్రణాళికల్లో మార్పులు చేసేందుకే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని న్యాయనిపుణులు అంటున్నారు. సీఆర్డీయే చట్టంలో గతంలో లేని సెక్షన్ 53(1)ని ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించింది.
అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి సేకరించిన భూమిలో 1251 ఎకరాల్లో గుంటూరు జిల్లా తాడేపల్లి, పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాల మండలాలతో పాటు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని మొత్తం 54,307 మంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు రాజధానిలో ఇళ్లస్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 25న జీఓ 107 జారీ చేసింది. రైతుల నుంచి సేకరించిన భూముల్లో ఇళ్లస్థలాలు ఇవ్వడం సీఆర్డీయే చట్ట నిబంధనలకు విరుద్ధమని కోర్టు తేల్చిచెప్పింది. ప్రభుత్వం జారీ చేసిన జీఓ నం. 107ని సస్పెండ్ చేసింది. అయినప్పటికీ చట్టాన్నే సవరించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం.
ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ వైసీపీకి లేదని, ప్రస్తుత ప్రభుత్వానికి కూడా త్వరలోనే నూకలు చెల్లిపోయే పరిస్థితి రావచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకే తన శక్తియుక్తులను వినియోగించాల్సిన జగన్ రెడ్డి ఒక్క అమరావతికే కాదు.. తానే చెబుతున్న మూడు రాజధానుల అంశానికి కూడా ఎగనామం పెట్టేయొచ్చనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.