జగన్ మంత్రివర్గంలోమళ్ళీ మార్పులు?..ఆ .. మంత్రులకు ఉద్వాసన?
posted on Sep 8, 2022 @ 2:13PM
ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించి నిండా ఆరు నెలలు అయినా కాలేదు. నిజానికి, ఇదే మంత్రివర్గం ఎన్నికల వరకు కొనసాగుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రులకు భరోసా ఇచ్చారో లేదో గానీ, చాలా వరకు మంత్రులు, మాజీలు, ఎమ్మెల్యేలు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, చివరకు సామాన్య ప్రజలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు.
కానీ, ఇప్పుడు, మళ్ళీ మంత్రివర్గంలో మార్పులు చేర్పుల గురించి, వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలోనే కొందరు మంత్రులకు ఉద్వాసన ఉంటుందని అంటున్నారు. నిజానికి, 2019లో తొలి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, పౌరాణిక నాటకాల్లో ఒకటో కృష్ణుడు రెండవ కృష్ణుడు అన్నట్లుగా, రెండున్నరేళ్ళ తర్వాత మొత్తానికి మొత్తంగా మంత్రులందరినీ మార్చేసి కొత్త వారికి అవకాశం ఇస్తానని, చెప్పారు. అయినా, అది జరగలేదు. చివరకు ఇంచుమించుగా మూడేళ్ళు కావస్తున్న సమయంలో గత ఏప్రిల్ రెండవ వారంలో జగన్ మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు.
నిజానికి, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పేరిట ముఖ్యమంత్రి చాలా భారీ కసరత్తే చేశారు. అయితే చివరకు చాంతాడంత రాగం తీసి అదేదో పాట పడినట్లుగా, తొలి కాబినెట్’లో సగం మందిని సాగనంపి, సగం కొత్త, సగం పాత ముఖాలతో పాత కొత్త కాబినెట్’ను ఏర్పాటు చేశారు. కొత్త కాబినెట్ కొలువు తీరి ఇంకా నిండా ఆరు నెలలు కూడా కాలేదు, కానీ ఇంతలోనే కొత్త మంత్రివర్గంఫై ముఖ్యమంత్రికి ముఖం మొత్తినట్లు తెలుస్తోంది. కొందరు మంత్రుల పని తీరు బాలేదని, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వారిపై గుస్సా అవుతునట్లు తెలుస్తోంది.
బుధవారం(ఆగస్టు 7) జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏ మాత్రం మొహమాటం లేకుండా, కొందరు సీనియర్ మంత్రులు సహా ఓ డజను మందికి పైగా మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి పదవులు ఇచ్చింది బుగ్గకార్లు ఎక్కి తిరగడానికా ? అంటూ కొందరు మంత్రులను ముఖం మీదనే క్లాసు పీకారని తెలుస్తోంది. అంతే కాదు కొందరు మంత్రులు ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలు తమకు అసలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని,ఇలా అయితే మంత్రివర్గంలో మార్పులు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారని సమాచారం.
అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఒక్కసారిగా ఇంతలా కోపం ఎందుకొచ్చింది అంటే, మంత్రులు తమ శాఖలకు సంబందించి తప్పులు చేశారనో, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారనో కాదు, ప్రతిపక్షాల నుంచి ఆరోపణలకు వస్తున్నా, ముఖ్యంగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు వస్తున్నా, మంత్రులు పట్టించుకోవం లేదని ముఖ్యమంత్రి మండిపడినట్లు సమాచారం. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ముఖ్యంత్రి జగన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సంబంధం ఉందని వస్తున్న ఆరోపణలపై మంత్రులు ఎవరూ స్పందించక పోవడంపై ముఖ్యమత్రి గుస్సా అయినట్లు సమాచారం.
మరో వంక ప్రస్తుత, మాజీ మంత్రులు సహా అనేక మంది ఎమ్మెల్యేలు, కీలక నేతలు కూడా అసహనంతో రగిలిపోతున్నారు. ముఖ్యమంత్రి మీటలు నొక్కి తన గ్రాఫ్ బాగుందని మంత్రులు, ఎమ్మెల్యేలు సరిగా పనిచేయక పోవడం వలన వారి గ్రాఫ్ పడిపోతోందని ముఖ్యమత్రి భావిస్తున్నారని మంత్రులు, ఎమ్మెల్యేలు అంటున్నారు.
అదలా ఉంటే ఎన్నికల లోపు ముఖ్యమంత్రి మరోమారు మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేస్తారా? అంటే, అవకాశం లేక పోలేదని పార్టీ ముఖ్య నేతలు అంటున్నారు. అదే జరిగితే, కనీసం అరడజను మంది మాత్రులకు ఉద్వాసన తప్పక పోవచ్చని అంటున్నారు. అందుకే కావచ్చును, కుర్చీ కాపాడుకుందుకు సీనియర్ మంత్రులు మీడియా ముందుకొచ్చి లిక్కర్ కుంభకోణం పై స్పందిస్తునారు.భారతి పై నిందలేస్తారా?అంటూ స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు.
అదలా ఉంటే ఆశావహులు, మళ్ళీ మరోమారు తమ అదృష్టాన్ని పరిశీలించుకునేందుకు సిద్దమవుతున్నారు. ముఖ్యనేతలను కలిసి, దండాలు పెడుతున్నారు. ముడుపులు కడుతున్నారని అంటున్నారు.అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, పార్టీలో పెరుగతున్న అసంతృప్తి చల్లార్చేందుకు, ముఖ్యమంత్రి మంత్రివర్గ విస్తరణ అంశాన్ని తెర మీదకు తెచ్చారనీ అంటున్నారు.