ఆక్లాండ్ వానపాము..4 అడుగుల 7 అంగుళాలు!
posted on Sep 8, 2022 @ 2:42PM
ఇంటి పెరట్లోనో, వీధి గేటు దగ్గరో పిల్లలు ఆడుతూనే మట్టిలో కాళ్లతో, చేతులతో రాస్తూ వింతగా ఏదన్నా కనపడితే ఏమిటా అని చూస్తుంటారు. అదుగో అలా బార్న్‌బే కూడా తన తమ్ముడు, చెల్లెలితో ఆడుతూ న్నాడు. కొంతసేపటికి మట్టి దిబ్బ గోతిలో చేయి పెట్టాడు. ఏదో తాడులాగా చేతికి పట్టుకుంది. దాన్ని పైకి తీద్దామనుకున్నాడు. అదేమన్నా చిన్న తాడుముక్కా..కాదు పేద్ధ వానపాము. ముందు భయపడ్డా డు. అరుపులు విని కొద్దిదూరంలోనే ఉన్న తమ్ముడు, చెల్లి కూడా పరుగున వెళ్లారు. వాళ్లు పాములా ఉన్న దాన్ని చూసి అలా చూస్తుండిపోయారు.
చేత్తో లాగలేక కర్ర తెచ్చి ముగ్గురూ దాన్ని బయటికి లాగారు. తీరా చూస్తే అది పాము కాదు. వానపాము లాంటిది. మా టీచర్ ఎప్పుడూ దీన్ని గురించి చెప్పలేదే అనుకున్నాడా పిల్లవాడు. మిగతా ఇద్దరు భయం భయంగా దాన్ని తాకి చూశారు. ప్రాణంతోనే ఉందని తెలుసుకున్నారు. అదేమీ చేయదని చేతులతో పట్టు కుని కర్రకు చుట్టి మరీ ఇవతలకు తీసుకువచ్చారు. పరుగున వెళ్లి అందర్నీపిలిచారు. దాన్ని చూసి అం దరూ ఆశ్చర్యపోయారు. ఒక పెద్దాయన దాన్ని పెద్ద కర్రతో ఎత్తి పట్టుకుని గమనిస్తే, అది ఏకంగా నాలుగు అడుగులా ఏడు అంగుళాలు ఉంది!
న్యూజిలాండ్, ఆక్లాండ్‌లో కనిపించిన అంత పెద్ద వానపాములాంటి జీవాన్ని చూసిన శాస్త్రవేత్తలు దాన్ని మెగాస్కోలిసిడె జాతికి చెందినదని తేల్చేరు. దీనికే ఆక్లాండ్ వామ్ అనీ పేరుందిట. సాధారణంగా అంత పెద్ద పాము, వానపామో, మరేదయినా కనపడితే మన ఊళ్లలో అయితే వెంటనే కర్రతో కొట్టి చంప డమే చేస్తాం. కానీ అక్కడి వారు అలా చేయలేదు. మళ్లీ దాన్ని తోటలో దొరికిన చోటనే వదిలేశారు. అది తీరిగ్గా శరీరాన్ని కదులుస్తూ పదినిమిషాలకు ఆ మట్టి గొయ్యిలోకి వెళ్లిందట!