తెలుగుజాతి సంతకాన్ని చెరిపేసే ప్రయత్నం!?
posted on Nov 3, 2022 @ 10:08AM
ఏపీలో తెలుగుజాతి సంతకం ఎన్టీఆర్ ఆనవాళ్లు చెరిపేసే ప్రయత్నానికి జగన్ సర్కార్ తెరలేపిందా? అంటే ఔననే సమాధానమే వచ్చేలా పరిస్థితులు ఉన్నాయి. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును మార్చేసిన జగన్ రెడ్డి.. ఆ మార్పునకు గవర్నర్ ఆమోదముద్ర పడీ పడటంతోనే వర్సిటీలో ఎక్కడా ఎన్టీఆర్ ఆనవాలే లేకుండా చేసేశారు.
చివరాఖరికి ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా తొలగించేసి ఆ స్థానంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ప్రయత్నాలు శరవేగంగా ప్రారంభమైపోయాయి. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును మార్చి తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించిన క్షణం నుంచీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. చివరికి ఈ నిర్ణయంపై సొంత పార్టీలోనే నిరసనలు వ్యక్తమైనా జగన్ ఖాతరు చేయలేదు. మొండిగా తన నిర్ణయాన్ని అమలు చేసి తీరాల్సిందేనని భీష్మించారు.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఆయనే కర్త, కర్మ, క్రియగా ఏర్పాటైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు తొలగించాలన్న నిర్ణయం తీసుకోవడమే దారుణమని జనం భావిస్తుంటే.. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పునకు గవర్నర్ ఆమోదముద్ర ఇలా వచ్చీ రావడంతోనే రాత్రికి రాత్రి యూనివర్సిటీ మొత్తం ప్రాంగణంలో ఎక్కడా ఎన్టీఆర్ పేరు కనిపించకుండా చెరిపేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అన్న పేరు ఉన్న బోర్డు రాత్రికి రాత్రే మాయమైపోయింది. ఆ స్థానంలో వైఎస్సార్ హెల్త్ వర్సిటీ అన్న బోర్డు వెలిసింది. అలాగే వర్సిటీ వెబ్ సైట్లలోనూ రాత్రికి రాత్రే పేరు మారిపోయింది. ఇక శిలాఫలకాల మీద, లెటర్ హెడ్ లమీద కూడా రాత్రికి రాత్రి ఎన్టీఆర్ స్థానంలో వైఎస్సార్ పేరు వచ్చి చేరింది.కొత్తగా డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్సిటీ అన్న డిజిటల్ బోర్డును ఏర్పాటు చేశారు.
వర్సిటీ ప్రాంగణంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసేసి ఆ స్థానంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ప్రకటించేశారు. సాధారణంగా ఎవరూ ఉన్న విగ్రహాన్ని తొలగించి వేరొకరి విగ్రహాన్ని ఏర్పాటు చేయరు. ఉన్న విగ్రహాన్ని అలాగే ఉంచి.. ఆ పక్కనో, లేదా కొంచం దూరంగానో వేరేవారివిగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ జగన్ సర్కార్ రూటే సెపరేటు. మహనీయుల పట్ల సర్కార్ కు గౌరవం లేదు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనన్న జంకు లేదు.
మూర్ఖత్వమో మరొకటో తెలియదు కానీ.. సర్వ విలువలకూ, సంప్రదాయాలకూ తిలోదకాలిచ్చేసైనా సరే తాము అనుకున్నది చేసేయడమే అన్నది జగన్ సర్కార్ తీరుగా మారిపోయింది. వైపరీత్యం కాకపోతే.. వైసీపీ సర్కార్ వర్గాలు ఇప్పటి వరకూ వర్సిటీ పేరు మీద జారీ అయిన సర్టిఫికెట్లను కూడా రద్దు చేసి.. వాటి స్థానంలో వైఎస్సార్ హెల్త్ వర్సిటీ పేరుమీద వాటిని మళ్లీ జారీ చేస్తామని చెబుతున్నారని తెలుస్తోంది. అయితే ఇందుకు మెడికల్ కౌన్సిల్ అనుమతిస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.