వైసీపీ సర్కార్ అసహనానికి పరాకాష్ట.. చంద్రబాబు
posted on Aug 6, 2022 8:15AM
రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలపైనా కేసులు నమోదు చేసే స్థాయికి జగన్ ప్రభుత్వ అసహనం చేరుకుందని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు బనాయిస్తూ వైసీపీ జనం నోళ్లు నొక్కాలని ప్రయత్నిస్తోందని మండి పడ్డారు.
చిత్తూరు జిల్లా వేపనపల్లిలో ఎమ్మెల్యేను నిలదీసిన విద్యార్థిపై కేసు బనాయించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. విద్యార్థిపై కేసు నమోదు చేసినందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు. విద్యార్థి జస్వంత్, అతడికి మద్దతుగా నిలిచిన వారిపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. పోలీసుల తీరు దారుణంగా ఉందని, వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని దుయ్యబట్టారు.
డీజీపీ ఈ వ్యవహారంపై దృష్టి సారించాలన్నారు. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక జగన్ సర్కార్ తీవ్ర అసహనానికి గురౌతోందని, ఇప్పటికే రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన జగన్ సర్కార్ ఇక విద్యార్థుల జీవితాలను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం వైసీపీ సర్కార్ తీరును విమర్శిస్తోందనీ చంద్రబాబు అన్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలను, నాయకులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారనీ, ఇలా నిలదీస్తున్న వారందరిపైనా కేసులు పెట్టుకుంటూ పోతే రాష్ట్రంలోని ఐదు కోట్ల మందిపైనా కేసులు నమోదు చేయాలని, వారందరినీ అరెస్టు చేయాలంటే రాష్ట్రంలోని జైళ్లు చాలవని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రశ్నించిన వారిని కేసులతో వేధించడం మాని.. పాలనపై దృష్టి సారించాలనీ, సమస్యల పరిష్కారినికి ముందుకు రావాలని చంద్రబాబు జగన్ సర్కార్ కు హితవు చెప్పారు.