ఎవరేమనుకుంటే నాకేం.. ఇదే జగన్ పర్కార్ తీరు
posted on Aug 6, 2022 8:18AM
నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్న ధోరణిలో వైసీసీ సర్కార్ వ్యవహరిస్తున్నది. పార్టీ నేతలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా కిమ్మనకుండా, ఆరోపణలకు గురైన వారిపై చర్యలు తీసుకోకుండా వైసీపీ సర్కార్ ప్రజలకు ఏం చెబుదామనుకుంటోంది. గోరంట్ల మాధవ్ వ్యవహారమే తీసుకుంటే.. ఆయన దిక్కుమాలిన చర్య వల్ల పార్టీ పరువే కాదు.. రాష్ట్రం పరువు, పార్లమెంటు పరువూ కూడా గంగలో కలిసిపోయింది. చర్యలు తీసుకుని కొంతలో కొంత నష్ట నివారణ చర్యలు చేపట్టాలన్న ఇంగితం కూడా వైసీపీలో కనిపించడం లేదు.
ఆయన న్యూడ్ కాల్ వ్యవహారం వెలుగులోనికి వచ్చిన రోజు మాత్రం కఠిన చర్యలు అంటూ మీడియా ముందుకు వచ్చిన మాట్లాడిన సజ్జల ఆ తరువాత నోరెత్తడం మానేశారు. పార్టీ అధినేత, సీఎం జగన్ సరేసరి, ఆయన తరఫున ప్రభుత్వ సలహాదారు సజ్జల జగన్ చాలా సీరియస్ ఉన్నారన్న ఓ మాట చెప్పేసి ఊరుకున్నారు. అంతే గోరంట్ల మాధవ్ విషయాన్ని ఆ పార్టీ నేతలెవరూ ప్రస్తావించడానికే ఇష్టపడటం లేదు. ఇది వ్యూహాత్మకమేననీ, జనం ఈ విషయాన్ని మర్చిపోయేవరకూ మిన్నకుండటమే మేలని పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకునేందుకు పార్టీ సిద్ధంగా లేదని ఈ వైఖరితో తేలిపోయింది.
ఆయన పార్లమెంటు సమావేశాలకు హాజరౌతున్నారు. పార్టీ పరంగా జరిగే సమావేశాలలోనూ పాల్గొంటున్నారు. అంత అసహ్యంగా వీడియోలో బుక్కైన గోరంట్ల మాధవ్ పై రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు చెందిన వారూ విమర్శలు గుప్పిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా వైసీపీ పట్టించుకోవడం లేదు. కనీసం పార్టీలో ఉన్న మహిళా నేతలకు కూడా మాట్లాడటం లేదు. ఇప్పుడు వైసీపీ దృష్టి అంతా మాధవ్ వ్యవహారం నుంచి ప్రజలు, మీడియా దృష్టిని మరల్చడమెలా అన్న దానిపైనే ఉందని పరిశీలకులు అంటున్నారు. గతంలో అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ లపై ఇటువంటి ఆరోపణలకు వచ్చినప్పుడు కూడా వైసీపీ ఇదే వ్యూహాన్ని అనుసరించిందని గుర్తు చేస్తున్నారు.
అంబటి, అవంతి విషయంలో అయినా ఇప్పుడు గోరంట్ల మాధవ్ విషయంలో అయినా ప్రజలు ఏదో అనుకుంటారని .. వైసీపీ హైకమాండ్ ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు హిందూపురం ఎంపీ విషయంలోనే వైసీపీ అదే పంధాను అనుసరిస్తున్నది. జనం ఏమనుకుంటారు, పార్టీ పరువు ఏమౌతుంది అన్న ఆలోచనే వైసీపీ దరికి చేరనీయదనీ, అధికారంలో ఉన్నాం కనుక ఏం చేసినా చెల్లిపోతుంది, ఎవరైనా నిలదీస్తే చేతిలో పోలీసులు ఉన్నారు.. కేసులు పెట్టి వేధించేయవచ్చన్నదే వైసీపీ ఆలోచనాధోరణిగా ఉందని అంటున్నారు. ఎమ్మెల్యేను ప్రశ్నించిన చిత్తూరు జిల్లా విద్యార్థిపై కేసు నమోదు చేయడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.