అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు.. జగన్ సర్కార్ దౌర్జన్యం!
posted on Dec 19, 2023 @ 2:17PM
తనను వ్యతిరేకిస్తే సహించలేని తత్వం జగన్ ది. వ్యతిరేకులపై హింసకు పాల్పడటం, కేసులు బనాయించడం, జైల్లోకి నెట్టి వేధించడం మాత్రమే ఏపీ సీఎం జగన్ కు తెలిసిన విద్య. జగన్ నాలుగున్నరేళ్ల పాలనలో ఇది పలు సందర్భాలలో నిరూపితమైంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి ఎందరో జగన్ సర్కార్ చిత్రహింసలకు గురయ్యారు. వేధింపులను ఎదుర్కొన్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు. ఇళ్లు కోల్పోయారు. అదంతా ఒకెత్తైతే.. చివరికి ప్రభుత్వంలో భాగమైన శాఖల ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించమని డిమాండ్ చేసినా దౌర్జన్యానికి పాల్పడటం మరోకెత్తు. అప్పుడెప్పుడో కరోనా సమయంలో మాస్కులు లేవు, పీపీఈ కిట్లు లేకుండా ఎలా వైద్యం చేయాలని ఓ దళిత వైద్యుడు ప్రశ్నిస్తే ఏమైందో తెలిసిందే కదా.
ఇప్పుడు అంగన్వాడీలపై కూడా జగన్ సర్కార్ అదే దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తుంది. తమ సమస్యలు పరిష్కారం డిమాండ్‌తో అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం (డిసెంబర్ 19) నాటికి ఈ సమ్మె ఎనిమిదో రోజుకు చేరింది. ప్రభుత్వం అంగన్‌వాడీలపై వివిధ రూపాల్లో ఒత్తిళ్లు చేస్తున్నప్పటికీ పట్టు విడవకుండా ఆందోళనను కొనసాగిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను మూసేసి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల ముందు టెంట్‌లు వేసుకుని ఆందోళన చేస్తూ సమ్మె కొనసాగిస్తున్నారు.
అయితే గత ఏడు రోజులుగా ప్రభుత్వం ఎన్నో విధాలుగా అంగన్వాడీలను తమ దారికి తెచ్చుకోవాలని చూసింది. విధుల నుండి తప్పిస్తామని హెచ్చరికలు, చర్యలు తీసుకుంటామని ఒత్తిళ్లు తెచ్చినా అంగన్వాడీ వెనక్కు తగ్గలేదు. దీంతో ప్రభుత్వం దౌర్జన్యానికి తెగబడింది. ముందుగా ఐసీడీఎస్ అధికారులు , చివాలయ సిబ్బందితో బలవంతంగా అంగన్‌వాడీ కేంద్రాలను తెరిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో మంగళవారం ఉదయం నుండే ఈ పని మొదలు పెట్టారు. ఎక్కడిక్కడ రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాల తాళాలను బద్దలు కొట్టి తెరిపిస్తున్నారు. అంగన్వాడీలలో స్టాక్ లెక్కలు తేల్చి.. పెండింగ్ స్టాక్ లబ్ది దారులకు సచివాలయ సిబ్బంది చేత పంపిణీ చేయిస్తున్నారు. అలాగే సచివాలయ సిబ్బంది మధ్యాహ్న భోజనాన్ని వండి పెట్టాలని ఆదేశిస్తున్నారు.
ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటికే పలు కేంద్రాలను ఇలా బలవంతం తెరవగా.. పలుచోట్ల స్థానికులు అడ్డుతగలడంతో అధికారులు వెనక్కు తగ్గాల్సి వచ్చింది. కాగా, పలు కేంద్రాలలో స్టాక్ లెక్కలు చూపించి అంగన్వాడీలపై చర్యలకు ఉపక్రమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. సమ్మెకు దిగడంతో అంగన్ వాడీలపై జగన్ సర్కార్ కక్షకట్టి దొంగ లెక్కలతో వారిపై చర్యలకు దిగేందుకు ఇలా తాళాలు బద్దలు కొట్టి కేంద్రాలను తెరిచినట్లు అంగన్వాడీలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వమే ఇలా ప్రభుత్వ భవనాల తాళాలు బద్దలు కొట్టడం చరిత్రలో ఇదే ప్రథమనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంగన్వాడీలతో చర్చలు జరిపి వారి సమస్యలను తీర్చేందుకు ప్రయత్నించాల్సిన ప్రభుత్వం ఇలా దౌర్జన్యాలకు దిగడం సిగ్గుచేటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీతాల పెంపు, ఫేస్‌యాప్ విధానం రద్దు, ఉద్యోగ భద్రత, పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలని, గ్రాట్యూటీ, పెన్షన్ అమలు చేయాలని అంగన్వాడీలు కోరుతున్నారు. నిజానికి ఇందులోవన్నీ జగన్ గతంలో ఇచ్చిన హామీలే. ఇప్పుడు వీరు ఆ హామీలను అమలు చేయాలని కోరుతున్నారు.
అయితే, ప్రభుత్వం మాత్రం హామీలను అమలు చేయకపోగా.. తిరిగి వారిపైనే దౌర్జన్యాలకు దిగుతున్నది. గత రెండేళ్లుగా అంగన్వాడీ ఆయాలను నియమించడం లేదు. అంతకుముందున్న వారు వ్యక్తిగత కారణాలతో, వృద్దులై కొంతమంది ఆయాలుగా మానేశారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కానీ, ఆయాల పని కూడా అంగన్వాడీలే చేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది. దీంతో చాలా చోట్ల మధ్యాహ్న భోజనం అటకెక్కింది. ఇప్పుడు అలాంటి ఆయాలే లేని కేంద్రాలలో సచివాలయ సిబ్బందే వండి పెడతారా అన్నది చూడాల్సి ఉంది. ఇక, ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా అంగన్వాడీలు హాజరవ్వాలని ఆదేశాలివ్వడం, జన సమీకరణకు వారికే టార్గెట్లు పెట్టడంతో వీరంతా విసిగిపోయారు. ఏది ఏమైన తమ డిమాండ్లు నెరవేర్చకపోతే పనిచేయలేమని తెగేసి చెప్తూ అంగన్ వాడీలు సమ్మెకు దిగారు. అయితే, ప్రభుత్వం మాత్రం డిమాండ్లను పరిష్కరించకుండా ఇలా తిరిగి వారిపైనే దౌర్జన్యాలకు దిగుతున్నది. ఇప్పుడు పలు విధాలుగా వారిని వేధించేందుకు కూడా ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. దీనిపై అంగన్వాడీలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.