పవన్ కల్యాణ్ పోటీ ఎక్కడ నుంచంటే?.. లోక్ సభకు నాగబాబు?
posted on Dec 19, 2023 @ 1:26PM
తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చేసిందా? పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలు ఎన్ని? ఏవి అన్నవిషయం కూడా నిర్ధారణ అయిపోయిందా? అంటే ఇరు పార్టీల నేతలూ ఔననే అంటున్నారు. అయితే ఆ వివరాల వెల్లడికి మాత్రం ఇంకా సమయం ఉందని చెబుతున్నాయి. తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీలో ఈ విషయంపైనే విస్తృత చర్చ జరిగిందంటున్నారు. జగన్ ముక్త ఏపీ లక్ష్యంగా ఇప్పటికే రెండు పార్టీలు సమన్వయ కమిటీలను కూడా నియమించుకొని సమష్టిగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. మార్చి మొదటి వారంలోనే ఎన్నికలు జరగనుండడంతో పొత్తులు, సీట్ల అంశంలో ఇంకెంత మాత్రం జాప్యం లేకుండా నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇరు పార్టీలు ఈ దిశగా చర్చలు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలపై చర్చ జరిగిందని చెబుతున్నాయి. అయితే జనసేన పోటీ చేసే స్థానాలేమిటి? ఎన్ని అన్న విషయంపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. అయితే పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలివే అంటూ అంటూ ఓ జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది ధృవీకరించిన జాబితా కాకపోయినప్పటికీ.. అంచనాలకు, వాస్తవాలకు దగ్గరగా ఉండటంతో తెగ వైరల్ అవుతోంది.
పొత్తులో భాగంగా జనసేన 24 స్థానాలలో పోటీ చేస్తుంది. సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల నేతల మధ్య ఇప్పటికే పలు ధఫాలు చర్చలు జరిగినట్లు తెలుస్తోండగా.. తాజాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలో జనసేన పోటీ చేసే సంఖ్యను ఖరారు చేసినట్లు చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ జాబితా ప్రకారం.. రాజమండ్రి రూరల్, కాకినాడ రూరల్, పిఠాపురం, పి.గన్నవరం, రాజోలు, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు లేదా ఏలూరు లేదా నిడదవోలు లేదా తణుకు, కొవ్వురు, పెడన, కైకలూరు, తెనాలి, గుంటూరు వెస్ట్, గిద్దలూరు, దర్శి, నెల్లూరు, తిరుపతి, మదనపల్లి, రాజంపేట, భీమిలి, గాజువాక, యలమంచిలి లేక పెందుర్తి, పాడేరు, రాజానగరం స్థానాలలో జనసేన పోటీ చేస్తుంది.
అలాగే రెండు లోక్ సభ స్థానాలలో కూడా జనసేన పోటీ చేస్తుంది. ఇక అన్నిటి కంటే ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేయనున్నారన్నది రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో ఎంతో ఆసక్తి రేకెత్తించే ప్రశ్న. ఇక సామాజిక మాధ్యమంలో కూడా ఈ విషయంపై ఆసక్తికర సమాచారం వైరల్ అవుతోంది. పవన్ భీమవరం, గాజువాకలలో ఏదో ఒక స్థానం నుండి పోటీ చేస్తారని ఒకవైపు ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు ఉత్తరాంధ్రలోని విశాఖ నార్త్ లేదా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురంలలో ఒక చోట నుంచీ పవన్ పోటీ చేసే అవకాశం ఉందని సోషల్ మీడియలో ప్రచారం అవుతోంది. పవన్ కళ్యాణ్ అనంతపురం నుండి పోటీ చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. పవన్ పోటీ చేస్తానంటే తాను తప్పుకుంటానని ఇప్పటికే ఇక్కడి నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రభాకర్ చౌదరి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో ఎక్కడ నుండి పోటీ చేయనున్నారన్నది ఆసక్తి రేపుతోంది. అలాగే ఒక లోక్ సభ స్థానం నుండి మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేయనున్నట్లు జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.
తెలుగుదేశం, జనసేన అభ్యర్థులతో కలిపి తొలి జాబితా అభర్ధులను ప్రకటించే అవకాశం ఉండగా తొలి జాబితాలో టీడీపీ స్థానాలను ఫైనల్ చేసినట్లు తెలుస్తున్నది. తెలుగుదేశం తొలి జాబితాలో 76 మంది పేర్లు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో ని 13 ఉమ్మడి జిల్లాల నుంచి జిల్లాకు అయిదారుగురు వంతున ఈ తొలి జాబితాలో చోటు దక్కనుందని అంటున్నారు. పందొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉండగా.. ఎలాంటి గ్రూపు తగాదాలు లేకుండా, బలంగా ఉంటూ ప్రజలతో మమేకం అవుతున్న అభ్యర్థులను కూడా ఈ జాబితాలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. మరోవైపు జనసేన కూడా బలమైన అభ్యర్థులతో ఒకటీ రెండు రోజులలోనే అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం చేయనున్నట్లు తెలుస్తున్నది. ఒక్కసారి అభ్యర్థుల జాబితా విడుదలైతే.. వైసీపీ టార్గెట్ గా తెలుగుదేశం, జనసేన కూటమి వేగం పెంచేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.