బీజేపీఎల్పీ లీడర్ గా రాజాసింగ్, కాటిపెల్లికి నో!
posted on Dec 19, 2023 @ 2:48PM
తెలంగాణలో బీజేపీ గ్యారంటీగా గెలుస్తుందని భావించే స్థానం, గెలిచే సత్తా ఎవరికైనా ఉందంటే అది ఒక్క రాజాసింగ్ కు మాత్రమే ఉంది. రాజా సింగ్ గోషామహల్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలం గుండె నిండా ఉన్న వ్యక్తి. అటువంటి రాజాసింగ్ ను బీజేపీ దూరం పెట్టడానికి ప్రయత్నించింది. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్ ను నిరవధికంగా కొనసాగించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు.. కేవలం ఆయన వినా అక్కడ వేరెవరూ గెలిచే అవకాశం లేదని తన అవసరం కోసం బీజేపీ రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసింది.
అనుకున్నట్లుగానే రాజాసింగ్ గోషామహన్ నుంచి విజయం సాధించి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. ప్రస్తుతం బీజేపీ తరఫున ఎన్నికైన ఎనిమిది మంది ఎమ్మెల్యేలలోనూ సీనియర్ అని ఎవరినైనా చెప్పాలంటే అది రాజాసింగ్ మాత్రమే. అటువంటి రాజాసింగ్ ను బీజేపీ కనీసం బీజేఎల్పీ నేతగా కూడా పరిశీలనకు తీసుకోవడం లేదు. భాషపై పట్టు లేదంటూ పక్కన పెట్టేస్తున్నది. బీజేఎల్పీ నేతగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని దాదాపు ఖరారు చేసినట్లు బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. పోనీ కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించి గెలిచిన కాటిపెల్లి రమణారెడ్డికి ఎల్పీ నేతగా రేసులోకి వచ్చినా తొలి సారి ఎమ్మెల్యే అన్న నెపంతో బీజేఎల్పీ నేతగా పరిశీలనలోకే తీసుకోలేదని చెబుతున్నారు.
తొలి సారి ఎమ్మెల్యేను రాజస్థాన్ సీఎం చేసిన బీజేపీయే, తెలంగాణకు వచ్చే సరికి ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేయే అయినా జెయింట్ కిల్లర్ అయిన కాటిపెల్లి రమణారెడ్డిని అదే సాకుతో పక్కన పెట్టేయడమేమిటని పార్టీ వర్గాల్లోనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మొత్తం మీద బీజేఎల్పీ నేతగా నిర్మల్ ఎమ్మెల్యేను ఇప్పటికే ఖరారు చేశారనీ, ఈ నెల 24న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్న నేపథ్యంలో ఆయన సమక్షంలో ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.