అమరావతి వినాశనానికి జగన్ మరో ఎత్తు?!
posted on Jul 21, 2023 @ 3:41PM
ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతిని చంద్రబాబు తరతరాలకు సంపద సృష్టించే వరల్డ్ క్లాస్ సిటీగా నిర్మించాలనుకుని ఇప్పటికే అక్కడ అందుకు అవసరమైన ప్రాధమిక సౌకర్యాల కల్పన కూడా చేశారు. ముందుగా తాత్కాలిక భవనాలను ఏర్పాటు చేసి అక్కడ నుండే పరిపాలనా సాగిస్తూ శాశ్వత భవనాల నిర్మాణాన్ని కూడా మొదలు పెట్టారు. శాశ్వత భవనాలు కూడా కొన్ని యాభై శాతం పైన నిర్మాణం జరగగా.. మరికొన్ని ప్రాధమిక దశలో ఉన్నాయి. అయితే, ఇప్పుడున్న జగన్ సర్కార్ ఆ భవనాలను ఎక్కడివక్కడ వదిలేసి రాజధాని నిర్మాణంపై చేతులెత్తేసింది. అంతేకాదు ఇప్పుడు అక్కడ పరిపాలనా భవనాలను కాకుండా నివాస గృహాలను నిర్మించాలని, అది కూడా రాజధానేతర ఇళ్లను నిర్మించాలని భావిస్తున్నది.
ఇప్పటికే ఆర్ 5 జోన్ లో ఈ ఇళ్లకు స్థలాల పట్టాలు ఇస్తూ జీవో కూడా జారీ చేసింది. అయితే, ప్రస్తుతం ఈ అనుమతుల వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉండగా ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకూ వెళ్ళింది. జగన్ ప్రభుత్వం ఇచ్చే పట్టాలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని.. తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రత్యేక ప్రయోజనాలు కోర్టు హక్కు లబ్థిదారులకు ఉండదని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కోర్టు పరిధిలో ఉన్న ఈ గృహాల నిర్మాణ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కేంద్రాన్ని అనుమతి కోరగా.. కేంద్రం కూడా రాష్ట్రం అడిగిన వెంటనే అనుమతులు ఇచ్చేసింది.
ఆర్ 5 జోన్ లో కట్టాలని భావిస్తున్న 47 వేల ఇళ్లకు కేంద్రంలోని సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ భేటీలో అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొదటి విడతలో ఇళ్ళు నిర్మించేందుకు రూ. 710 కోట్లను మంజూరు చేస్తున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, చివరి నిముషంలో రాజధాని ప్రాంతంలో కొందరు మరోసారి కోర్టును ఆశ్రయించారు. దాంతో కోర్టు అందరికీ నోటీసులు జారీచేసి.. ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయటం కోసమే సుప్రింకోర్టు అనుమతిచ్చిందా లేకపోతే ఇళ్ళు నిర్మించుకోవచ్చని కూడా చెప్పిందా అన్నది తేలుస్తామని హైకోర్టు చెప్పింది. దాంతో కేంద్రం మంజూరుచేసిన ఇళ్ళ నిర్మాణాల ప్రక్రియ ఆగిపోయింది.
అయితే, ఏది ఏమైనా రాజధాని అమరావతిలో గృహ నిర్మాణాలు చేపట్టి దానిని రాజధానికి అడ్డంకిగా చెప్పాలని పట్టుదలతో ఉన్న సీఎం జగన్.. ఇప్పుడు దాని కోసం మరో ఎత్తు వేసినట్లు తెలుస్తున్నది. ఒకవైపు కోర్టులు ఇళ్ల నిర్మాణం వద్దని వారిస్తున్నా.. వచ్చే ఎన్నికల్లోపు 50 వేల ఇళ్ళని అక్కడ నిర్మించేయాలన్నది జగన్ పట్దుదల. అందుకే ఇప్పుడు ఇళ్ల నిర్మాణాలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలుస్తున్నది. ఇందులో భాగంగా ముందు మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సీఆర్డీయే రు. 72 కోట్లతో పనులు మొదలుపెట్టింది. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులైన నైబర్ హూడ్ స్కూల్స్, ఈ హెల్త్ సెంటర్లు, అంగన్ వాడీ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుతో పాటు మొక్కలు నాటే పనులు, కాలనీలుగా విభజించి రోడ్లు, కాల్వలు, వీధి దీపాల కోసం స్తంభాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం ఈనెల 24న భూమి పూజ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
కానీ, ఒకవైపు కోర్టులో కేసు నడుస్తుండగానే మరోవైపు ప్రభుత్వం మొండిగా ఈ తరహా ఏర్పాట్లను చేయడం అర్ధంకాని అంశం. రేపు కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రభుత్వం ఏమిచేస్తుందన్నది ఆసక్తిగా మారింది. పరిపాలన, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల కోసం అభివృద్ధి పేరిట రైతుల వద్ద తీసుకున్న భూములలో ఇలా ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి వీలు లేదని కోర్టు తీర్పు వస్తే.. ఇప్పుడు ఈ మౌలిక సదుపాయాల కోసం వెచ్చించిన నిధులన్నీ బూడిద పాలే అవుతాయి. అయితే, రేపు కోర్టు తీర్పు ఎలా ఉన్నా ఎన్నికలకు ముందు రాజధానిలో యాభై వేల ఇళ్లకు శంకుస్థాపన చేసి అమరావతి నడిబొడ్డున పేదల ఇల్లు నిర్మించాలనన్నది జగన్ ప్రణాళికగా కనిపిస్తుంది. మరి ఈ మొండి వైఖరి వలన ఎవరికి లాభమో ఆ జగన్ మోహన్ రెడ్డికే తెలియాల్సి ఉంది.