విశ్వ నగరం గోడు వినే వారేరీ?
posted on Jul 21, 2023 @ 4:18PM
వానొస్తే అందరికీ ఆనందమే కొంచెం ఎక్కువగా వాన కురిస్తే కొంత అసౌకర్యం అయినా ఓకే, కానీ హైదరాబాద్ నగరవాసులకు వానంటే భయం. కొద్ది పాటి భారీ వర్షం అంటే వణుకు. అదే అతి భారీ వర్షం అంటే పై ప్రాణాలు పైనే పోతాయి. కోడి తన పిల్లలను రెక్కల చాటున దాచినట్లుగా పెద్దలు పిల్లలను ఇంటి నుంచి కదల నివ్వరు. ఆఫీసులకు వెళ్లే వారు , పనులపై వెళ్లే వారు , ప్రయాణాలు చేసే వాళ్లు తమ పనులు వాయిదా వేసుకుంటారు. ఇది విశ్వనగర జీవికి అలవాటైం పోయింది. లేకపోతే ఏ హోర్డింగో పైన పడుతుంది. లేదా తవ్వి వదిలేసిన కాలువలు మింగేస్తాయి. ఇక మూతలు లేని మ్యాన్ హోల్స్ ఎటూ ఉండనే ఉన్నాయి. అప్పుడెప్పుడో 115 యేళ్ల క్రింద మూసీ పొంగి వేల మంది చనిపోయారు. అడపాదడపా అలాంటివి వరదలు హైదరాబాద్ ను పలకరిస్తూనే ఉన్నాయి. 1908 వరదల అనుభవంతో నిజాం ప్రభుత్వం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లను నిర్మించి నగరానికి ముప్పును నివారించింది. 1908లో దాదాపు 15 వేల మందిని పొట్టన పెట్టుకున్న మూసీ భారీ వరద చరిత్రలో నిలబడిపోయింది. 2000 సంవత్సరంలో వచ్చిన భారీ వర్షాలు వందమంది ప్రాణాలు బలిగొంది. 30 వేలకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అప్పుడు జియోలాజికల్ సర్వే ఆప్ ఇండియా చేసిన ప్రతి పాదనలు కార్యరూపం దాల్చలేదు. దీని ఫలితంగా 2016,2020 లలో హైదరాబాద్ భారీ వరదలను ఎదుర్కోవల్సి వచ్చింది.
తాజాగా కురిసిన భారీ వర్షాలు వరదలను సృష్టించకపోయినా నగర జీవితాలను అతలాకుతలం చేసిందనే చెప్పాలి. ఇందుకు కారణాలు అన్వేషిస్తే జీహెచ్ఎంసీ చేస్తున్న ప్రణాళికల్లేని కార్యక్రమాలు, సహజ నీటి మార్గాల మూసివేత, రియల్ ఎస్టేట్ వ్యాపారుల అత్యాశ, వీటికి తోడు నగర వాసుల బాధ్యతా రాహిత్యం కూడా కారణాలుగా కనిపిస్తాయి. దీనికి కష్ట సమయాలలో చేతులెత్తేసే నగర పోలీస్ విభాగం తోడవుతుంది.
వందేళ్లకు ముందే నగరాన్ని రక్షించడానికి నిజాంలు రిజర్వాయర్లు కట్టారు. 1996లో చంద్ర బాబు 111 జీవోను తెచ్చి రిజర్వాయర్లను తద్వారా హైదరాబాద్ నగరాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. తరువాతి ప్రభుత్వాలు జీవో నెంబర్ 111 అమలులో ఉన్న 84 గ్రామాల్లో పెద్ద ఎత్తున నిర్మాణాలకు అనుమతి నిచ్చి నగరాన్ని వరదల నగరంగా మార్చారు. ప్రస్తుత పరిణామాలకు గతంలో చేసిన తప్పులే కారణమని చెప్పక తప్పదు.
అయితే విశ్వ నగరాన్ని ప్రజల నగరంగా మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. వర్షాలు రానప్పుడు కూడా నగర జీవితం నరకమే అనేది నిత్య సత్యం.
విశ్వ నగరం అని చెప్పుకుంటున్న హైదరాబాద్ లో 70శాతం రోడ్లు అన్యాక్రాంతమై ఉంటాయి. 100 అడుగుల రోడ్డు ఉన్నా ప్రజలు 30 అడుగులలోనే రాకపోకలు సాగించాల్సిన దుస్థితి ఉంటుంది. పబ్లిక్ రోడ్డును పార్కింగ్ స్థలాలుగా వాడుకుంటున్న వాణిజ్య సముదాయాలు , రోడ్డుపై అనుమతులు లేకుండా వెలుస్తున్న తిను బండారాల దుకాణాలు నగర జీవికి నరకమే చూపిస్తున్నాయి. చలానాలు వేయడానికి లేదా వసూలు చేయడానికి ఆసక్తి చూపించే నగర పోలీసు విభాగం ట్రాఫిక్ జాంలపై దృష్టి సారించలేవు. నగరాన్ని వరదలు పదేళ్లకోసారి ముంచెత్తుతుంటే ట్రాఫిక్ సమస్య ప్రతి రోజూ ఆ పని చేస్తూనే ఉంది.