రాష్ట్ర విభజనతో రాష్ట్రంలో కాంగ్రెస్ దుఖాణం బంద్ కాబోతోందా

 

కాంగ్రెస్ పార్టీ పేరుకి జాతీయ పార్టీ అయినా క్రమంగా ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి కుచించుకుపోతోంది. కారణం ఆ పార్టీ వేస్తున్నతప్పటడుగులే తప్ప ప్రతిపక్షాలు బలంగా ఉండటం వలన మాత్రం కాదు. రాష్ట్ర విభజనపై చాలా లోతుగా అధ్యయనం చేసిన తరువాతనే చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెపుతున్నపటికీ రాష్ట్రంలో జరుగుతున్నపరిణామాలు మాత్రం ఆ పార్టీ ఏమాత్రం ముందు చూపు లేకుండా నిర్ణయం తీసుకొందని స్పష్టం చేస్తున్నాయి. విభజన నిర్ణయాన్ని అమలు చేయడంలో జరుగుతున్నజాప్యం వలన తెలంగాణాలో, విభజన చేస్తున్న కారణంగా సీమాంద్రాలో పార్టీ నష్టపోబోతోందని రెండు ప్రాంతాల నేతలు కాంగ్రెస్ అధిష్టానాన్ని పదేపదే హెచ్చరిస్తున్నారు.

 

ఈ పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకొన్నా మొదట నష్టబోయేది కాంగ్రెస్ పార్టీయే తప్ప అది ఊహించినట్లు ప్రాంతీయ పార్టీలు కావు. ఈ సంగతి కాంగ్రెస్ పార్టీకి తెలియకపోలేదు. అందుకే తెరాస, వైకాపాలను కాంగ్రెస్ లో విలీనం లేదా పొత్తుల కోసం అంత ఆరాటపడుతోంది. కానీ గత కొంత కాలంగా మళ్ళీ తెలంగాణాలో ఉద్యమ సెగలు రాజుకోవడం చూసిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో కనీసం పొత్తులకి కూడా ఇష్టపడటం లేదు. అంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో ఒంటరి పోరు చేయక తప్పదన్నమాట.

 

ఇక, విభజన ప్రకటన తరువాత సీమాంద్రాలో అకస్మాత్తుగా మారిన పరిస్థితులు చూసిన కాంగ్రెస్ అధిష్టానం చాలా కలవరపడుతోంది. కానీ పైకి మాత్రం తన సహజ సిద్దమయిన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఎన్నికలలో పోటీ చేయడం మాట అటుంచి కాంగ్రెస్ తరపున కనీసం నామినేషన్లు వేయడానికి కూడా చాలా సాహసం ఉండాలని అక్కడి కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ సంకట స్థితి నుండి బయటపడేందుకే కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డిని బయటకు తీసుకు వచ్చిరంగంలో దింపిందిప్పుడు.

 

అయితే ఇంతకాలంగా అతనిని జైలులో నిర్భందించి, ఇప్పుడు తనకు అవసరం పడింది గనుక బయటకు తెచ్చినంత మాత్రాన్నఅతను కాంగ్రెస్ పార్టీని క్షమించేయలేడు. మొదటి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి, సోనియా గాంధీ ముందు చేతులు కట్టుకొని నిలబడి ఆమె కనుసన్నలలో పని చేస్తూ ఆ పార్టీతో అధికారం పంచుకొంటాడని అంతకంటే నమ్మకం లేదు. అందువలన కాంగ్రెస్ పార్టీతో విలీనం కాదు కదా కనీసం పొత్తులకి కూడా అతను ఇష్టపడకపోవచ్చును. అప్పుడు సీమాంద్రాలో కూడా కాంగ్రెస్ ఒంటరిగా మిగిలిపోవచ్చును.

 

రాష్ట్ర విభజనతో తెరాసను,తెదేపాలను దెబ్బతీద్దామనుకొన్నకాంగ్రెస్ తన అసమర్ధ, అనాలోచిత నిర్ణయాలతో ఆ రెండు పార్టీలకే మేలు చేయడమే కాకుండా,ఇప్పుడు రాష్ట్రం నుండి జెండా పీకేసుకొనే పరిస్థితి స్వయంగా కల్పించుకొంది. మళ్ళీ ఉద్యమ సెగలు రాజుకొంటున్న నేపధ్యంలో తెలంగాణాలో తెరాస బలపడితే, రాష్ట్ర విభజన చేస్తున్నకాంగ్రెస్ పార్టీతో వైకాపాకున్నఅనైతిక సంబంధాల కారణంగా ప్రజలు తెదేపా వైపుమొగ్గు చూపే అవకాశాలున్నాయి.

 

అందువలన రానున్న ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ మరి కొంత కుచించుకుపోయి తెలంగాణాలో తెరాసకు తోకపార్టీగా, సీమంద్రాలో ఎవరయినా నేతలు గెలిస్తే ప్రతిపక్ష పార్టీగా మిగిలిపోవచ్చును. ఈ దుస్థితి చేజేతులా సృష్టించుకొన్నదే గనుక ఇక కాంగ్రెస్ ఎవరినీ నిందించవలసిన పనిలేదు కూడా.