అన్నతో యుద్ధం.. మూడు శక్తులతో షర్మిల సిద్ధం!
posted on Jan 5, 2024 @ 1:51PM
వైఎస్ఆర్ తనయ, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల అన్నతో యుద్ధానికి రెడీ అయిపోయారు. అందు కోసం తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. త్వరలోనే షర్మిలకు ఆంధ్రప్రదేశ్ పార్టీ పగ్గాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. షర్మిలకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే తాను సంతోషంగా తప్పుకుంటానని ఇప్పటికే ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు స్వచ్ఛందంగా ప్రకటించేశారు. దీంతో ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేతికి వెళ్లడమే తరువాయిగా పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు షర్మిల ఇప్పటికే ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన కాంగ్రెస్ మాజీ నేత ఒకరితో ఆమె సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న వైసీపీ నేతలను తిరిగి తమ పార్టీలోకి చేర్చుకోవడమే టార్గెట్ గా షర్మిల ఏపీలో తొలి అడుగులు పడుతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అయితే, షర్మిలకు ఇంత ధైర్యం ఏమిటి? జగన్ లాంటి జగమొండిని ఢీ కొట్టేందుకు ఎలా సిద్దపడుతున్నారు? అసలు అన్నతోనే యుద్ధం చేసేందుకు షర్మిల ఎందుకు సిద్ధపడ్డారు. అలా సిద్ధపడటానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఎవరి అండ, బలం చూసుకొని అన్నను ఢీ కొట్టేందుకు షర్మిల సిద్ధమయ్యారు? తనకు అడ్డొస్తే ఎవరినీ ఉపేక్షించని మనస్తత్వం జగన్ మోహన్ రెడ్డిది అని చెప్తుంటారు. సొంత వారైనా తనకు ఎదురొస్తే అడ్డు తొలగించుకొనేంత క్రూరత్వం జగన్ మోహన్ రెడ్డిలో చూశామని గతంలో వైఎస్ ఫ్యామిలీతో అనుబంధం ఉన్న నేతలు చెప్పే మాట. మరి అలాంటి జగన్ మోహన్ రెడ్డితో షర్మిల కయ్యానికి దిగడం అంటే ఆషామాషీ విషయం కాదు. అన్నీ తెలిసిన షర్మిలలో ఇంత తెగింపు ఎలా వచ్చింది? అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో హాట్ హాట్ చర్చగా నడుస్తోంది. ముఖ్యంగా షర్మిల ఇంత ధైర్యంగా అన్న జగన్ ను రాజకీయంగా అటాక్ చేసేందుకు రంగంలోకి దిగడం సంచలనంగా మారుతున్నది. ఈ అన్నా చెల్లెళ్ళ పొలిటికల్ సినిమా భవిష్యత్తులో ఎలా ఉండనుందోనన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తం అవుతోంది.
అయితే, షర్మిల ఇంత ధైర్యంగా అన్నతో యుద్దానికి దిగడం వెనక మూడు శక్తులు బలంగా పనిచేశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి షర్మిల అవసరం ఉంది. అలాగే అన్నను ఢీ కొట్టేందుకు షర్మిలకు కాంగ్రెస్ పార్టీ అండ కావాలి. ఈ క్రమంలోనే షర్మిలకు సహకరిస్తే ఎంతో కొంత కాంగ్రెస్ అనుకున్న కార్యం నెరవేరుతుంది. అందుకే కాంగ్రెస్ షర్మిలకు సంపూర్ణంగా అండగా ఉండేందుకు కాంగ్రెస్ ముందుకు వచ్చింది. అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ద్వారా షర్మిలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కాంగ్రెస్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ తర్వాత షర్మిల ధైర్యం తల్లి విజయమ్మ, భర్త అనిల్ కుమార్. తల్లి విజయమ్మ తనతో ఉంటే వైఎస్ కుటుంబం మొత్తం షర్మిలతో ఉన్నట్లే. జగన్ ఎంత సీఎం అయినా విజయమ్మ మాటకే మొత్తం కుటుంబంలో విలువ ఉంటుంది. తల్లి మాటను లెక్క చేయకనే జగన్ పరిస్థితి ఇలా మారింది. షర్మిల భవిష్యత్తు కోసం విజయమ్మ ఏం చేసేందుకైనా సిద్దమేనని తాజాగా ఆమె షర్మిలతో జగన్ ఇంటికి వెళ్లిన సీన్ తేల్చేసింది.
ఇక షర్మిలకు మరో అండ భర్త అనిల్ కుమార్. అనిల్ కుమార్ క్రైస్తవ మత బోధకుడిగా ఉన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో ఆయన కూడా కీలక పాత్ర పోషించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలను ఏకతాటిపైకి తీసుకురావడం, క్రిస్టియన్లను వైసీపీ వైపు మళ్లేలా ప్రభావితం చేయడం వంటి బాధ్యతలను అనిల్ చూసుకున్నారు. అయితే ఇప్పుడు వైఎస్ షర్మిల కోసం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా క్రిస్టియన్లను మలుపు తిప్పేందుకు అనిల్ రంగంలోకి దిగే అవకాశం ఉంది. పైగా అనిల్ కు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియన్ కమ్యూనిటీలతో సంబంధాలు ఉన్నాయి. తద్వారా కూడా ఆర్ధికంగా కాంగ్రెస్ పార్టీకి వనరులను ఆయన సమకూర్చే వీలుంది. అలాగే షర్మిల కోరితే సీఎం జగన్, ఎంపీ అవినాష్ తప్ప మిగతా వైఎస్ కుటుంబం మొత్తం అండగా ఉంటారు. ఇప్పటికే కుటుంబంలో జగన్ పట్ల తీవ్ర అసంతృప్తి ఉన్న నేపథ్యంలో అదంతా ఇప్పుడు షర్మిలకు పాజిటివ్ గా మారనుంది. ఇన్ని అవకాశాలు ఉండడంతో నే షర్మిల ధైర్యం చేసి అన్నకు బాణం ఎక్కుపెడుతున్నారు. పైగా జగన్ ఎంత మొండి వాడో షర్మిల కూడా అంతే మొండి అని సన్నిహితులు చెప్తారు. ఏదైనా తలచుకుంటే అది అయ్యే వరకూ వదిలే ప్రసక్తిలేని మనస్తత్వం షర్మిల సొంతమని చెబుతారు. అందుకే తన నుంచి రాజకీయంగా ఎంతో లబ్ధి పొంది.. ఆ తరువాత తనను కూరలో కరివేపాకులా తీసిపారేసిన అన్నకు తగిన గుణపాఠం చెప్పాలి, అంతకు అంత బదులు తీర్చుకోవాలన్న లక్ష్యంతోనే జగన్ కు వ్యతిరేకంగా ఏపీలో షర్మిల రాజకీయ ప్రయాణం మొదలు పెట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.