దినదిన ప్రవర్ధమానంగా దిగజారుతున్న జగన్ గ్రాఫ్
posted on Sep 22, 2022 @ 12:03PM
రాజకీయాలు మారిపోయాయి. రంగు రుచి వాసన మార్చుకున్నాయి. ఇపుడు సర్వం సర్వేలే, అన్న విధంగా అన్ని పార్టీలు, సర్వేల మీదనే ఆధార పడుతున్నాయి. సర్వే ఏది చెపితే అదే వేదం. అదే మంత్రం అన్నట్లుగా రాజకీయ పార్టీలు, నాయకులు వ్యవహరిస్తున్నారు. ఒక విధంగా కళ్ళకు గంతలు కట్టుకుని, ముందుకు సాగుతున్నాయి, సాగుతున్నారు. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే సర్వేలే సర్వస్వంగా రాజకీయ ‘వ్యూహ’ రచన చేస్తున్నారు. ఎన్నికలకు ఎప్పుడు వెళ్ళాలి, ఎవరికి టికెట్ ఇవ్వాలి మొదలు ప్రభుత్వం వేసే ప్రతి అడుగుకూ సర్వేలే ఆధారం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
అయితే, ఇప్పడు ఏపీలో ఆ సర్వేలే అధికార వైసేపీలో చిచ్చు తెచ్చాయని, అంటున్నారు. సర్వేకి అటు సర్వేకి ఇటు అన్నట్లుగా పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రికి పార్టీకి ,పార్టీకి ప్రజాప్రతినిదులకు,ప్రజా ప్రతినిధులకు, పార్టీ క్యాడర్ కు మధ్య సర్వేలు అడ్డు గోడలు కడుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా నియోజక వర్గాల స్థాయిలో సర్వేలు సమస్యలు సృష్టిస్తున్నాయని అంటున్నారు.
రాష్ట్రంలో వైసీపీ ‘సుందర’ పాలన మొదలై మూడేళ్ళు నిండిన సందర్బంగా, గడప గడపకు ప్రభుత్వం పేరిట అన్ని గ్రామాలకు వెళ్లి ప్రతి ఇంటి తలుపు తట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. అయితే, ప్రజలలోకి వెళ్ళే దైర్యం లేకనో ఏమో, చాలా వరకు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఆదేశాలను పక్కన పెట్టేశారు. అంత సీరియస్ గా తీసుకోలేదు. అయితే, అదే గెలుపు మంత్రంగా తీసుకున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, గడపగడపకు కార్యక్రమంపై కూడా సర్వే. కాదు ఏకంగా మూడు సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకున్నారు. ఇప్పుడా సర్వే నివేదికలు ముందు పెట్టుకుని ముఖ్యమంత్రి తన దగ్గర రెండు సర్వేలు ఉన్నాయని, ఎవరి పర్‌ఫామెన్స్ ఏంటో ఈ నివేదికల్లో ఉందని, ఎమ్మెల్యేలకు హెచ్చరికలు చేస్తునట్లు తెలుస్తోంది. నిజానికి సర్వే నివేదికల్లో ఏముందో ఏమో, కానీ, కొంతమంది ఎమ్మెల్యేలను, నియోజక వర్గంలో అప్పుడే మాజీలుగా చూస్తున్నారని అంటున్నారు.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దగ్గర ఉన్నాయని చెపుతున్న మూడు సర్వే రిపోర్టులో ఒకటి, ఐప్యాక్ (పీకే) బృందం ఇచ్చింది. మరొకటి క్రాస్ చెక్ చేసుకునేందుకు మరో ఏజెన్సీ ద్వారా చేయించారు. అలాగే మరో సర్వే సర్కార్ వారి నిఘా వర్గాలు నిర్వహించిన సీక్రెట్ సర్వే. అయితే, చిత్రంగా, సర్వేలు, సర్వే చేసిన సంస్థలు వేరైనా సత్యం ఒకటే, అన్నట్లుగా, అన్నీ కూడా జగన్ ప్రభుత్వ గ్రాఫ్ దినదిన ప్రవర్థమానంగా దిగజారిపోతోందన్న ఒకే ఒక నిజాన్ని బయట పెట్టాయి.
“అయ్యా .. ముఖ్యమంత్రిగారు. ప్రభుత్వ గ్రాఫ్ రోజు రోజుకు దిగజారుతోంది. ఎమ్మెల్యేల గ్రాఫ్ మాత్రమే కాదు. మీ గ్రాఫ్ కూడా పతనం వైపు పరుగులు తీస్తోంది.. తస్మాత్ జాగ్రత్త” అని అన్ని సర్వేలూ ఒకే ఒక్క వాస్తవాన్ని వెల్లడించాయని పార్టీ శ్రేణులే అంటున్నాయి. అలాగే, ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా, అన్ని వర్గాలలోనూ ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోందనీ, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరిలోనూ ఏ అసంతృప్తి రగులుతోందని, మూడు సర్వేలన్నీ తేల్చి చెప్పాయని అంటున్నాయి. ఇసుక, మద్యం, అధ్వాన రహదారులు, కాంట్రాక్టర్‌లకు బిల్లులు ఇవ్వకపోవడంతో కిందిస్థాయి వరకూ వ్యతిరేకత ఉందని సర్వేలు వెల్లడించాయి.
ఎమ్మెల్యేల పని తీరుపైనా సర్వేలన్నీ ఒకే రకంగా ఉన్నాయి. దాదాపుగా 60 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం ఆశాజనకంగా లేదని, సంక్షేమ కార్యక్రమాల అమల్లో వారి పాత్ర లేకపోవడం, అభివృద్ది కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోవడం కూడా వైసీపీకి మైనస్‌గా మారిందని చెప్పాయి. ఎమ్మెల్యేలే కాదు మంత్రుల పనితీరు విషయంలోనూ ప్రజాలు పెదవి విరుస్తున్నారు. అయినా, ఏకంగా ముఖ్యమంత్రి పనితీరే బాగాలేదని, మీటలు నొక్కడమే పరిపాలన అనుకుంటే ఎలా అని ప్రజలు నేరుగా ప్రశ్నిస్తున్నప్పుడు, ఒకరి తీరు బాగుంది, ఒకరి తీరు బాగాలేదని అనుకోవడం ఎందుకు, యథా జగన్ తథా పార్టీ.