కేసీఆర్ బీఆర్ఎస్ విషయంలో పునరాలోచనలో పడ్డారా?
posted on Oct 17, 2022 @ 11:59AM
ఓడిశా సీఎం నవీన్ పట్నాయక్ హైదరాబాద్ లో ఉన్నారు. సోమవారం (అక్టోబర్17న) హైదరాబాద్ వేదికగా ఒడిశా పెట్టుబడుల సదస్సు జరుగుతోంది. ఆ సదస్సులో పాల్గొనేందుకు నవీన్ పట్నాయక్ ఆదివారమే హైదరాబాద్ వచ్చారు. ఆయనకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్వాగతం పలికారు. అంతే అంతకు మినహా రాష్ట్ర ప్రభుత్వం కానీ, అధికార తెరాస కానీ ఆయనను ఇసుమంతైనా పట్టించుకోలేదు. గతంలో తన జాతీయ రాజకీయ ప్రస్థానం కోసం మద్దతు కోరేందుకు కేసీఆర్ ఒడిశా వెళ్లి మరీ నవీన్ పట్నాయక్ ను కలిశారు.
అప్పుడు నవీన్ పట్నాయక్ స్వయంగా కేసీఆర్ కు స్వాగతం పలికారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి వస్తే ఎటువంటి మర్యాదలు చేయాలో అన్నీ చేశారు. అయితే ఇప్పుడు మాత్రం తెలంగాణలో నవీన్ పట్నాయక్ కు అటువంటి స్వాగత సత్కారాలు లభించలేదు. కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఢిల్లీలో చేస్తున్నది ఏమిటన్నది ఎవరికీ తెలియని ఒక రహస్యోదమ్యంగా సాగుతోంది. ఆయన ఢిల్లీ పర్యటన విశేషాలు మీడియాలో కానీ, సామాజిక మాధ్యమంలో కానీ ఎక్కడా కనిపించడం లేదు. అసలు ఆయన ఢిల్లీలో ఏం చేస్తున్నారన్నది పార్టీ ముఖ్యులకైనా తెలుసా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గత ఆరు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్ బీఆర్ఎస్ కోసం నిర్వహించిన సమావేశాలు కానీ, సదస్సులు కానీ ఏమీ లేవు. మీడియా ముందకు అసలే రాలేదు. ఒక జాతీయ పార్టీని పెట్టిన తరువాత తొలి సారిగా దేశ రాజధానిలో అడుగుపెట్టిన ఆయన తన జాతీయ రాజకీయ అజెండాను ఆవిష్కరిస్తారని అంతా భావించారు.
ఏదో మొదట ఓ రెండు రోజులు బీఆర్ఎస్ కార్యాలయం, తెలంగాణ భవన్ నిర్మాణాలను పరిశీలిస్తూ మీడియాలో కనిపించారు. అంతే ఆ తరువాత ఆయన హస్తినలో ఏం చేస్తున్నారు? ఎంత కాలం ఉంటారు అన్న దానిపై పార్టీ నుంచి కానీ, ఆయన నుంచి కానీ ఎటువంటి సమాచారం లేదు. ఇక నవీన్ పట్నాయక్ హైదరాబాద్ పర్యటన వద్దకు వస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు సీఎం హోదాలో కేసీఆర్ స్వాగతం పలకడం విధాయకం. నిజంగా అత్యవసర పనుల నిమిత్తం ఆయన హస్తినలో ఉంటే.. అనుకోవచ్చు. అసలు అధికారిక కార్యక్రమాలంటూ ఏమీ లేకుండా వెళ్లి హస్తినలో కూర్చున్న కేసీఆర్ మర్యాద పూర్వకంగా ఒక ఆహ్వాన ప్రకటన కూడా జారీ చేయకుండా పట్నాయక్ పర్యటన విషయాన్ని పూర్తిగా విస్మరించడమేమిటని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. తనకు అవసరమైనప్పుడు పని గట్టుకుని వెళ్లి మరీ మంతనాలు జరిపి వచ్చారు. ఇప్పుడు అసలు పట్టించుకోవడం లేదు.. దీని వెనుక నవీన్ పట్నాయక్ తన జాతీయ పార్టీకి మద్దతుగా లేదా అనుకూలంగా ఎటువంటి ప్రకటనా చేయకపోవడమేనా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గతంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల కోణంలో ఆయనతో సమావేశం అయ్యారు. 2018 ముందస్తు ఎన్నికల్లో గెలిచిన తర్వాత వెళ్లి చర్చలు జరిపారు.
సరే ఇప్పుడ కేసీఆర్ జాతీయ రాజకీయాలలో వేలే కాదు.. రెండు కాళ్లూ పెట్టేశారు. కలిసి వస్తారని అనుకున్నా.. అనుకోకపోయినా.. బీజేపీయేతర పార్టీల నేతలందరినీ కలిసి మద్దతు కోరాల్సిన అవసరం ఇప్పుడు కేసీఆర్ కు ఎంతో ఉంది. అయినా స్వయంగా నవీన్ పట్నాయక్ తెలంగాణలో అడుగిడినా ఆయనతో చర్చలు జరపలేదు.
ఆయన సరే హస్తిన లో ఉన్నారు. కానీ బీఆర్ఎస్ కు మద్దతు కోరుతూ ఆయన తరఫున మరెవరైనా.. మరెవరి దాకాలో ఎందుకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కుమారుడు కేటీఆర్ ను అయినా నవీన్ పట్నాయక్ వద్దకు పంపి ఉండాలి అలాగా చేయలేదు. దీంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల విషయంలో పునరాలోచిస్తున్నారా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. బీఆర్ఎస్ ప్రకటన అయితే చేసేశారు కానీ.. దానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎటువంటి అడుగులూ వేయకపోవడమే తమ అనుమానాలకు కారణమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.