షర్మిల వాంగ్మూలం.. జగన్ చిందులు.. విజయమ్మ ఇబ్బందులు
posted on Nov 4, 2022 @ 4:07PM
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడం తాడేపల్లి ప్యాలెస్‌లో తీవ్ర ప్రకంపనలకు కారణమైందంటున్నారు. దీంతో షర్మిల ఎపిసోడ్‌పై జగన్.. నేరుగా తన తల్లీ, వైసీపీ మాజీ అధ్యక్షురాలు విజయమ్మకు ఫోన్ చేసి.. వైయస్ షర్మిల వ్యవహారశైలి పట్ల మండిపడినట్లు తెలుస్తోంది. వద్దు వద్దంటే.. తెలంగాణ వెళ్లి పార్టీ స్థాపించడంతోపాటు.. ఈ మూడున్నరేళ్లుగా చోటు చేసుకున్న వరుస పరిణామాలను ఈ సందర్భంగా ఫోన్‌లో జగన్ ఏకరువు పెట్టారని లోటస్ పాండ్‌లోని వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంపై వైయస్ విజయమ్మ.. మౌనంగానే విని.. కామ్‌గా ఉండిపోయారని లోటస్ పాండ్‌లోని నేతలు అంటున్నారు.
అయితే జగన్.. షర్మిలల మధ్య ఏర్పడిన దూరం.. తగ్గాలంటే ఏం చేయాలో అర్థం కావడం లేదని విజయమ్మ... తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు చెబుతున్నారు. వివేకా హత్య కేసులో నిందితుల్లో ఒకరైన దస్తగిరి అప్రూవర్‌గా మారి సీబీఐ ఎదుట చేసిన వ్యాఖ్యలే... తాజాగా షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారని.. అలాగే తన తండ్రి హత్య కేసులో సోదరుడు సీఎం జగన్ అనుసరిస్తున్న వైఖరి పట్ల.. వై వివేకా కుమార్తె సునీత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని... ఈ నేపథ్యంలోనే ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించి.. ఈ కేసు మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారని.. అలాంటి వేళ షర్మిల ఇలా వాంగ్మూలం ఇవ్వడాన్ని ఆమె సోదరుడు,ఏపీ సీఎం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు.. షర్మిల వాంగ్మూలం అంటూ మీడియాలో వచ్చిన వార్తలను ప్రతిపక్ష టీడీపీ ఓ ఆస్త్రంగా మలుచుకుని రచ్చ రచ్చ చేసి పెడుతోందని.. ఇది జగన్ పార్టీకి గట్టి దెబ్బేనని కూడా అంటున్నారు. మరో వైపు ఉమ్మడి కడప జిల్లాలో వివేకా హత్య ఎవరు చేశారు.. ఎందుకు చేశారు... ఈ హత్య కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టినా ఎందుకు ముందుకు సాగడం లేదనే అంశాలపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏన్నికల్లో కూడా విజయం సాధించి మరో సారి ఏపీలో అధికార పగ్గాలు చేపట్టాలన్న జగన్ ఆకాంక్షలకు షర్మిల కారణంగా విఘాతం కలుగడం తథ్యమని రాజకీయ పరిశీలకుల విశ్లేషిస్తున్నారు.