బాలయ్య షోకు షర్మిల.. చంద్రబాబు వ్యూహమేనా?
posted on Nov 4, 2022 @ 3:35PM
ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఏపీ సీఎం వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిల.. త్వరలో భేటీ కానున్నారు. ఔను నిజమే.. షర్మిల బాలకృష్ణలు భేటీ అవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఇది నిజంగా సంచలన వార్తే. అయితే వారిరువురూ కలుసుకునేది రాజకీయ వేదిక మీద కాదు. నందమూరి బాలకృష్ణ ఓటీటీలో చేస్తున్న అన్‌స్టాపబుల్ షో కు చీఫ్ గెస్ట్ గా షర్మిల హాజరు కానున్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో సీజన్ 2 నడుస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు పాల్గొని సందడి చేశారు. ఆ సందర్భంగా 1995 అగస్టులో తెలుగుదేశం సంక్షోభానికి సంబంధించి కీలక వివరాలు, నాడు ఎన్టీఆర్ పై పార్టీ తిరుగుబాటుకు దారి తీసిన పరిస్థితుల గురించి సంచలన వివరాలను చంద్రబాబు వెల్లడించారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కు స్వయాన సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల హాజరు కానున్నారన్న సంగతి తెలుగు రాష్ట్రాలలో ఆ షో పట్ల విపరీతమైన ఆసక్తి పెంచేసింది.
సీఎం జగన్ కు స్వయాన బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐకీ షర్మిల వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై జగన్ ఫైర్ అయ్యారనీ వార్తలు వినవస్తున్నాయి. వివేకా హత్య కేసు విషయంలో తన సోదరుడు జగన్ కు ఇష్టం లేకపోయినా షర్మిల సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడం తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన సంగతి విదితమే. వివేకా హత్య తమ కుటుంబంలో అత్యంత విషాద సంఘటనగా పేర్కొన్న షర్మిల.. తన బాబాయ్ ని హత్య చేసిన వారూ, అందుకు కారకులు ఎవరో అందరికీ తెలియాలి, వారికి శిక్ష పడాలని పేర్కొన్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా కడప ఎంపీ సీటు కోసమే తన బాబాయ్ హత్య జరిగిందని, ఇది వాస్తవమని ఆమె ఢిల్లీలో మీడియాముఖంగా చెప్పారు.
ఈ నేపథ్యంలోనే షర్మిలపై ఏపీ సీఎం జగన్ తీవ్ర ఆగ్రహంతో రగలిపోతున్నారని రాజకీయ వర్గాలలో ముఖ్యంగా వైసీపీ వర్గాలలో వినిపిస్తోంది. అలాగే తెలంగాణలో షర్మిల.. సుదీర్ఘ పాదయాత్ర ఇప్పటికే 3000 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. తన యాత్ర పొడవునా అమె తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా విమర్శలు గుప్పించడమే కాకుండా... తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కోట్లాది రూపాయిల అవినీతి మేట వేసిందంటూ.. ఢిల్లీకి వెళ్లీ మరీ సీబీఐకి సైతం ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఏ విషయమైనా నిర్భయంగా మాట్లాడతారన్న నమ్మకం జనంలో ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే బాలయ్య టాక్ షోలో షర్మిల మరిన్న సంచలన విషయాలు వెల్లడిస్తారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. దీంతో షర్మిల పాల్గొనబోయే ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా చేస్తున్నారు.
మరో వైపు తన అన్నపై వ్యతిరేకతతో షర్మిల ఏపీలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కాగా కొందరు మాత్రం బాలయ్య టాక్ షోకు షర్మిల రావడం తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యూహమా అన్న సందేహాలూ వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద షర్మిల బాలయ్య షోకు హాజరు కావడం ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ హాట్ టాపిక్ గా మారిపోయింది.