తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా కాసాని జ్ణానేశ్వర్
posted on Nov 4, 2022 @ 5:23PM
మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ను తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. ఇప్పటి వరకూ ఆ స్థానంలో ఉన్న బక్కిని నరసింహుని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో కాసాని జ్ణానేశ్వర్ ఇటీవలే తెలుగుదేశం గూటికి చేరిన సంగతి విదితమే. బీసీ నాయకుడిగా గట్టి పట్టున్న నాయకుడిగా కాసానికి గుర్తింపు ఉంది. గత కొంత కాలంగా కాసాని రాజకీయంగా క్రియాశీలంగా లేకపోయినా.. ముదిరాజ్ సామానిక వర్గానికి చెందిన కాసానికి బీసీలలో గట్టి పట్టు ఉందని అంటారు. 2018 ఎన్నికలలో ఆయన సికిందరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అబ్యర్థిగా పోటీ చేశారు
ఆ ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు. అంతకు ముందు ఆయన రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పని చేశారు. అయితే ఆయనను తమ పార్టీలో చేర్చుకోవాలని టీఆర్ఎస్, బీజేపీలు తమ వంతు ప్రయత్నాలు చేశాయంటేనా కాసాని ప్రాముఖ్యత అర్ధమౌతుంది. ఇటీవల ఆయనను హరీష్ రావు కలిసి చర్చించినట్లు చెబుతారు.
అలాగే బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ కూడా జ్ణానేశ్వర్ కు కలిసి కమలం గూటికి రావలసిందిగా కోరారు. అయితే జ్ణానేశ్వర్ మాత్రం తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపి చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఆయనను చంద్రబాబు తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా నియమించారు.