వైసీపీ ఆత్రం.. కేంద్రానికి పత్రం!
posted on Nov 4, 2013 9:03AM
వైసీపీ మొదట్లో తెలంగాణ ఇచ్చేయండోచ్ అని నినదించింది. ఆ తర్వాత సమన్యాయం చేయండి దేవుడోయ్ అని రోదించింది. ఇప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందే అని మొత్తుకుంటోంది. ఈ విధంగా సమయానుకూలంగా స్లోగన్ మార్చుకున్న వైసీపీ ఇప్పుడు తనను తాను సమైక్య చాంపియన్‌గా ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం ఆత్రం ప్రదర్శిస్తోంది.
సమైక్య పోరులో తాను తెలుగుదేశం పార్టీకంటే ముందు వున్నానని కలరింగ్ ఇవ్వడం కోసం తంటాలు పడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడం తనకెంతమాత్రం ఇష్టంలేదని కేంద్రానికి లేఖ రాసింది. తెలుగుదేశం కంటే తానే సమైక్య పోరులో ముందున్నానని చెప్పుకోవడం కోసమే వైసీపీ ఆత్రంగా లేఖరాసిందే తప్ప, వైసీపీలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న చిత్తశుద్ధి కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ తెలివితేటలు రాష్ట్ర విభజన ప్రకటన రాకముందు ఉంటే బాగుండేదని అంటున్నారు.
రాష్ట్రాన్ని విభజించే పథకంలో భాగంగానే సోనియా గాంధీ జగన్‌కి బెయిల్ ఇప్పించిందని, సోనియా ఆదేశాలకు అనుగుణంగానే జగన్ నడుస్తున్నాడని రాష్ట్రంలో ఎవర్నడిగినా చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో జగన్ సీమాంధ్రులను నమ్మించడానికి ఎన్ని పథకాలు వేసినా ప్రయోజనం ఉండే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించడానికి వీల్లేదంటూ సీపీఎం కేంద్రానికి తాజాగా లేఖ రాసింది. సీపీఎం లేఖ రాయడంలో కనిపించిన చిత్తశుద్ధి, నిజాయితీ వైపీపీ లేఖ రాయడంలో కనిపించడం లేదని అంటున్నారు.