టీఆర్ఎస్ గొంతెమ్మ కోర్కెలు
posted on Nov 4, 2013 8:58AM
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్ర మంత్రుల బృందానికి ఒక నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో కేంద్రానికి బోలెడన్ని డిమాండ్లు రాసింది. ఆ బోలెడన్ని డిమాండ్లలో కొన్ని డిమాండ్లు బయటి ప్రపంచానికి తెలిజేసింది. సీమాంధ్రుల గుండెలు ఆగిపోయేలా వున్న ఆ డిమాండ్లను రాజకీయ విశ్లేషకులు గొంతెమ్మ కోర్కెలుగా అభివర్ణిస్తున్నారు. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణకి తప్ప టీఆర్ఎస్ మరి దేనికీ ఒప్పుకోదట.
విభజన తర్వాత హైదరాబాద్‌ని మూడేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా కాకుండా సీమాంధ్రకు తాత్కాలిక రాజధానిగా మాత్రమే ఉంచాలట. తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను కేంద్రమే నిర్మించాలట. పదిహేను వందల మెగావాట్ల విద్యుత్‌ని కేంద్రమే ఇవ్వాలట. సీమాంధ్రులు సాధ్యమైనంత త్వరగా రాజధానిని నిర్మించుకునేలా ఒత్తిడి తేవాలట.
అక్కడితో ఆగారా... 1956 కంటే ముందున్న ఆస్తులన్నీ తెలంగాణ ప్రభుత్వానికే ఇచ్చేయాలట. వాటిమీద కేంద్రానికి హక్కులు ఉండకూడదట. సింగరేణి కూడా తెలంగాణ రాష్ట్రానికే సొంతం చేసేయాలట. ఇక్కడితో ఆగితే పర్లేదనుకోవచ్చు. ఏకంగా ఢిల్లీలో వున్న ఏపీ భవన్ కూడా తెలంగాణకే ఇచ్చేయాలట. బయటకి తెలిసినవే ఇంత దారుణంగా వున్నాయి... ఇక లేఖలో ఇంకెన్ని గొంతెమ్మ కోర్కెలు ఉన్నాయోనని పరిశీలకులు అనుమానిస్తున్నారు.