రాజయ్యకు 14 రోజుల రిమాండ్.. పోలీసుల అదుపులో అనిల్ రెండో భార్య
posted on Nov 6, 2015 @ 9:39AM
కాంగ్రస్ అభ్యర్ధి సిరిసిల్ల రాజయ్యను, అతని భార్య మాధవి, కొడుకు అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో వారి ముగ్గురికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. మామునూరు పోలీసులు వారికి వైద్య పరీక్షల నిమిత్తం గురువారం రాత్రి ఎంజిఎం ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడి నుండి అనంతరం హన్మకొండలోని ఎక్సైజ్ కాలనీలో నాలుగో అదనపు మున్సిఫ్ కోర్టు ఇంఛార్జ్ మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశ పెట్టారు. అక్కడ వారికి 14 రోజుల రిమాండ్ విధించడంతో వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవలు అతి దారుణంగా మృతి చెందిన సంగతి విదితమే.
ఇదిలా ఉండగా సారిక మృతి కేసులో అనిల్ రెండో భార్య సనాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సారిక మృతిపై సనా పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే గతంలో ఒకసారి సారిక బేగంపేట పీఎస్ లో సనాపై, సారిక ఫిర్యాదు చేసింది. దీంతో సారిక అనుమానాస్పద మృతిపై సనా పాత్రపై పోలీసులు విచారణ చేస్తున్నారు.