కాంగ్రెస్ గాడిన పడదా? కుమ్ములాటలకు ఎండ్ లేదా?
posted on Jul 3, 2023 @ 2:30PM
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని సాకారం చేసిన పార్టీ అందులో ఇసుమంతైనా సందేహం లేదు. తెలంగాణ ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) ఉద్యమ సారథిగా కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. సోనియా గాంధీ రాజకీయ సంకల్పం వల్లే తెలంగాణ సాకారమైందని చెప్పుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది.
ఫలితం రాష్ట్రం ఇచ్చి కూడా తొమ్మిదేళ్ల పాటు అధికారానికి దూరమైంది. దూరం కావడమే కాదు.. రాష్ట్రంలో పార్టీ ఉనికి కూడా నామమాత్రమైంది. కాంగ్రెస్ టికెట్ పై అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలలో పలువురు కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పుణ్యమా అని గులాబి కండువా కప్పుకున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని అంతా భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్ఠానం తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి చేరిన రేవంత్ రెడ్డికి పార్టీ తెలంగాణ పగ్గాలు అప్పగించింది. ఎవరు ఔనన్నా కాదన్నా.. రేవంత్ టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాతే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంది. పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. జనబాహుల్యంలో కూడా కాంగ్రెస్ పట్ల ఆదరణ పెరిగింది. కానీ పార్టీ బలోపేతం కావడం కంటే.. తమ సీనియారిటీని కాదని బయట నుంచి వచ్చి చేరిన రేవంత్ కు పగ్గాలు అప్పగించడాన్ని పార్టీలోని కొందరు పెద్దలు జీర్ణించుకోలేకపోయారు.
వారిలో కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, వీహెచ్ వంటి నేతలు ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే.. రేవంత్ కు పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ను వీడి కమలం గూటికి చేరారు. సరే అదంతా పక్కన పెడితే అధిష్టానం జోక్యం వల్లనైతేనేమి, కర్నాటక ఫలితాల ప్రభావంతోనైతేనేమి? తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలకు ఫుల్ స్టాప్ కాకపోయినా కామా పడిందన్న భావన సర్వత్రా వ్యక్తమైంది. ముఖ్యంగా ఖమ్మంలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ జన గర్జన సభ సక్సెస్ కోసం విభేదాలు విస్మరించి నాయకులంతా సమష్టిగా కృషి చేశారు. కేసీఆర్ సర్కార్ ఖమ్మంలో రాహుల్ సభను అడ్డుకోవడానికి, ఆ సభకు జనం రాకుండా అవరోధాలు కల్పించడానికీ చేయగలిగినంతా చేసింది. ఎంత చేసినా సభ విజయవంతమైంది. జనం తండోపతండాలుగా రాహుల్ సభకు హాజరయ్యారు. ఇసుక వేస్తే రాలదన్నంతగా రాహుల్ సభకు జనం పోటెత్తారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలెత్తింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే ఇక తరువాయి అన్నంతగా పార్టీ శ్రేణుల్లో ధీమా వ్యక్తమైంది. అయితే రాహుల్ సభ సక్సెస్ అయ్యిందన్న ఉత్సాహం 24 గంటలు కూడా గడవకుండానే పార్టీ శ్రేణుల ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్లుగా భట్టి విక్రమార్క మాట్లాడారు. రేవంత్ కు సీఎం చాన్స్ లేదు అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. నేరుగా రేవంత్ పేరు ప్రస్తావించకపోయినా.. ఆయన కాంగ్రెస్ లోనే పుట్టిన వ్యక్తికి తప్ప మరొకరికి సీఎం పదవి దక్కే చాన్స్ లేదన్నారు. అక్కడితో ఆగకుండా టీపీసీసీ చీఫ్ హోదాలో షర్మిల తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలలో వేలుపెట్టడానికి అంగీకరించను అని రేవంత్ చెప్పిన మాటలను కూడా ఖండించారు. కాంగ్రెస్ పార్టీని తిట్టిన వారు కాంగ్రెైస్ లో ఉన్నారనీ, షర్మిల వస్తే తప్పేముందని పరోక్షంగా రాహుల్ మాటలను ఖండించారు.
దీంతో కాంగ్రెస్ లో ఐక్యత కనిపిస్తోందనీ, నేతలంతో ఏకతాటిపైకి వచ్చారనీ సంబరపడుతున్న క్యాడర్ ఉత్సాహంపై భట్టి నీళ్లు చల్లేశారు. కష్టపడి గెలిపించుకున్నా అంతర్గత కుమ్ములాటల కారణంగా ‘చే’ జేతులా అధికారాన్ని వదులుకోవడానికి రాష్ట్ర నాయకత్వం పోటీ పడుతుందని పార్టీ శ్రేణులే బాహాటంగా అంటున్నాయి. నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేయకుండా అధిష్ఠానం నిరోధించగలిగితేనే.. పార్టికి రాష్ట్రంలో ఏర్పడిన సానుకూల వాతావరణం ఎన్నికల వరకూ ఉంటుందనీ, లేకుంటే ఎగిసిపడిన కెరటంలా మళ్లీ పార్టీలో నిస్తేజం అలుముకుంటుందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.