ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడుగా సత్య కుమార్ ?
posted on Jul 3, 2023 @ 2:22PM
ఏపీ బీజేపీ అధ్యక్షుడు మార్పుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును తప్పించి ఆస్థానంలో మరో వ్యక్తిని నియమించాలని బిజెపి అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది. ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అయితే సోము వీర్రాజు మాత్రం తానే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరుకుంటున్నారు.
ఆయనకు ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ ధియోధర్ అండదండలు ఉండడంతో, వీర్రాజు అధ్యక్ష కుర్చిని వీడకుండా ఉండేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఏపీ బీజేపీలో వీర్రాజును వ్యతిరేకించే నాయకులు రోజు రోజుకు పెరుగుతూ ఉండటంతో అధిష్టానం ఆయన్ను మార్చాలనే ఆలోచనలో ఉంది. ఆయనపై వైసీపీ ముద్ర పడడం, వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీ రాష్ట్ర బీజేపీలో గ్రూపులు పెరిగిపోవడం వంటి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న అధిష్టానం ఆయనను మార్చాలని దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్లు సమాచారం.
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన వెంటనే ఏపీ బీజేపీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా బిజెపి జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ ను నియమించాలని బిజెపి అధిష్టానం పెద్దలు నిర్ణయించుకున్నట్లు విశ్వసినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
సత్య కుమార్ కు హై కమాండ్ పెద్దల వద్ద పలుకుబడి ఉండడం, ఆయన కూడా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని స్వీకరించాలనే ఆలోచనతో ఉండడం, ఆయనకు వీర్రాజు వ్యతిరేక వర్గం మద్దతు ఉండడం ఇవన్నీ కలిసివచ్చే అంశాలు.
సోము వీర్రాజు వైసీపీ అనుకూల వ్యక్తి అనే ముద్ర పడటంతో పాటు, బీజేపీ లోని చాలామంది నాయకులతో విభేదాలు ఉండడం, అలాగే బీజేపీ మిత్రపక్షం గా ఉన్న జనసేన ను కలుపుకు వెళ్లే విషయంలో వీర్రాజు చురుగ్గా వ్యవహరించకపోవడం, ఈ విషయంలో జనసేన వర్గాలలోనూ తీవ్రమైన అసంతృప్తి ఉండడం, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని వీర్రాజు స్థానంలో సత్యకుమార్ ను నియమించాలని అధిష్టానం పెద్దలు దాదాపుగా డిసైడ్ అయిపోయారట. ఇక సత్యకుమార్ విషయానికి వస్తే, ఏపీ బీజేపీ వ్యవహారాలలో చురుగ్గా పాల్గొనేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నారు.
దీంతో పాటు ఏపీలో వైసిపి ప్రభుత్వంపై సందర్భం వచ్చినప్పుడల్లా సత్య కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు. దీంతో ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ఏపీ బీజేపీలో గ్రూపుల గోల తగ్గుతుందనే నిర్ణయానికి బిజెపి అధిష్టానం పెద్దలు రావడంతోనే, సత్య కుమార్ వైపు వారు మొగ్గు చూపిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.
వైసీపీని విమర్శలతో ముప్పు తిప్పలు పెట్టడంలో సోము వీర్రాజు దారుణంగా విఫలమైయ్యారు. జనసేనతో దూరంగా ఉండటం కూడా ఆయనకు మైనస్ పాయింట్ అయింది. ఇటీవల.. పార్టీ ని వీడి.. టీడీపీలోని మారిన బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ.. వీర్రాజు పై విమర్శల బాణాలు వదిలారు. వీర్రాజు వల్లే తాను బీజేపీ ని వీడానని ఆయన అనడం.. వీర్రాజుపై బీజేపీ అధిష్టానం గుర్రుగా ఉండటానికి మరో కారణమైంది. అందువల్లే ఏపీ బీజేపీ అధ్యక్ష మార్పు ఆలోచన అనివార్యమైందని పరిశీలకులు భావిస్తున్నారు.