Read more!

వైసీపీ ఎన్నికల వ్యూహం దౌర్జన్యమేనా?

గోప్యత ఏమీ లేదు.. అంతా బరితెగింపే. వైసీపీ దృష్టిలో ఎన్నికల రణం అంటే భౌతిక దాడులతో పై చేయి సాధించడమే!  ఈ యుద్ధంలో శాంతి భద్రతల గురించిన పట్టింపే ఉండదు. తమ అరాచకాలను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే  పీఎస్ లపైనా దాడులే. ఏపీలో పరిస్థితి చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఆనవాలే కనిపించడం లేదని అనిపించక మానదు. 

బందరులో మాజీ మంత్రి పేర్ని నాని, ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లిలో అంబటి రాంబాబుల తీరు చూస్తే వైసీపీ మూడ్ ఏమిటన్నది ఇట్టే అవగతమైపోతుంది. మచిలీపట్నంలో వైసీపీ మూకలు పోలీస్ స్టేషన్ పై దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఇది స్వయంగా మాజీ మంత్రి పేర్ని నాని సమక్షంలో జరిగింది. దాడికి పాల్పడ్డ వారిపై కేసులు నమోదయ్యాయనుకోండి అది వేరే సంగతి.  ఇంత కాలం తమ అడుగులకు మడుగులొత్తిన పోలీసులు.. ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే సిన్సియర్ గా డ్యూటీలు ఎలా చేస్తారు. అలా చేస్తే మేం ఎందుకు సహిస్తాం అంటున్నట్లు ఉంది మచిలీపట్నంలో పోలీసు స్టేషన్ పై జరిగిన దాడి. నిజమే నిన్నటి దాకా జీహుజూర్ అన్న వాళ్లు ఇవ్వాళ తలెగరేస్తే ఎలా? కాస్త చూసీ చూడనట్లు వదిలేయండి అని ఎదురు పోలీసులకే వారి పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయా అన్న అనుమానాలు విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. 

మొన్నటికి మొన్న ఒంగోలు ఎంపీ బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో గాయపడిన తెలుగుదేశం నాయకుడు మేడికొండ మోహనరావు, కార్యకర్తలు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుంటే బాలినేని తన కుమారుడు ప్రణీత్ రెడ్డి అనుచరులను వెంటపెట్టుకుని వెళ్లి మరీ ఆస్పత్రిలో బీభత్సం సృష్టించారు. బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై తెలుగుదేశం తరఫున ఒంగోలు లోక్ సభ స్థానంలో పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తెలుగుదేశం ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి దామచర్ల జనార్ధన్ లు ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కానీ ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. అదే బాలినేని చేసిన ఫిర్యాదుపై తక్షణం స్పందించిన పోలీసులు తెలుగుదేశం నాయకులపై కేసులు నమోదు చేశారు. నిజంగానే ఏపీలో ఎన్నికల కోడ్ అమలౌతోందా అన్న అనుమానాలు కలగడానికి ఇటువంటి  ఘటనలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ రెండు సంఘటనలూ మచ్చుకు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అరాచకాలకు పోలీసులు కొమ్ము కాస్తూనే ఉన్నారు. 

ఇక సత్తెన పల్లి వైసీపీ అభ్యర్థి అంబటిరాంబాబు  అక్రమంగా మద్యం బాటిళ్లు తరలిస్తున్న ఇద్దరు యువకులను విడిపించుకోవడానికి చేసిన హంగామా మరో ఎత్తుకు చేరింది. యువకులను వదిలేయడమే కాదు.. మద్యం బాటిళ్లను కూడా తిరిగి ఇచ్చేయాలంటూ ఆయన పట్టుబట్టారు. అందుకు అధికారులు నిరాకరించడంతో మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే. అప్పుడు మీ అంతు చూస్తామంటూ బహిరంగంగా బెదరింపులకు దిగారు.   ఈ సంఘటనలన్నీ బహిరంగంగా జనం చూస్తుండగా జరిగినవే. అయినా ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ల లేదంటే నమ్మలేం. ఎన్నికల సంఘం వేగంగా స్పందించకుంటే ఆ వ్యవస్థపై జనంలో  అంతో ఇంతో ఇంకా ఉన్న నమ్మకం కూడా పోతుందని పరిశీలకులు అంటున్నారు.