Read more!

ఓసి నీ రేటు బంగారంగానూ!

ఏవమ్మా బంగారమ్మా... ఏంటి నీ వరస? రోజురోజుకీ రేటు  పెంచేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. రెండో దశ కరోనా  సంక్షోభానికి ముందు నీ రేటు దగ్గర దగ్గరగా తులం 40 వేలు.  జస్ట్ మూడేళ్ళ గ్యాప్‌లో నీ రేటుని తులానికి 75 వేలకు  పెంచేసుకున్నావ్. గతంలో భారతీయులకు నగల మీద మోజు  ఎక్కువ కాబట్టి, వాళ్ళ వల్ల బంగారానికి డిమాండ్ క్రియేట్  అయ్యేది. తద్వారా రేటు పెరిగింది.

ఈ మధ్యకాలంలో  భారతీయుల కొనుగోలు శక్తి ఏమంత పెరగలేదే? అయినా  నువ్వెందుకు ఈ రేంజ్‌లో పెరిగిపోతున్నావేంటా అని ఆలోచిస్తే  కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. అంతర్జాతీయంగా  బంగారానికి డిమాండ్ పెరగడం, బంగారం గనుల్లో సమ్మె  జరుగుతూ వుండటం వల్ల అవసరమైనంత బంగారం ఉత్పత్తి  జరగడం లేదు. దాంతో డిమాండ్ క్రియేటయింది. ఫలితం.. నీ  రేటు పెరిగిపోతోంది. అంతర్జాతీయంగా ఎప్పటికప్పుడు  మారుతున్న పరిణామాలు నీ ధరని భారీ స్థాయిలో  పెంచేస్తున్నాయి.

తాజాగా పశ్చిమాసియాలో నెలకున్న  పరిస్థితులు కూడా నీ రేటు పెంచేశాయి. సిరియాలోని తమ   రాయబారి కార్యాలయంపై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ మీద  ఇరాన్ ఏ క్షణంలో అయినా దాడి చేయొచ్చని వినిపిస్తున్న  వార్తల కారణంగా నువ్వు నెత్తికెక్కి కూర్చుంటున్నావ్. ప్రపంచ  వ్యాప్తంగా బ్యాంకులు కూడా తమ దగ్గర  డబ్బుని బంగారం  రూపంలో మార్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రపంచ  వ్యాప్తంగా వున్న పెద్దపెద్ద బ్యాంకులు కిలోలు రెండు కిలోలు  కాకుండా వేల కిలోల బంగారాన్ని కొనుగోలు చేస్తూ  వుండటంతో నీ రేటు కొండెక్కి కూర్చింది.

ఒకవైపు నీ రేటు  పెరిగి, బడుగు జనం బంగారాన్ని కొనలేకపోతుంటే, నిన్ను  చూసి మరోవైపు నీ ఫ్రెండ్ వెండి రేటుని కూడా పెంచేస్తున్నారు.  మొన్నటి వరకు 75 వేల రూపాయలున్న వెండి కిలో ఇప్పుడు  88 వేల రూపాయలకు చేరుకుంది. మీరెప్పుడు దిగొస్తారో ఏంటో!