టీటీడీకి ఆర్టీఐ మినహాయింపు సమర్థనీయమేనా?
posted on Jul 13, 2023 @ 2:11PM
రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నది సామెత. మరి దేవుడి సొమ్ము.. అందులోనూ భక్తులు ముడుపుల రూపంలోనూ, విరాళాల రూపంలోనూ ఇచ్చిన సొమ్ము ఎవరి పాలు అవుతోంది. అది తెలుసుకునే హక్కు భక్తులందరికీ ఉంటుంది. అటువంటిది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం ఒక సారి భగవంతుడికి సమర్పించుకున్న తరువాత ఆ ముడుపుల సొమ్ము, హుండీ కానుకల సొత్తు ఎలా వ్యయం అవుతోంది. సద్వినియోగం అవుతోందా? లేదా? అన్న విషయాలను ఆరా తీసే హక్కు ఎవరికీ లేదంటోంది. భక్తులు స్వామి వారికి చెల్లించే మొక్కులు, విరాళాలతో తిరుమలలో భక్తులకు సౌకర్యాలు సమకూరుతాయని, దేశవ్యాప్తంగా దేవాలయాల నిర్మాణం, జీర్ణదేవాలయాల ఉద్ధరణ తదితర ధార్మిక కార్యక్రమాలకు వ్యయం చేస్తారన్నది భక్తుల విశ్వాసం. సాధారణంగా ప్రజలు ఇచ్చే విరాళాలతో చేపట్టే పనులకు పబ్లిక్ ఆడిట్ ఉండాలి. అంటే ఎలా ఖర్చు చేశారు? ఎందుకు ఖర్చు చేశారు అని అడిగితే జవాబు చెప్పే జవాబుదారీ తనం ఉండాలి. అయితే తిరుమలలో మాత్రం ఆ ప్రశక్తే లేదు అంటున్నారు. చివరాఖరికి టిటిడి ఆదాయ వ్యయాల వివరాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి కూడా రావుట. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కుండబద్దలు కొట్టినట్లు చెబుతోంది.
దేశ రక్షణ రహస్యాలకు సంబంధించిన అంశాలు తప్ప, మిగిలిన అన్ని రంగాలకూ సమాచార హక్కు చట్టం వర్తిస్తుంది. చివరాఖరికి కోర్టులు కూడా ఈ చట్ట పరిధిలోకే వస్తాయి. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం ఈ చట్ట పరిధిలోకి రాదు అంటోంది టీటీడీ. ఏమైనా అంటే తమది స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ అంటోంది. టీటీడీకి ప్రభుత్వంలో సంబంధం లేదని చెప్పుకుంటోంది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో, జేఈవో వంటి అధికారులను నియమించేది ప్రభుత్వమే. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ సభ్యులను నియమించేది కూడా రాష్ట్ర ప్రభుత్వమే. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత జంబో పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తే కోర్టులు అభ్యంతరం చెప్పాయి కూడా. నిజమే టీటీడీ స్వయం ప్రతిపత్తి సంస్థే అయినా ప్రభుత్వ అధీనంలో, ప్రభుత్వ అజమాయిషీలో పని చేస్తుంది. అటువంటి టీటీడీకి ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం) పరిథిలోకి రాకుండా మినహాయింపు ఇవ్వడమేమిటన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది. వేల కోట్ల రూపాయలు విరాళాలు పోగయ్యే ఒక దేవాలయంలో, తామిచ్చిన విరాళాలు ఏమవుతున్నాయో.. తెలుసుకునే హక్కు భక్తులకు లేదనడం ఎంత మాత్రం సమంజసం కాదంటున్నారు. అన్నిటికీ మించి గత కొన్నేళ్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో , శ్రీవాణి ట్రస్టు లో అవకతవకలు జరిగాయంటూ రాజకీయ విమర్శలు కూడా వెల్లువెత్తున్న తరుణంలో టిటిడీని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
గతంలో స్వామి వారి పింక్ డైమండ్ మాయమైందని, అది చంద్రబాబు ఇంట్లో ఉందంటూ నాటి ప్రధానార్చకుడు రమణ దీక్షితులు, ఎంపి విజయసాయిరెడ్డి ఆరోపించారు. దానిపై అప్పటి టీటీడీ పావకవర్గం వారిపై పరువునష్టం దావా దాఖలైంది. దానికి సంబంధించి 2 కోట్ల రూపాయల ఫీజును టీడీపీ కోర్టుకు చెల్లించింది. ఇప్పుడు ఆ డబ్బు కోర్టులోనే డిపాజిట్ రూపంలో ఉంది.
ప్రభుత్వం మారి, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇన్చార్జి జేఈఓ ధర్మారెడ్డి.. అసలు వెంకన్నకు పింక్ డైమండ్ లేదని, మీడియా సమక్షంలోనే వెల్లడించారు. అంటే వ్యక్తులు చేసిన ఆరోపణలకు, టీటీడీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చిందన్న మాట. మరి ఆ 2 కోట్ల రూపాయలు ఎవరి ఖాతా నుంచి వసూలు చేస్తారన్నది ప్రశ్న.
రోజుకు ఎన్ని టిక్కెట్లు అమ్ముతున్నారు? వాటికి వచ్చేదంత? రోజుకు వీవీఐపీల దర్శనాలు ఎన్ని అనుమతిస్తున్నారు? అందులో జడ్జిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు ఎంతమంది? అన్న వివరాలను భక్తులకు ఇవ్వాల్సిన బాధ్యత టీటీడీ అధికారులదేనంటున్నారు. తమ డబ్బుకు లెక్క అడిగే హక్కు తమకుందన్నది భక్తుల వాదన.
జస్టిస్ కోదండరామ్ సింగిల్‌బెంచ్ జడ్జిగా ఉన్నప్పుడు.. 2018లో ప్రభుత్వ నిధులతో సంబంధం లేని దేవాలయాలను, ఆర్టీఐ నుంచి మినహాయింపు ఇస్తూ తీర్పు వెలువ డింది. అయితే, దానిపై అనేక రిట్ అప్పీళ్లు అప్పటినుంచీ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
సేవా టికెట్లు, వీఐపీ, ప్రొటోకాల్ దర్వనాలు, టీటీడీ చానెల్‌కు భక్తులిచ్చే విరాళాల్లో అవకవతకలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ని ఆరోపణలను ఎదుర్కొంటున్న టీటీడీకి ఆర్టీఐ నుంచి మినహాయింపు ఇవ్వడం ఎంత మాత్రం సమంజసం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీటీడీ రక్షణ శాఖ కాదనీ, అన్ని ప్రభుత్వ శాఖల మాదిరిగానే టీటీడీనీ ఆర్టీఐ పరిథిలోకి తీసుకురావాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.