నానక్ రామ్ గూడాలో వాలంటీర్ల హెడ్ ఆఫీస్!
posted on Jul 13, 2023 @ 1:51PM
ఏపీలో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఏపీలో మానవ అక్రమ రవాణాకు వాలంటీర్లు కారణమవుతున్నారని వారాహీ రెండో విడత యాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 18 వేల మంది మహిళల మిస్సింగ్ కు వాలంటీర్ వ్యవస్థే కారణం అనేలా పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలు, యువతుల సమాచారాన్ని వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులకు చేరవేయడంతో పాటు వాళ్లను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా వాలంటీర్లు తీవ్రంగా స్పందించగా.. పవన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఏపీ మహిళా కమిషన్ సైతం పవన్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులు పంపారు.
అయితే, పవన్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. వాలంటీర్ల పొట్టకొట్టాలని తానెప్పుడూ అనుకోలేదని అంటూనే కోడిపిల్లలను గద్దలు తన్నుకు వెళ్ళినట్లుగా వాలంటీర్లు వ్యవహరిస్తున్నారంటూ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల జీతం భూమ్ భూమ్ కి తక్కువ, ఆంధ్ర గోల్డ్ కు ఎక్కువ అని సానుభూతి చూపిస్తూనే చాలా చోట్ల వాలంటీర్లు ప్రజలను వేధిస్తున్నారని, ఈ వ్యవస్థలో కొందరు కిరాతకులు ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదంటూ.. కొందరు వాలంటీర్లు ఎర్రచందనం రవాణాలో, మద్యం అక్రమ రవాణాలో, దోపిడీ ఘటనల్లో పట్టుబడడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆడపిల్లలు భయపెట్టి, వాళ్లు లొంగకపోతే పథకాలు తొలగిస్తామని కొందరు వాలంటీర్లు భయపెడుతున్నారని ఆరోపించారు.
అదే సమయంలో ఏపీలో వాలంటీర్లు సేకరించే డేటా మొత్తం హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని హెడ్ ఆఫీసుకు వెళ్తుందని మరో కొత్త ఆరోపణను తెర మీదకి తెచ్చారు. వాలంటీర్ల వ్యవస్ధ హెడ్ ఆఫీసు హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో ఉందని, ఇక్కడ 700 మంది ఉద్యోగులున్నారని పవన్ చెప్పారు. నానక్ రామ్ గూడలోని సంస్థలో ఏపీ డేటా ఎందుకు పెట్టారని.. ఏపీ ప్రజల డేటాను ఆ సంస్థలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెడ్ క్రాస్ సంస్థకు దేశంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్ అధిపతిగా ఉన్నారని.. మరి సీఎం జగన్ వాలంటీరు వ్యవస్థకు ఎవరు అధిపతి అని ప్రశ్నించారు. జగనన్నే నేరం చేసి జైల్లోకి వెళ్లి వచ్చారు.. మేం కూడా జైలుకెళ్లొచ్చి నాయకులవుతామనే ధీమాతో కొందరు వాలంటీర్లు ఉన్నారని సెటైర్లు వేశారు.
పవన్ చేసిన మిగతా ఆరోపణల సంగతి ఎలా ఉన్నా నానక్ రామ్ గూడకి తరలివెళ్తున్న ఏపీ డేటా ఆరోపణ మాత్రం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తున్నది. నిజంగానే ఏపీ వ్యాప్తంగా ఉన్న వాలంటీర్ల వద్ద ప్రతి ఇంటికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం మొత్తం ఉంటుంది. ఈ డేటాను వైసీపీకి సంబంధించిన ప్రైవేట్ కార్యాలయాలకు తరలిస్తున్నారా? లేక ఈ డేటా వ్యవహారాన్ని వైసీపీ ఏదైనా ప్రైవేట్ సంస్థకు అప్పగించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేపు ఎన్నికలలో ఈ డేటా ఉపయోగించి ప్రజలను బెదిరించి, ఆశజూపి, మభ్యపెట్టి ఓట్లుగా మలచుకునే అవకాశాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వైసీపీ ఆ తరహా ఆలోచనతోనే ప్రజల డేటాను నానక్ రామ్ గూడ కార్యాలయానికి తరలిస్తున్నదా అన్న సందేహాలూ వ్యక్తమౌతున్నాయి. నానక్ రామ్ గూడ ఆఫీసు గురించి ఎలాంటి సమాచారం లేకుండా అయితే పవన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపించడం లేదు. ఏదో సమాచారం సేకరించే నానక్ రామ్ గూడ పేరు బయటకి చెప్పినట్లు కనిపిస్తుంది. ఇది తీవ్రమైన అంశం, తీవ్రమైన ఆరోపణ కనుక ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.