ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తన గొయ్యి తానే తవ్వుకుంటోందా?
posted on Feb 21, 2020 @ 2:39PM
ఆంధ్రప్రదేశ్ లో సొంతంగానే బలపడతాం అని ప్రతి రోజూ ప్రకటనలు గుప్పిస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది అంటే? భలే ప్రశ్న అడిగారండి, ఆ విషయం ఆ పార్టీ నాయకులకే తెలియడం లేదు మనకేం తెలుస్తుంది? అంటున్నారు జనాలు. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి రెండు పడవలపై కాళ్లు పెట్టి అటూ ఇటు కాకుండా పోతోంది. అధికార వైసిసి పట్ల ఏం వైఖరి అవలంబించాలనే విషయంలో పార్టీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది.
వైసిపి లోక్ సభ సభ్యులతో బిజెపికి పని లేకపోయినా రాజ్యసభ సభ్యులతో మాత్రం ఆ పార్టీకి ఇంకా పని ఉంది. పైగా వచ్చే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలతో తెలుగుదేశం పార్టీకి ఉన్న సీట్లు బాగా తగ్గి అన్ని సీట్లూ వైసీపీకి రాబోతున్నాయి. అందువల్ల వైసిపి రాజ్యసభ సభ్యులతో బిజెపికి పని ఉంది. ఈ కారణంతో ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి వేస్తోంది.
ఈ బలహీనతతో బాటు వైసిపిని పూర్తిగా కట్టడి చేస్తే మళ్లీ తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందేమోననే అనుమానం, బెంగ బిజెపిని పట్టి పీడిస్తున్నాయి. అందుకోసం కూడా బిజెపి అనుకున్న విధంగా వైసీపీని కట్టడి చేయలేకపోతున్నట్టు కనపడుతుంది. వైసిపికి వ్యతిరేకంగా పూర్తి స్థాయి ఉద్యమం నడుపుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు విపరీతమైన స్పందన వస్తోంది.
జనసేన పార్టీ నిర్మాణం పూర్తిగా లేకపోయినా ఆయన చేపడుతున్న కార్యక్రమాలతో ప్రజల్లో తిరుగుబాటు మనస్తత్వం కనపడుతోంది.. పవన్ కల్యాణ్ వెనుక ఉండేది అందరూ యూత్ కాబట్టి ఆయన మాటలపై వారికి విశ్వాసం ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో వేగంగా విస్తరిస్తోంది.
అయితే పవన్ కళ్యాణ్ కు పార్టీ నిర్మాణం చేయడం, అందుకు ఆర్ధిక వనరులు లేకపోవడం లాంటి బలహీనతలు ఉన్నాయి. ఈ బలహీనతలను ఆసరాగా చేసుకుని జనసేన తమ ఆధీనంలోకి వచ్చే విధంగా బిజెపి చేసుకుంది. ఈ ఎత్తుగడతో వైసిపికి వ్యతిరేకంగా ఉద్యమం చేసే పవన్ కల్యాణ్ ను కూడా కట్టడి చేసి వైసిపిని బిజెపి అన్ని రకాలుగా రక్షిస్తున్నట్టు సామాన్యులు సైతం అనుకుంటున్నారు.
అమరావతి నుంచి రాజధానిని ఎత్తేయడం పై ఒక దశలో పెద్ద ఎత్తున వచ్చిన ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనేందుకు బిజెపి ముందుకు వచ్చింది. అయితే కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతోనే బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆ ఉద్యమాన్ని పూర్తిగా నీరుగార్చే విధంగా మాట్లాడారని ప్రజలు అనుకుంటున్నారు.
జీవీఎల్ చేస్తున్న వ్యాఖ్యలకు అనుగుణంగానే కేంద్రం నుంచి సంకేతాలు వస్తుండటంలో రాష్ట్ర బిజెపి పూర్తిగా నీరుగారి పోయింది. ఉద్యమం చేస్తున్న పవన్ కల్యాణ్ ను కూడా చల్లార్చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అధికారం లోకి వచ్చిన తర్వాత మాట మార్చిన బిజెపి తొలి ఐదేళ్లలో ఏపిలో బిజెపి పెరిగే అవకాశాన్ని చేజేతులా కొల్పోవడమే కాక ఏపి ప్రజలకు విరోధిగా మారింది. తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయిన తర్వాత బీజేపీకి ఏపిలో మళ్లీ పెరిగే అవకాశం వచ్చింది. అయితే అమరావతి తరలింపు తదితర అంశాలకు పరోక్షంగా మద్దతు ఇస్తూ బిజెపి తన పెరుగుదలకు తానే పాతర వేసుకుంటోంది.
ఆంధ్రా రాజకీయాల్లో కమలం పార్టీ కన్స్యూజన్ లో ఉందని, తాజా పరిణామాలతో నేతలు అయోమయంలో వున్నారన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ఆంధ్ర నాయకులు ఒకలా.. ఢిల్లీ నాయకులు మరోలా మాట్లాడుతూ నానా గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. మూడు రాజధానుల నుంచి మండలి రద్దు అంశం వరకూ బీజేపీ నేతల వైఖరి భిన్నమైన దారుల్లో వెళ్లడంతో రాష్ట్ర పార్టీ వ్యూహానికి కేంద్ర ప్రభుత్వ వ్యూహానికి తేడా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కమలం పార్టీలో అసలేం జరుగుతోందో అర్థంకాక నేతలతో పాటు జనాలు కూడా జుట్టు పీక్కుంటున్నారు.
ఈ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, వైసీపీలను వ్యతిరేకించినా ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎంచుకునే పరిస్థితులు లేకుండా పోతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు.