Read more!

విశాఖ ఉక్కు ఉద్యమ స్ఫూర్తితో అమరావతి పరిరక్షణ.. ఒకే రాజధానికి పెరుగుతున్న డిమాండ్

60వ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' నినాదం మార్మోగింది. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు విశాఖలో ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమించి భారీ ఉద్యమం చేసి దాన్ని సాధించుకున్నారు. కానీ దాదాపు అర్ధ శతాబ్దం తర్వాత అమరావతిలో విభజన ఏపీ రాజధాని కోసం ప్రజలు ఉద్యమిస్తున్నారు. అయితే విశాఖ ఉక్కు ఉద్యమం నాటి పరిస్ధితులు మాత్రం కనిపించడం లేదు. విశాఖ ఉక్కు వల్ల మిగతా ప్రాంతాలకు ఎలాంటి లాభనష్టాలు లేకపోయినా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉద్యమించిన ప్రజలు ఇప్పుడు అమరావతి నుంచి రాజధాని తరలింపు వల్ల నష్టమని తెలిసినా కూడా ఉద్యమాన్ని మాత్రం ఎందుకు తమదిగా భావించలేకపోతున్నారు?

1965లో కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఐదు ప్రాంతాల్లో భారీ ఉక్కు కర్మాగారాల్ని నిర్మించాలని భావించింది. అందులో విశాఖపట్నం కూడా ఒకటి. అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కూడా దీనికి అంగీకరించారు. అయితే 1966లో శాస్త్రి మరణం తర్వాత ప్రధాని అయిన ఇందిరా గాంధీ తన రాజకీయ అవసరాల కోసం ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్ లో కాకుండా వేరే రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల  ప్రజలు కుల, మత, ప్రాంతాలకతీతంగా వ్యతిరేకించారు. ప్రస్తుత రాజధాని అమరావతిలోని తాడికొండకు చెందిన కాంగ్రెస్ దళిత నాయకుడు టి.అమృత రావు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి, సొంతపార్టీకి వ్యతిరేకంగా 1966 అక్టోబర్ 14న ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. విశాఖ ఉక్కు కోసం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఉద్యమంలో 32 మంది పోలీస్ కాల్పులలో ప్రాణాలు కోల్పోయారు. విశాఖలో ఉక్కు పరిశ్రమ రాకతో స్ధానికులకే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని తెలిసినా, మిగతా ప్రాంతాల వారు సంకుచితంగా ఆలోచించలేదు. ఉక్కు పరిశ్రమ రాకతో తెలుగు జాతి ఆర్ధికంగా వృద్ధి చెందుతుందని భావించారు. 

చివరికి ఎవ్నో పోరాటాల తర్వాత 1971 నుంచి ఉక్కు ఉత్పత్తి ప్రారంభమైంది. ఆ తర్వాత 90వ దశకం వరకూ కేంద్రంలో వివిధ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. నలుగురు ప్రధానులు కూడా మారారు. రాష్ట్రంలోనూ వివిధ పార్టీలు, 10 మంది ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చారు. రాజకీయ అవసరాల కోసమో, మరే ఇతర కారణాలతోనో విశాఖ స్టీల్ ప్లాంట్ ను మరో ప్రాంతానికి మార్చాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికీ రాలేదు. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 24 వేల ఎకరాల భూసేకరణ చేసిన అప్పటి ప్రభుత్వం..  మార్కెట్ ధర కన్నా 8 నుండి 10 రెట్లు ఎక్కువ నష్టపరిహారం కూడా ఇచ్చింది. భూములు కోల్పోయిన కుటుంబాలకు శిక్షణ ఇచ్చి, వేలాదిగా ఉద్యోగాలు కూడా ఇచ్చారు. ఇళ్ళు కోల్పోయిన వారికి ఇంటిస్థలం, ఇల్లు నిర్మించుకోవటానికి సాయం కూడా అందించారు.

కానీ గతేడాది డిసెంబర్ 17న అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన తర్వాత అమరావతి ప్రాంతంలో అనిశ్చితి మొదలైంది. వాస్తవానికి 2014 లో ప్రాంతీయ తత్వం కారణంగా ఏపీ విభజన జరిగితే, సెప్టెంబర్ 4వ తేదీన రాష్ట్ర రాజధాని విజయవాడ పరిసర ప్రాంతాలలో  నిర్మాణం చేయాలని అసెంబ్లీ లో అధికార, ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. రాజధానికి 29 వేల రైతు కుటుంబాల నుంచి 33 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ విధానంలో చేపట్టిన ఈ భూసేకరణలో భూములిచ్చిన రైతులకు 25 శాతం అభివృద్ధి చేసిన ప్లాట్లను, పదేళ్ల పాటు కౌలు తప్ప చంద్రబాబు ప్రభుత్వం మరో పరిహారం ఇవ్వలేదు. ఆ తర్వాత గతేడాది డిసెంబర్ లో వైసీపీ ప్రభుత్వం మూడేళ్లుగా అమరావతిలో ఉన్న సచివాలయం, హైకోర్టును విశాఖ, కర్నూలుకు తరలించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. ఆ తర్వాత దాన్ని సమర్ధించుకునేందుకు జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ నివేదికలను తెరపైకి తెచ్చింది. చివరికి 10 మంది మంత్రులతో కూడిన హై పవర్ కమిటీ నివేదిక ఆధారంగా మూడు రాజదానుల నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. అయితే మూడు రాజధానులకు ఉద్దేశించిన రెండు బిల్లులు అసెంబ్లీలో నెగ్గించుకున్నా.. మండలిలో మాత్రం ఛైర్మన్ వాటిని సెలక్ట్ కమిటీకి పంపడంతో ఈ నిర్ణయం భవితవ్యం ఏమిటన్నది ఇంకా తేలడం లేదు. 

అయితే మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న అమరావతి రాజధాని ప్రాంత ప్రజలు, రైతులు నిత్యం రోడ్లపై ఉద్యమాలు చేస్తున్నారు. కానీ మిగతా ప్రాంతాల నుంచి మాత్రం వారికి తగిన సహకారం, మద్దతు లభించడం లేదు. చివరికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ప్రతి రోజూ రాజధాని గ్రామాల్లో తిరుగుతూ అక్కడి ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. మరోవైపు సీఎం జగన్ తో పాటు వైసీపీ ప్రభుత్వ పెద్దలు మాత్రం మూడు రాజధానులకు మద్దతుగా మిగతా ప్రాంతాల్లో మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. అయితే ఇప్పటికే సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ వంటి కట్టడాలతో కుదురుకుంటున్న రాజధానిని తరలింపు చేపట్టడం అనేది వాస్తవంగా అవసరమా కాదా అన్నది ఇప్పుడు తేలాల్సిన అంశం. గతంలో విశాఖ ఉక్కు ఉద్యమంలో కుల, మత , ప్రాంతాలకు అతీతంగా పోరాడిన ప్రజలు ఇప్పుడు అమరావతిలోనే రాష్ట్ర రాజధాని ఉండాలన్న వాదనకు మద్దతుగా నిలవకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గతంలో విశాఖ ఉక్కు కోసం ఊరూవాడా ఉద్యమించిన ప్రజలు రాజధాని విషయంలోనూ అదే చొరవ, తెలువ చూపితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచే అవకాశం కూడా లభిస్తుంది. అదే సమయంలో మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా మీడియాత పాటు మేథావులు కూడా నిర్ణయాత్మక రీతిలో గొంతు విప్పితే అమరావతిలోనే రాజధాని ఉండాలన్న వాదనకు బలం చేకూరినట్లవుతుంది.